రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే..
కలెక్టర్లతో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కలెక్టర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈశా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్’ శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లతో శనివారం సచివాలయంలో చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రానున్న నాలుగు నెలల కాలానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిందిగా వారికి సూచించారు.
ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు చొరవ చూపాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల అనుమతులు ఒకేసారి ఇచ్చేందుకు వీలుగా త్వరలో ఈ బిజ్వెబ్ను ప్రారంభించనున్నట్లు తెలిపా రు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ నుంచి ఐదు కిలోల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయని,విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుంద న్నారు. కేంద్రం ఏర్పాటు చేసే 12 విద్యా సంస్థలకు అవసరమైన స్థల సేకరణకు నిధుల కొరత లేదన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు.
‘మిషన్ల’లో పాల్గొనేవారికీ శిక్షణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు మిషన్లలో భాగం పంచుకునే శాఖల అధికారులకు ఈశా ఫౌండేషన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అకడమిక్, ప్లానింగ్ విభాగం సంయుక్తంగా శిక్షణనివ్వనున్నాయి. ఒక్కో శాఖ నుంచి 30 మంది అధికారులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఐఎస్బీలో ఫిబ్రవరి 18న శిక్షణ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంతో పాటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే ముఖ్యులు, అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఈశా ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం ఉమ్మడిగా చేపట్టిన మూడురోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసిం ది. అనంతరం సీఎం చంద్రబాబు, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్, ఐఎస్బీ ప్రతినిధులు.. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ 7మిషన్లు, స్మార్ట్ ఏపీ, విలేజ్ పథకాల జయ ప్రదానికి చర్చించారు. ఈశా ఫౌండేషన్ సహకారం కోరగా అందుకు జగ్గీ వాసుదేవ్ హామీ ఇచ్చారు. వాసుదేవ్‌ను ప్రభుత్వం తరఫున చంద్రబాబు సత్కరించారు.
అన్ని ఫైళ్లు ఆన్లైన్లోనే: ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి, ఒక అధికారి నుంచి మరో అధికారికి వ్యక్తుల ద్వారా ఫైళ్ల తరలింపు నిలుపుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆన్లైన్లోనే కదలాలన్నారు.
2న విజయవాడకు బాబు: సీఎం ఫిబ్రవరి 2న వుంత్రివర్గ సవూవేశం అనంతరం విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతోంది. అనంతరం విజయవాడ వెళ్తారు.