లలిత్-రాజే కుటుంబాల నేరపూరిత కుమ్మక్కు
న్యూఢిల్లీ: పలు కేసుల్లో నిందితుడైన ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే కుటుంబాలు నేరపూరితంగా కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన ధోల్పూర్ ప్యాలెస్‌ను రాజే కుటుంబం, లలిత్‌తో కలిసి ఒక సంస్థ ద్వారా అక్రమంగా ఆక్రమించిందని ఆయన బుధవారం మళ్లీ ఆరోపణలు గుప్పించారు. ధోల్పూర్ ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదేనని 1949 నాటి ఒక పత్రాన్ని బుధవారమిక్కడ చూపారు. రాజే కుమారుడు దుష్యంత్‌కు సంబంధించిన కోర్టు సెటిల్మెంట్లో.. ఆయనకు కేవలం చరాస్తులు మాత్రమే దక్కాయని, ప్యాలెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ ప్యాలెస్ పరిధిలోని కొంత భూభాగాన్ని జాతీయ రహదారుల కోసం తీసుకున్నందుకు గాను.. దుష్యంత్‌సింగ్‌కు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించటం వెనుక స్కాం ఉందని, దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అలాగే.. లలిత్‌మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అంశాన్ని తాము విస్మరించలేదని వ్యాఖ్యానించారు.