breaking news
investment in equity
-
Q1లో జున్‌జున్‌వాలా నెట్‌వర్త్ జూమ్
ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా నెట్‌వర్త్ రూ. 10,000 కోట్లను అధిగమించింది. వెరసి స్టాక్ మార్కెట్లలో రాకేష్ పెట్టుబడుల విలువ జూన్ చివరికల్లా రూ. 10,797 కోట్లను తాకింది. ఈ కాలంలో కొన్ని కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. మరికొన్ని కంపెనీలలో అదనపు పెట్టుబడుల ద్వారా వాటాలను పెంచుకున్నారు. కాగా.. అత్యంత ఫేవరెట్ స్టాక్స్ అయిన టైటన్ కంపెనీ, ఎస్కార్ట్స్‌లో పెట్టుబడులను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇతర వివరాలు చూద్దాం.. బిగ్బుల్ బిగ్‌బుల్‌గా పేరున్న రాకేష్ జున్‌జున్‌వాలా కోవిడ్-19 నేపథ్యంలోనూ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఈ ఏడాది క్యూ1లో పెట్టుబడుల విలువ రూ. 2514 కోట్లమేర పెరిగింది. సోమవారం ముగింపు ధరల ప్రకారం రాకేష్ , ఆయన కుటుంబ సభ్యుల పెట్టుబడుల విలువ రూ. 10,797 కోట్లకు చేరింది. తద్వారా మార్చి నుంచి చూస్తే 30 శాతం ఎగసింది. మార్చిలో రాకేష్ పెట్టుబడులు రూ. 8284 కోట్లుగా నమోదయ్యాయి. మార్చికల్లా 29 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటాలను కలిగి ఉండటం గమనార్హం! లుపిన్‌లో .. క్యూ1లో రాకేష్.. ర్యాలీస్ ఇండియా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఫెడరల్ బ్యాంక్, ఎన్సీసీ, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్‌లో వాటాలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మరోపక్క లుపిన్, ఆగ్రో టెక్ ఫుడ్స్‌లో కొంతమేర వాటాలు విక్రయించారు. ఇక తాజ్ గ్రూప్ హోటళ్ల కంపెనీ ఇండియన్ హోటల్స్‌లో 1.05 శాతం వాటాకు సమానమైన 12.5 మిలియన్ షేర్లను సొంతం చేసుకున్నారు. కాగా.. ఓరియంట్ సిమెంట్, ఎంసీఎక్స్, ఆయాన్ ఎక్స్ఛేంజీ, క్రిసిల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ తదితర 11 కంపెనీలలో వాటాలను యథాతథంగా కొనసాగించారు. 4 స్టాక్స్ జోరు ఏప్రిల్ నుంచి ప్రధానంగా ర్యాలీస్ ఇండియా, ఎస్కార్ట్స్, జూబిలెంట్ లైఫ్, లుపిన్ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా రాకేష్ సంపద రూ. 1246 కోట్లమేర బలపడింది. క్యూ1లో పెరిగిన రూ. 2514 కోట్ల సంపదలో ఇది సగంకావడం విశేషం! -
రాకేష్ జున్‌జున్‌వాలా 3 సూత్రాలు...!
సుమారు నాలుగు దశాబ్దాల నుంచీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్‌గా కొనసాగుతూ బిగ్‌బుల్‌గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్‌జున్‌వాలా.. ప్రస్తుతం ప్రపంచంలోనే పెట్టుబడికి దేశీ స్టాక్ మార్కెట్లు అత్యుత్తమమంటూ కితాబునిచ్చారు. రాకేష్‌తో ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించిన పలువురు రుమేనియా రియల్ ఎస్టేట్, న్యూయార్క్ కమోడిటీస్ తదితర పెట్టుబడి మార్గాలవైపు దృష్టిసారించిన అంశంపై స్పందిస్తూ.. ఇంటి భోజనం రుచిగా ఉన్నప్పుడు బయటికెళ్లి ఆహారాన్ని తినడమెందుకంటూ సరదాగా ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో ప్రధానంగా మూడు సూత్రాలను పాటిస్తానంటూ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలా చెప్పుకొచ్చారు. తొలుత సొంతంగా ఆలోచించాలి. తదుపరి స్థిరంగా ఒక అభిప్రాయానికి రావాలి. దీర్ఘకాలంపాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇవి చేసేందుకు ధైర్యం, రిస్కు తీసుకోగల సంకల్పం, ధృఢ వైఖరి వంటివి ఉండాలి. ఇందువల్లనే ఇప్పుడుకూడా అత్యధికంగా పతనమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాను. స్టాక్ మార్కెట్లో నష్టపోయే రిస్క్‌లూ.. భారీగా లాభపడే అవకాశాలనూ పలుమార్లు చూసినట్లు ఈ సందర్భంగా రాకేష్ తెలియజేశారు. గత పెట్టుబడులపై రాకేష్ ఇలా వివరించారు.. ఎస్కార్ట్స్‌లో.. గతంలో ఎస్కార్ట్స్ యాజమాన్యంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడ్డాను. కంపెనీ బ్యాలన్స్‌షీట్‌ను పరిశీలించాక నష్ట భయంకంటే లాభార్జనకే అధిక అవకాశాలున్నట్లు విశ్వాసం కలిగింది. యాజమాన్య మార్పిడి జరుగుతోంది. అయితే ట్రాక్టర్ల బిజినెస్ మెరుగైన లాభాలు ఆర్జిస్తోంది. ఈ సమయంలో పలువురు ఎస్కార్ట్స్‌లో పెట్టుబడులకు విముఖత చూపారు. 12.5 మిలియన్ షేర్లను కొనుగోలు చేశాను. ఐదేళ్లలోనే 10 రెట్లు రిటర్నులు లభించాయి. సొంత యోచనతోపాటు.. దీర్ఘకాలంపాటు కొనసాగగల ఓర్పు, కట్టుబాటు వంటివి స్టాక్స్ పెట్టుబడుల్లో కీలకపాత్ర పోషిస్తాయి. పోర్ట్‌ఫోలియో విలువకంటే ఎప్పుడూ 2-4 రెట్లు మించి రుణాలకు వెళ్లలేదు. దేశీయంగా కుటుంబ ఆదాయాల్లో 3-4 శాతం వాటానే స్టాక్స్‌లోకి మళ్లుతుంది. యూఎస్‌లో నమోదయ్యే 33 శాతం పెట్టుబడులతో పోలిస్తే ఇవి బహుతక్కువ. -
అంతా.. ప్లాన్ ప్రకారమే!
ప్రతి కుటుంబానికీ ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి ► దాని ప్రకారం వెళితేనే లక్ష్యాల సాకారం ► దీనికోసం సలహాదారులూ ఉన్నారు ► పెద్ద ఎత్తున వెలుస్తున్న అడ్వయిజరీ సంస్థలు ► కాస్త ముందుచూపుతో సొంత ప్రణాళికా ఈజీనే సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : జీవన విధానంతో పాటు అవసరాల్లోనూ ఆర్థికపరమైన మార్పులు చాలా వచ్చాయి. ఫలితం... ఇపుడు ప్రతి కుటుంబానికీ చక్కని ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి. అది ఉంటేనే భవిష్యత్తు లక్ష్యాలు నెరవేరుతాయి. అవసరాలు తీరుతాయి. కలలు సాకారమవుతాయి. ఆర్థిక సలహాదారులు, అడ్వయిజరీ సంస్థలు విపరీతంగా పెరిగిపోయింది ఇందుకే. జనంలోనూ ఆర్థిక విషయాల పట్ల అవగాహన క్రమంగా పెరుగుతోంది. కాబట్టి తమకు తాముగా ఆర్థిక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలంటే ఈ అంశాలను పరిశీలించాల్సిందే... కుటుంబీకులందరికీ భాగస్వామ్యం! ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆర్థిక విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, కొంచెం అధ్యయనం, పరిశోధన ఉంటే... మీ సొంత ప్రణాళికను రాసేసుకోవచ్చు. ఇందులో భవిష్యత్తు ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు, వాటికోసం ఏ ఏ పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలి?.. ఇలా అన్ని వివరాలూ ఉండాలి. దాన్ని అక్షరాలా ఆచరించాలి. అయితే, ఆర్థిక ప్రణాళిక అన్నది వ్యక్తిగతం కాదని తెలుసుకోండి. అది మొత్తం కుటుంబ వ్యవహారం. అందుకే కుటుంబ సభ్యులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలన్నది ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన. అప్పుడే చక్కని, స్పష్టమైన ప్రణాళిక రెడీ అవుతుంది. లక్ష్యాలకు వ్యవధి ఉండాల్సిందే! ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించేందుకు కంగారు పడక్కర్లేదు. కొంచెం సమయం తీసుకోండి. భవిష్యత్తు ఆర్థిక అవసరాల గురించి, మీ సొంత లక్ష్యాల గురించి బాగా తెలిసిన అర్ధాంగిని కూడా అడగండి. ఆ తర్వాత వాటిని పేపర్‌పై పెట్టండి. నిర్ణయించుకునే ఏ లక్ష్యమైనా గానీ దాన్ని చేరుకునేలా ఉండాలి. మీ ఆర్థిక సామర్థ్యం పరిధిలో దాన్ని నెరవేర్చుకునే విధంగా స్పష్టంగా ఉండాలి. అలాగే కాల వ్యవధి కూడా తప్పనిసరి. అవసరాలేంటి? కోరికలేంటి? ఆర్థిక ప్రణాళిక రాసే ముందు ఓ అంశంలో స్పష్టత ఉండాలి. మీ అవసరాలు, కోరికల మధ్య తేడా ఏంటో తెలియాలి. ముందు అవసరాలకే ప్రాధాన్యమివ్వాలి. అవి అధిగమించిన తర్వాత అప్పుడు వెసులుబాటుంటే ఆచరణ సాధ్యమయ్యే కోర్కెలను ప్రణాళికలో భాగం చేసుకోవచ్చు. అర్ధాంగితో చర్చిస్తే ఏవి అవసరాలు, ఏవి కోర్కెలన్న స్పష్టత వస్తుంది. ఆదాయం, ఖర్చులు, పొదుపు... బ్యాంకు ఖాతాలో డబ్బులుంటే ముందు ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదనేది తలపండిన ఆర్థిక పండితులు చెప్పే సత్యం. క్రమశిక్షణ, కట్టుబాటే ఆర్థిక లక్ష్యాలను చేరుకునే మార్గాలు. ‘ముందు ఇన్వెస్ట్మెంట్... తర్వాత ఖర్చులు’ అన్న విధానాన్ని ఆచరించేందుకు కట్టుబడి ఉండండి. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఖర్చులు తగ్గించుకోండి గానీ ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించొద్దు. అలా చేస్తే లక్ష్యాలను త్యాగం చేయాల్సి వస్తుంది. సమీక్షిస్తూ... తగు మార్పులు ఒకసారి ఆర్థిక ప్రణాళిక రాసుకుని ఆచరించడం మొదలు పెట్టడంతో పని పూర్తయినట్టు కాదు. మధ్య మధ్యలో దాని తీరును సమీక్షించుకుంటూ ఉండాలి. రాబడులు, అవసరాలకు అనుగుణంగా వాటిల్లో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసరాల కోసమూ నిధి కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటో ఓ సారి ఆలోచించండి. వెంటనే మరో ఉద్యోగం రాకుంటే అప్పటి వరకు కుటుంబ అవసరాలు ఎలా...? ఇటువంటి పరిస్థితులను ముందే ఊహించి అటువంటి సందర్భాల కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. కనీసం ఓ ఆరు నెలల పాటు కుటుంబ అవసరాలు తీరేందుకు సరిపడా అత్యవసర నిధి రూపంలో ఉంచుకోవాలనేది నిపుణుల సూచన. వీలుంటే అవసరాలతోపాటు పెట్టుబడులకూ సరిపడా అత్యవసర ఫండ్ రూపంలో ఉంచుకోవాలి. బీమా రక్షణ తప్పనిసరి కుటుంబానికి ఆధారమైన తాను లేకపోతే... తన జీవిత భాగస్వామి సంపాదించగలరా...? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ కష్టం అనే సమాధానం వస్తే వెంటనే ఆర్జించే వ్యక్తి వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లకు తక్కువ కాకుండా 20 రెట్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీనివల్ల జరగరానిది జరిగితే ఆ కుటుంబం కష్టాల పాలు కాకుండా కాపాడినట్టవుతుంది. మీరు ప్రేమించే వారికి ఇచ్చే మొదటి కానుక ఇదేనని చెబుతారు నిపుణులు. దీర్ఘకాలానికి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ పైన చెప్పుకున్నట్టు లక్ష్యాల కోసం ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. వీటిలోనూ స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలుంటాయి. అవేంటన్న గందరగోళం అక్కర్లేదు. రిటైర్మెంట్, పిల్లల వివాహాలు దీర్ఘకాలిక లక్ష్యాలు. స్వల్పకాలికమైనవి అంటే సమీప కాలంలో ఎదురయ్యేవి. ఏడాది కాలంలోపు అవసరం అనుకుంటే అవి స్వల్పకాలం కిందకు వస్తాయి. మూడేళ్లు పైబడినవి అయితే మధ్య కాల లక్ష్యాలుగా చెబుతారు. ఐదేళ్లు, ఆ పైబడిన లక్ష్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలుగా చెబుతారు. స్వల్పకాల అవసరాల కోసం చేసే ఇన్వెస్ట్మెంట్లో ఆటుపోట్లు ఉండకూడదు. కనుక డెట్ రూపంలో పెట్టుబడి పెట్టాలి. మధ్య కాలానికి అయితే డెట్–ఈక్విటీ కలబోతగా ఉండొచ్చు. దీర్ఘకాలానికి అయితే ఈక్విటీలో పెట్టుబడులు అధిక రాబడులనిస్తాయి. ఈక్విటీల్లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అవి యావరేజ్ అవడం వల్ల రిస్క్ తగ్గుతుంది.