breaking news
International Medical Services
-
హైదరాబాద్‌లోనే అంతర్జాతీయస్థాయి వైద్యం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన అంతర్జాతీయస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని కెన్యా సెనెటర్ ఒబురో ఒగింగా ప్రశంసించారు. తన సోదరుడు గతంలో కెన్యా ప్రధానిగా ఉన్నారని, తాను గత 27 ఏళ్లుగా ఆ దేశంలో రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని చెప్పారు. భారత్–కెన్యాల మధ్య మరింత దృఢమైన ఆర్థిక, వ్యాపార సంబంధాలను తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. భారత్‌కు చెందిన అపోలో, యశోద వంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు తమ బ్రాంచీలను ఏర్పాటుచేసి వివిధ వైద్యాంశాల్లో స్థానిక డాక్టర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఒబురో ఒగింగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గత కొన్నేళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులను అనుభవించానని, ఆ సమస్యకు ఇటీవల హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకుని పూర్తి స్వస్థతతో స్వదేశానికి తిరిగి వెళుతున్నట్టు వెల్లడించారు. కెన్యా కంటే మూడింతల తక్కువ ఖర్చుతో.. కెన్యాలో కంటే మూడింతల తక్కువ ఖర్చుతో (అదీ కూడా విమాన చార్జీలు, హోటల్ ఖర్చులన్నీ కలుపుకుని), యశోద ఆసుపత్రిలో చీఫ్సర్జన్ డా.దశరథ రామారెడ్డి ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్ పొందినట్టు తెలిపారు. ప్రతి కాలి నొప్పికీ ఆపరేషన్ అవసరం లేదు.. తమను వీడియో కాల్ ద్వారా కెన్యా సెనెటర్ ఒబురో సంప్రదిస్తే, అన్ని పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించామని యశోద చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. దశరథరామారెడ్డి తెలిపారు. ప్రతి కాలి నొప్పికీ ఆపరేషన్లు అవసరం లేదన్నారు. సమస్య తీవ్రతను బట్టి అత్యవసరమైన వారికే ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మోకాలి మార్పిడి ఆపరేషన్ల నొప్పి తట్టుకోలేరని 2,3 వారాలు నడవలేరని, 3నెలలు ఫిజియోథెరపీ చేయాలంటూ చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయన్నారు. ఇలాంటి అపోహలను దూరంపెట్టి మోకాళ్ల సమస్యలపై దగ్గరలోని ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. ‘మోకీలు ఆపరేషన్ చేసిన 72 గంటల్లోనే డిశ్చార్జి చేసి రెండువారాల్లో రెండుసార్లు డ్రెస్సింగ్ చేస్తాం. తగిన జాగ్రత్తలతో నెలరోజుల్లో మామూలుగా నడిచే అవకాశాలున్నాయి’ అని చెప్పారు. -
ఆన్లైన్లో ‘హోమియో కేర్’
అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు 1.30 కోట్ల మందికి చేరువయ్యాం విస్తరణకు రూ.40 కోట్ల వ్యయం సాక్షితో హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ శ్రీకాంత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోమియో వైద్య రంగంలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్... ఆన్లైన్ వైద్య సేవలనూ విస్తరిస్తోంది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ రోగులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైద్యులతో సంప్రదించే సౌకర్యాన్ని అమలు చేస్తోంది. దేశీయంగా రోజుకు 300 మంది వరకూ ఈ ఆన్లైన్ వైద్య సేవలు పొందుతుండగా అంతర్జాతీయంగా దాదాపు 100 మందికి ప్రతి రోజూ ఆన్లైన్ వైద్యసేవలు అందుతున్నట్లు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ చెప్పారు. తమ కేంద్రాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను మెడికల్ ఆడిట్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయనింకా ఏం చెప్పారంటే... నాణ్యమైన వైద్యం.. రోగులకు అంతర్జాతీయ స్థాయి, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే హోమియో రంగంలో తొలిసారిగా మెడికల్ ఆడిట్ పేరుతో అన్ని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కేంద్రాలనూ కేంద్రీకృత వ్యవస్థకు అనుసంధానించాం. రోగి ఏ కేంద్రానికి వెళ్లినా వైద్యులు సిఫార్సు చేస్తున్న మందులను పర్యవేక్షిస్తాం. అనుసరించాల్సిన వైద్య విధానాన్ని వైద్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచిస్తాం. తదనంతరం సమస్య తీరును క్రమానుసారం అధ్యయనం చేసి రోగులకు, వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తాం. ఈ విధానంలో వైద్యులకు జవాబుదారీ పెరుగుతుంది. హోమియోకేర్‌కు చెందిన 300 మంది వైద్యులతోపాటు భారత్‌తోసహా విదేశాలకు చెందిన మరో 300 మంది వైద్యులకు హోమియో వైద్యంలో కొత్త అంశాలపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నాం. ఆన్లైన్లో 30 శాతం.. మూడు దశాబ్దాల సంస్థ ప్రస్థానంలో 1.30 కోట్ల మందికిపైగా వైద్యం అందించాం. డిసెంబర్‌కల్లా ఈ సంఖ్య 1.80 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కనక ఈ అంచనా వేస్తున్నాం. వంశపారంపర్య సమస్యలు, సంతానలేమి, మధుమేహం, కీళ్ల నొప్పుల వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స ఇస్తున్నాం. 30 శాతం మంది ఆన్లైన్లోనే పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేశీయంగా హోమియో మార్కెట్ పరిమాణం 2014-15లో రూ.6,000 కోట్లుంది. 2015-16లో రూ.7,000 కోట్లను దాటుతుంది. హోమియోను కార్పొరేట్ స్థాయికి తెచ్చింది మేమే. విస్తరణకు రూ.40 కోట్లు.. కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో 32 కేంద్రాల్ని నిర్వహిస్తున్నాం. మహారాష్ట్ర, ఒడిశా, కేరళతోపాటు సింగపూర్, దుబాయి, యూకేల్లో అడుగు పెడుతున్నాం. ఏడాదిలో కొత్తగా 15 కేంద్రాలు రానున్నాయి. క్లినిక్‌ల ఏర్పాటు, టెక్నాలజీ, శిక్షణకు గాను 2015-16లో రూ.40 కోట్లు వెచ్చిస్తున్నాం. వాటా విక్రయించాలంటూ వచ్చిన రూ.300 కోట్ల ఆఫర్‌ను కాదనుకున్నాం. 2017 కల్లా 100 క్లినిక్‌లను ఏర్పాటుచేస్తాం. ఆ తర్వాతే వాటా విక్రయానికి వెళతాం. వైద్య కళాశాల, ఔషధ తయారీ యూనిట్ పెట్టాలన్న ఆలోచన ఉంది. దేశ, విదేశాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీల నుంచి మందులను సేకరించి, కాంబినేషన్లను సొంతంగా అభివృద్ధి చేస్తున్నాం.