breaking news
International level recognition
-
ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు తోడుగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడంతోపాటు తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక అవార్డు ‘చాంపియన్’కు నామినేట్ అయిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు)అందిస్తున్న సేవలను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. వన్ స్టాప్ సెంటర్.. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకే చేర్చే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. నాలెడ్జ్ హబ్‌లుగా రూపుదిద్దుకుని నాణ్యమైన ఇన్పుట్స్ అందిస్తున్నాయి. వైఎస్సార్ పొలం బడులతో పాటు తోట, పట్టు, పశు విజ్ఞాన, మత్స్యసాగులో రైతులకు మెళకువలు సూచిస్తున్నాయి. పంట ఉత్పత్తులను గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. కూలీల కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, మార్కెటింగ్ కోసం మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే ఛానల్‌ను తీసుకొచ్చింది. ఇలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ‘వన్ స్టాప్’ సెంటర్ కింద అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ సంస్థల అధ్యయనం.. పలు రాష్ట్రాలు ఆర్బీకేల తరహా వ్యవస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు ఏపీలో పర్యటించి ఆర్బీకేల పనితీరుపై అధ్యయనం చేశాయి. నీతి ఆయోగ్, నాబార్డు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆర్బీఐ.. ఇలా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలపై అధ్యయనం చేపట్టాయి. కాల్‌సెంటర్ సేవలు... టోల్‌ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఇప్పటి వరకు 4.50 లక్షల మంది రైతులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాల్ సెంటర్లో శాస్త్రవేత్తలు, 70 మందికి పైగా సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామ సేవలందిస్తున్నారు. 1.75 లక్షల సబ్‌స్క్రిప్షన్‌తో ఆర్బీకే ఛానల్ అంతర్జాతీయ మన్నన్నలందుకుంటోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 680కు పైగా వీడియోలను ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. తెలంగాణలో కాల్ సెంటర్, రైతు ఛానల్ ఆర్బీకేల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు వేదిక’ల ద్వారా సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఆర్బీకేలను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వాటి సేవలు ఎంతో బాగున్నాయని అభినందించారు. ఆర్బీకే వ్యవస్థ వినూత్నమని ప్రశంసించారు. ఈ సేవలను తెలంగాణ రైతులకు కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, స్పెషల్ కమిషనర్ కేజే హనుమంత్ నేతృత్వంలోని బృందాలు కూడా పలు దఫాలు ఆర్బీకేలపై అధ్యయనం చేశాయి. ఆ బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆర్బీకేల తరహా సేవలను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సమీకృత రైతు సమాచార కేంద్రం (కాల్ సెంటర్), ఆర్బీకే ఛానల్ తరహాలో రైతు ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్బీకేల్లో డిజిటల్ లైబ్రరీలతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో శాఖలవారీగా ఆకట్టుకునే రీతిలో మ్యాగజైన్లను తెస్తున్నారు. లక్ష మందికిపైగా చందాదారులతో రైతుభరోసా మ్యాగజైన్ విశేష ఆదరణ æపొందుతోంది. తెలంగాణలో కూడా శాఖలవారీగా మ్యాగజైన్లు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. -
చిహ్నాల వనం
ఏదైనా సంస్థ ప్రజలకు చిరకాలం గుర్తుండాలంటే అందమైన ‘లోగో’ అవసరం. ఆ లోగోలోనే ఆ సంస్థ విధివిధానాలు కనిపిస్తాయి. ఇలాంటి లోగోలను తీర్చిదిద్దుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రామంతాపూర్ శారదానగర్‌కు చెందిన వనం జ్ఞానేశ్వర్. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలకు చిహ్నాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. - రామంతాపూర్ - లోగోల రూపశిల్పి జ్ఞానేశ్వర్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు చిత్రకళపై జ్ఞానేశ్వర్‌కు చిన్నతనం నుంచి ఉన్న మక్కువే అతడిని కళాకారుడిగా తీర్చిదిద్దింది. బాల్యం నుంచే వివిధ లోగోలను రూపొందించి మురిసిపోయేవాడు. సైన్ బోర్డు ఆర్టిస్ట్ జీవితం ప్రారంభించిన జ్ఞానేశ్వర్ ఓ ప్రముఖ ప్రకటనల కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తన ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అత్యాధునిక పద్ధతుల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లోగోలను తయారు చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోగోలో స్పష్టత లేదని చెప్పడంతో సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్‌తో కలిసి అందులో మార్పులు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ లోగోను రూపొందించారు. - నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ లోగోలను తయారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలకు ప్రచార సామగ్రి జ్ఞాపికలను, లోగోలను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు. - అమెరికాలోని అట్లాంటాలో విజు చిలువేరు ఆధ్వర్యంలో నడుస్తున్న ‘గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ లోగోను తయారు చేశారు. ఇంకా.. - ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మాధవ్ కటికనేని ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరానికి పోస్టర్లు, జ్ఞాపికలు.. - మెల్బోర్న్లో నూకల వెంకటరెడ్డి నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ ఫోరం లోగోలు, ప్రచార సామగ్రి.. - బ్రిస్బేన్ తెలంగాణ ఫోరం కోసం లోగోలు ప్రచార సామాగ్రిని రూపొందించారు. - నూతనంగా ఏర్పడిన తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లోగోను రూపకర్త కూడా జ్ఞానేశ్వరే. ఆశయం తెలంగాణ రాష్ట్రంలో లోగోలను రూపొందించే విధంగా పలువురు యువతీయువకులకు శిక్షణ ఇచ్చి వారిని మంచి ఆర్టిస్ట్‌లుగా తీర్చిదిద్దడమే తన ఆశయమని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభినందనలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) లోగోలో బంగారు వర్ణంతో కాకతీయ ద్వారం, లోగో మధ్యలో తెలంగాణ పల్లెలను కళ్లకు కట్టే విధంగా ఉన్న పచ్చిక, నగర సౌందర్యాన్ని తెలిపే చార్మినార్‌ను కలిపి లోగోను తయారుచేశారు. ఈ లోగోను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానేశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.