breaking news
International children film festival
-
పిల్లలకు నచ్చినవే ‘బెస్ట్ మూవీస్’అవుతాయి!
‘హాయ్ బేటా.. గుడ్ మార్నింగ్’... స్వీట్‌గా పిల్లలను పలకరిస్తున్నారు అక్కినేని అమల. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ‘ఏషియన్ పనోరమ’కి చైర్ పర్సన్‌గా వ్యవహరించారామె. గత శుక్రవారం నుంచి సోమవారం వరకూ ఏషియన్ పనోరమా జ్యూరీకి ఎంపికైన ముగ్గురు పిల్లలతో కలసి ఆమె పలు సినిమాలు చూశారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న వేడుకలో అవార్డు అందుకోనున్నవారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అమలతో ‘సాక్షి’ చిట్ చాట్. ► మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో కలసి సినిమాలు చూస్తాం.. పిల్లలతో చూడటం ఎలా అనిపించింది? వెరీ నైస్. రోజుకి 5 నుంచి 10 సినిమాలు చూస్తాం. వీటిలో ఫీచర్స్ ఫిల్మ్స్, షార్ట్‌ఫిల్మ్స్ ఉంటాయి. ఆరేడు గంటలు ఈజీగా పడుతుంది. అన్నేసి గంటలు పిల్లలు ఓపికగా సినిమాలు చూడటం, వాటిగురించి నిక్కచ్చిగా తమ అభిప్రాయం చెప్పడం అభినందించదగ్గ విషయం. ► ఒక సినిమా చూసి, జడ్జ్ చేసే కెపాసిటీ పిల్లలకు ఉంటుందా? పిల్లల మనసు ‘వైట్ పేపర్’లాంటిది. మనసులో ఏమీ పెట్టుకోకుండా జస్ట్ మూవీ చూస్తారు. నచ్చితే నచ్చిందంటారు. లేకపోతే లేదు. వాళ్లకు నచ్చినవే ‘బెస్ట్ ఫిల్మ్స్’ అవుతాయి. ఎందుకంటే, ఓపెన్ మైండ్‌తో చూస్తారు కదా. ► జడ్జ్మెంట్ అనేది కష్టమైన విషయం. కొందర్ని నిరాశపరచాల్సి ఉంటుంది కదా? వేల సినిమాలు వచ్చాయి. వాటిలో కమిటీ ఆల్రెడీ కొన్ని సినిమాలను ఫిల్టర్ చేసి, మాకు పంపిస్తుంది. వాటిలో మేం ‘ది బెస్ట్’ అనేలా ఉన్నవి సెలక్ట్ చేయాలి. అది టఫ్ జాబ్. ఎందుకంటే, అన్నీ బాగున్నట్లే అనిపిస్తాయి. కాకపోతే ఎక్కడో చిన్న చిన్న తేడా లుంటాయి. దాంతో అవార్డుకి అనర్హం అవుతాయి. అంతమాత్రాన ఆ ఫిల్మ్ మేకర్స్ లేదా ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్‌ని తక్కువ అంచనా వేయలేం. ఇక, జడ్జిమెంట్ సీట్లో కూర్చుకున్నప్పుడు.. ఒకరి సంతోషం, బాధ గురించి ఆలోచించలేం. మేం తీసుకునే నిర్ణయం ‘జెన్యూన్’గా ఉండాలి. సినిమాలు చూసేటప్పుడు మా మనసులో అదొక్కటే ఉంటుంది. ► ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కాబట్టి, చానల్స్‌లో అఖిల్ ‘సిసింద్రీ’ వేశారు.. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆ సినిమాని గుర్తు చేసుకుంటారా? ‘ఫీలింగ్ నైస్’. ఎప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ‘సిసింద్రీ’ గురించి ఎక్కువ మాట్లాడితే, ఈ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని హైజాక్ చేసినట్లవుతుంది. ఇప్పుడు నా ప్రయార్టీ ఇదే కాబట్టి, దీని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ► ఒక్క మాట చెప్పండి.. ఆ సినిమాలో అఖిల్ ఏడ్చే, నవ్వే సీన్స్‌ని ఎలా తీశారు.. ఏడ్చే సీన్స్‌కి చిన్నగా గిల్లడం లాంటిది.. (నవ్వుతూ). అలా ఏం లేదు. అఖిల్ ఆ సినిమాలో ఏం చేసినా అది న్యాచురల్‌గా చేసినదే. బలవంతంగా ఏదీ చేయించలేదు. ఆ సినిమాని నాగార్జునగారే తీశారు. నేను కూడా లొకేషన్లో ఉండేదాన్ని. పెద్దగా ఇబ్బంది పడలేదు. ► ‘సిసింద్రీ’ గురించి ఇంకొక్క క్వొశ్చన్.. ఆ సినిమా తీసినందుకు పెద్దయ్యాక అఖిల్ ఏమన్నారు? ఇది మాత్రం అఖిల్ అడగాల్సిన క్వొశ్చన్ (నవ్వేస్తూ). ► ‘లిటిల్ డైరెక్టర్స్’ అంటూ కొంతమంది పిల్లలు సినిమాలు తీయడం ఎలా అనిపించింది? నైస్ ఎఫర్ట్. నాట్ ఓన్లీ డైరెక్షన్. ఫొటోగ్రఫీ, మ్యూజిక్.. ఇంకా చాలా ఉన్నాయి. ‘ఇలా చేయడం మంచిది’ అని పిల్లలకు పెద్దవాళ్లు చేసి చూపించడం కన్నా.. ‘ఇలా చేయండి’ అని వాళ్లతో ప్రాక్టికల్‌గా చేయించాలి. ‘మేకింగ్’లో ఉన్న కష్టాలు తెలుస్తాయి. ఆలోమేటిక్‌గా ‘సాల్వ్’ చేసే నేర్చు వచ్చేస్తుంది. థియరీ మీద మాత్రమే కాదు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ► మీరన్నట్లు ప్రాక్టికల్ నాలెడ్జ్ వ్యక్తిగా డెవలప్ అవ్వడానికి కూడా పనికొస్తుంది... కరెక్ట్. పిల్లలు పెరుగుతూనే ఎంతో నేర్చుకుంటుంటారు. ఒక్క సినిమాల్లోనే కాదు. లైఫ్‌లో కూడా. ఎలా ప్రశ్నలు వేయాలి? ఒక కాన్సెప్ట్‌ని ఎలా వినాలి? విన్న అంశాలను పాజిటివ్‌గా ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి? అనేది తెలుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. స్కూల్స్‌లో ధియేట్రికల్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తే ఓన్లీ యాక్టింగే కాదు.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. టెక్నికల్ థింగ్స్ కూడా నేర్చుకుంటారు. ప్రొడక్షన్ విషయాలు తెలుసుకుంటారు. యాక్ట్ చేసే టాలెంట్ ఉన్నవాళ్లు ఆ సైడ్, టెక్నాలజీ అంటే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అది నేర్చుకుంటాడు. ► బాలల చలన చిత్రోత్సవాలకు ఎప్పటి నుంచో మెంబర్‌గా ఉంటున్నారు కదా.. ఓ చిల్డ్రన్ మూవీ తీయాలని ఎప్పుడూ అనుకోలేదా? చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలో గవర్నింగ్ బోర్డ్‌లో ఉన్నాను. నేను ఫిల్మ్ మేకర్‌ను కాదు. అందుకని సినిమా తీయడం గురించి ఆలోచించలేదు. ► అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలు చూసుకుంటారు కదా.. దాని గురించి? అన్నపూర్ణ స్కూల్ డైరెక్టర్ని. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. కోర్స్ కంప్లీట్ చేసి, తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి వెళతారు. వాళ్లను చూస్తే ముచ్చటగా ఉంటుంది. అయితే నేనెప్పుడూ ‘టీచ్’ చేయను. ఓన్లీ మేనేజింగ్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటా. ► ఫైనల్లీ.. దాదాపు వారం రోజులుగా పిల్లలతో కలసి సినిమాలు చూస్తున్నారు. నిన్నటితో ఈ బాధ్యత పూర్తయింది. పిల్లలతో ఎమోషనల్‌గా ఎటాచ్ అయ్యారా? నా ప్రొఫెషన్లో ‘ఎమోషనల్’ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఒక కొత్త సినిమా చేసినప్పుడు కొత్త యూనిట్‌తో పని చేస్తాం. ఆ తర్వాత వేరే యూనిట్‌తో. అందుకే ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఈ ప్రొఫెషన్లో కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకే కాదు.. ఎవరికీ కరెక్ట్ కాదు. ఒక ‘బ్యూటిఫుల్ అవుట్‌పుట్’ ఇవ్వాలనుకోవడమే మా వరకూ కరెక్ట్. ఇక.. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం బాగా అనిపించింది. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు (నవ్వుతూ). -
అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో డూ డూ ఢీ ఢీ
‘‘మా సినిమా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. మంచి సందేశంతో రూపొందించిన ఈ సినిమా పెద్దలను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది’’ అని దర్శకుడు అల్లాణి శ్రీధర్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘డూ డూ ఢీ ఢీ’(మా ఊరి కొండ) సినిమా చిల్డ్రన్స్ వరల్డ్ విభాగంలో ఎంపికైంది. అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘బాల్యాన్ని కబళిస్తున్న డిజిటల్ ఎడిక్షన్ అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా చేశాం. మొబైల్స్, ఆన్లైన్ గేమ్స్, వీడియో గేమ్స్ వంటివి ఈ తరం బాలల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. డిజిటల్ ఎడిక్షన్‌కు విరుగుడు ఏంటి? వీటి ప్రభావంతో ముగ్గురు పిల్లలు ఎలా మారిపోయారు. మన సంస్కృతి, ఆట పాటలు వారిని ఎలా ఆకట్టుకున్నాయి? డిజిటల్ వ్యసనపరులు చివరికి అందరి చేతా ఎలా శభాష్ అనిపించుకున్నారు? అనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: కిరణ్ కుమార్, సంగీతం: శశిప్రీతమ్, సమర్పణ: చింతా లక్మీనాగేశ్వరరావు. -
బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం
18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో గవర్నరు నరసింహన్ ప్రసంగిస్తున్న సందర్భంగా సభలోని వీఐపీ గ్యాలరీలో కూర్చొన్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకుని గట్టిగా నినాదాలు చేశారు. దీంతోస్వల్ప గందరగోళం ఏర్పడింది. సమైక్యాంధ్ర నినాదాలు చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని లాక్కెళ్లారు. పోలీసులు లాక్కెళుతున్నా ఆ వ్యక్తి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్.. సేవ్ ఇండియా.. సేవ్ యునైట్ ఆంధ్రప్రదేశ్ ..’ అంటూ బిగ్గరగా అరుస్తూ వెళ్లారు. హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.