breaking news
Industry Group
-
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్‌లు స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కీలక పరిశ్రమలు హ్యాపీ
నవంబర్‌లో 6.7% వృద్ధి ⇒ ఐదు నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ నవంబర్‌లో మంచి పనితీరును కనబరిచింది. వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. 2013 నవంబర్‌లో ఈ రేటు 3.2 శాతం. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్, సిమెంట్ రంగాల మంచి పురోగతి- మొత్తం పరిశ్రమల గ్రూప్ చక్కటి వృద్ధికి కారణమైంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్రవ్య, పరపతి సమీక్ష, విధాన ప్రకటనకు పరిగణనలోకి తీసుకునే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా (వెయిటేజ్) 38 శాతం. జనవరి రెండవ వారం చివర్లో ఐఐపీ నవంబర్ గణాంకాలు వెలువడతాయి. తాజాగా విడుదలైన గణాంకాలకు సంబంధించి 2013 నవంబర్‌లో చోటుచేసుకున్న వృద్ధి రేటుతో పోల్చి 2014 నవంబర్‌లో వృద్ధి రేటును పరిశీలిస్తే... ప్లస్... బొగ్గు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 14.5 శాతానికి ఎగసింది. రిఫైనరీ ప్రొడక్టులు: క్షీణత రేటు వృద్ధి బాటలోకి మారింది. ఈ రేటు -5.2 శాతం నుంచి 8.1 శాతానికి ఎగసింది. విద్యుత్: చక్కటి పనితీరుతో ఉత్పత్తి వృద్ధి 6.3 శాతం నుంచి 10.2 శాతానికి చేరింది. సిమెంట్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. స్టీల్: వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 1.3 శాతానికి పడింది. మైనస్... క్రూడ్ ఆయిల్: ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (మైనస్)లోకి జారింది. ఈ క్షీణ రేటు -0.1 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 1.2 శాతం. సహజ వాయువు: క్షీణ రేటు కొనసాగుతోంది. అయితే ఈ రేటు -11.2 శాతం నుంచి -2.9 శాతానికి తగ్గడమే కొంచెం ఊరట. ఎరువులు: వృద్ధి రేటు (0.6 శాతం) క్షీణతలోకి జారింది. ఇది -2.8 శాతంగా నమోదయింది. ఎనిమిది నెలల్లో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15, ఏప్రిల్-నవంబర్) ఎనిమిది నెలల కాలంలో 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే- ఎనిమిది పరిశ్రమల గ్రూప్ రేటు 4.1 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది.