
వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం
400 కంపెనీలు మూతపడే ప్రమాదం
రియల్ మనీ గేమ్స్ మీద నిషేధంపై పరిశ్రమవర్గాల ఆందోళన
తక్షణం జోక్యం చేసుకోవాలని హోం మంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం విధించే బిల్లుపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల లక్షల కొద్దీ ఉద్యోగాలు, వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం ఏర్పడుతుందని తెలిపాయి. కోట్ల మంది యూజర్లు చట్టవిరుద్ధమైన విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంల వైపు మళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ఈ బిల్లు విషయంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశాయి. యూజర్లు, పరిశ్రమను పరిరక్షిస్తూ బాధ్యతాయుతమైన గేమింగ్‌కి తోడ్పడే పరిష్కార మార్గాలపై చర్చించేందుకు, తమ అభిప్రాయాలను కూడా తెలిపేందుకు సమావేశమయ్యే అవకాశం కల్పించాలని కోరాయి.
ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్‌ఐఎఫ్‌ఎస్) ఈ నెల 19న సంయుక్తంగా ఆయనకు లేఖ రాశాయి. దీని ప్రకారం .. దాదాపు రూ. 2 లక్షల కోట్ల వేల్యుయేషన్, రూ. 31,000 కోట్ల వార్షికాదాయంతో ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఏటా రూ. 20,000 కోట్ల ఆదాయం సమకూరుస్తోంది.
20 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2028 నాటికి పరిశ్రమ రెట్టింపు స్థాయికి చేరనుంది. 2022 జూన్ వరకు పరిశ్రమలోకి రూ. 25,000 కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. దేశీయంగా 2020లో 36 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్ గేమర్స్ సంఖ్య 2024 నాటికి 50 కోట్లకు చేరింది. వేల కొద్దీ స్టార్టప్‌లు, యువ ఇంజనీర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు.
యూజర్లకు కూడా హాని..
చట్టబద్ధమైన, పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమపై గంపగుత్తగా నిషేధం విధించడం వల్ల దేశీ యూజర్లకు, పౌరులకు పెను హాని జరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నిషేధం వల్ల పెట్టుబడులు నిల్చిపోయి, ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింటుందని.. 400 పైగా కంపెనీలు మూతబడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. డిజిటల్ ఆవిష్కర్తగా భారత్ స్థానం కూడా బలహీనపడుతుందని వివరించాయి. ‘ఈ బిల్లు ఆమోదం పొందితే యూజర్లు, పౌరులకు తీవ్ర హాని జరుగుతుంది. నియంత్రణల పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న, బాధ్యతాయుత దేశీ ప్లాట్‌ఫాంలను మూయించి, కోట్ల మంది ప్లేయర్లను చట్టవిరుద్ధ మట్కా నెట్‌వర్క్‌లు, ఆఫ్‌షోర్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లు, రాత్రికి రాత్రి పారిపోయే మోసపూరిత ఆపరేటర్ల వైపు మళ్లించినట్లవుతుంది‘ అని పేర్కొన్నాయి.
ప్రజలకు రూ. 20 వేల కోట్ల నష్టం: ప్రభుత్వ అంచనాలు
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల, ఏటా 45 కోట్ల మంది దాదాపు రూ. 20,000 కోట్లు నష్టపోతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. సమాజానికి ఇది పెను సమస్యగా మారిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని కోల్పోయినా సరే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే రియల్ మనీ గేమింగ్‌ని నిషేధించాలన్న నిర్ణయం తీసుకుందని వివరించాయి.
గత మూడున్నరేళ్లుగా పరిశ్రమను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, రియల్ మనీ గేమింగ్ సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నాయి. అయితే, ఆన్‌లైన్ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం ఉండదని .. ఈస్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌ని ప్రమోట్ చేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్, స్కీములు మొదలైనవి ఉంటాయని వివరించారు. దీనితో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు వస్తా యని పేర్కొన్నారు.