breaking news
Indirasagar projects
-
ఆయకట్టు 7.50 లక్షలు
- రాజీవ్-ఇందిరాసాగర్ పరిధిలో పెరగనున్న సాగు భూమి - సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ కసరత్తు - ఈనెలలో తుదిరూపం తీసుకురావాలని నిర్ణయం - కేసీఆర్ విదేశాల నుంచి రాగానే మళ్లీ సమీక్ష సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ఒక్కటిగా చేసి ఆయకట్టును మరింతగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఈ రెండు ప్రాజెక్టులను కలిపి 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని ప్రాథమికంగా నిర్ణరుుంచింది. దీన్ని కాస్త పెంచి 7.50 లక్షల ఎకరాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో చర్చకు వచ్చింది. జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు సర్వే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో జలయజ్ఞంలో రాజీవ్సాగర్తో 2 లక్షల ఎకరాలు, ఇందిరాసాగర్తో 1.32 లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్‌వర్క్ పనులు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన వేలేరుపాడు మండలం రుద్రంకోటలో చేయూల్సి ఉంది. ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై అక్కడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ముగిసిన ఇందిరసాగర్ పనులకు రాజీవ్‌సాగర్ పనులను అనుసంధానం చేసి ఒకే ప్రాజెక్టుతో సాగు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు కసరత్తు చేసింది. రెండు ప్రాజెక్టులకు రూ.1700 కోట్లు ఖర్చు చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రధాన కేంద్రం అశ్వాపురం మండలం పాములపల్లిలో ఉంది. ఇక్కడ నుంచి తొలుత కుమ్మరిగూడెం, గొల్లగూడెం, కరకవాగు, రోళ్లపాడు, లలితాపురం, సింగభూపాలెం, మద్దుకూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా డిజైన్‌చేశారు. రెండు ప్రాజెక్టులను కలిపితే పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. నాగార్జునసాగర్ నీరు జిల్లాలోని ఆయకట్టు అందకపోతే ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని రాజీవ్-ఇందిరాసాగర్తో అందించాలని ప్రభుత్వం నూతన డిజైన్ పనిలో నిమగ్నమైంది. ప్రాథమికంగా ఈ రెండు ప్రాజెక్టుల అనుసంధానంతో సుమారు 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని నిర్ణయించారు. అయితే భారీ వ్యయంతో ఒకే ప్రాజెక్టుతో జిల్లాలోని అన్ని మండలాలకు సాగు నీరు అందేలా ఇంకా ఎన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అవసరమవుతాయో నివేదిక తయారి చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం సమీక్షలో 7.50 లక్షల ఎకరాలు.. ఈనెల 2,3 తేదీలో ముఖ్యమంత్రితో కేసీఆర్.. రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉన్నా సీఎం సమీక్షలో సుమారు 7.50 ఎకరాల వరకు సాగు నీటిని ఇచ్చేలా డిజైన్ చేయాలని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎంత మేరకు సాగు ఆయకట్టు పెరుగుతుందో దాని డిజైన్ పూర్తిగా తయారు చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలతో ఆశాఖల అధికారులు పరుగులు పెడుతున్నారు. గత నెలవరకు 4 లక్షల ఎకరాలకు చేసిన డిజైన్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర విషయాలన్నీ సంబంధిత అధికారులు సీఎంకు వివరించారు. ఆయకట్టు పెంచే విషయమై నూతన డిజైన్ చేయాలన్న ఆదేశాలతో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే ప్రారంభించారు. సీఎం విదేశాల నుంచి రాగానే పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆయకట్టుకు జీవం పోసేనా..? కృష్ణా, గోదావరి రెండు నదులకు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు జన్మస్థానం. జీవనదులుగా ఇవి పేరొందాయి. ఇక్కడి నుంచి రెండు నదులు ప్రవహిస్తున్నా తెలంగాణలోకి వచ్చేసరికి రెండు నదుల పరీవాహక ప్రాంతంలో విభిన్నత కనిపిస్తుంది. కృష్ణా నదిలో నీరు లేకపోతే నాగార్జునసాగర్ నిండక నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు అందదు. కరువు పరిస్థితులుంటే కృష్ణా పరీవాహక ప్రాంతాలు సాగు, తాగు నీటి కోసం తహతహ లాడుతాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో ఈ ఇబ్బంది ఉండడం లేదు. జిల్లా విషయానికి వస్తే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గోదావరికి సమీపాన ఉంది. దండకారణ్యంలో భారీ వర్షాలతో ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాజీవ్‌సాగర్ ద్వారా ఈ నీటిని మళ్లించే సాగు నీటి అందించాలని జలయజ్ఞంలో డిజైన్ చేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీరులేక ఎన్నెస్సీ ఆయకట్టు బీడుభూమిగా మారింది. భవిష్యత్‌లో ఇదే పరిస్థితులు ఉంటే సాగర్ ఆయకట్టుకు గోదావరి నది జీవం పోయనుంది. నూతన డిజైన్‌తో సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే భారీ వ్యయం కానుంది. ప్రభుత్వం ప్రచారం ఆర్భాటం చేస్తుందా..? లేక గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మాదిరిగా ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందా? అనేది చూడాలి. -
ఒక్కటే..!
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞం కింద తీసుకున్న రాజీవ్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్ ప్రాజెక్టుల్లో.. ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ఈ ప్రాజెక్టు హెడ్ వర్క్ పోలవరం ముంపు కింద ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లింది. అక్కడి ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాసినా స్పందించకపోవడంతో దుమ్ముగూడెంతోనే జిల్లాకు సాగునీరు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనే దానిపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నారుు. - దుమ్ముగూడెం ప్రాజెక్టుతోనే జిల్లా అంతటికీ నీరు - ఇందిరాసాగర్ హెడ్ వర్క్ ఏపీలోకి వెళ్లడమే కారణం - ఆంధ్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం - సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ - నెలరోజుల్లో నివేదిక తెప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు - ఈ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు ముందుకు పడేనా..? సాక్షిప్రతినిధి, ఖమ్మం: జలయజ్ఞం కింద అప్పటి ప్రభుత్వం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను తీసుకుంది. రాజీవ్సాగర్తో ఖమ్మం, వరంగల్‌లోని 2 లక్షల ఎకరాలకు, ఇందిరాసాగర్తో ఖమ్మం, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 లక్షల పై చిలుకు ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజన ముందు వరకు రాజీవ్‌సాగర్ పనులు 60 శాతం, ఇందిరాసాగర్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రధాన కాల్వలు, ట్యాంకులు అన్నింటినీ దాదాపుగా పూర్తిచేశారు. గోదావరి నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని పెకైత్తే పనులు మాత్రమే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు అంతా తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉంది. ఇందిరాసాగర్ హెడ్‌వర్క్ పనులు జరిగే ప్రాంతం వేలేరుపాడు మండలం రుద్రంకోట వద్ద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణంపై మొన్నటి వరకు నీలినీడలు అలముకున్నాయి. ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసింది. ఏపీలోని రెండు జిల్లాల్లో 68వేల ఎకరాల ఆయకట్టు కూడా డిజైన్‌లో పేర్కొన్నారు. హెడ్‌వర్క్ పనులు ఏపీలోనే ఉన్నాయనే దాన్నీ ప్రభుత్వం లేఖలో వివరించింది. అరుునా ఆ ప్రభుత్వం స్పందించలేదన్న కారణంతో దుమ్ముగూడెంతోనే జిల్లా అంతటికి నీరందించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనిపై జిల్లా అధికారులు, జిల్లా మంత్రి తుమ్మల, భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావుతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పలుమార్లు చర్చించారు. దుమ్ముగూడెంలోకి ఇందిరాసాగర్ డిజైన్.. జిల్లాలో ఇందిరాసాగర్ ద్వారా 1.32లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో పనులను దుమ్ముగూడెంకు అనుసంధానం చేశారు. మొత్తంగా దుమ్ముగూడెంతోనే సాగునీరు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రెండు ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ.1700 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ పనులను దుమ్ముగూడెంతో అనుసంధానం చేస్తే ఇంకా ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఎన్ని అవసరం అవుతాయి..? తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం జిల్లా అధికారులను ఆదేశించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రధాన కేంద్రం అశ్వాపురం మండలం పాములపల్లిలో ఉంది. ఇక్కడ నుంచి తొలుత కుమ్మరిగూడెం, గొల్లగూడెం, కరకవాగు, రోళ్లపాడు, లలితాపురం, సింగభూపాలెం, మద్దుకూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా డిజైన్ చేశారు. ఇందిరాసాగర్ పనులను అనుసంధానం చేస్తే ఇంకా పలు చెరువులను రిజర్వాయర్లుగా మార్చాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో లేని మండలాలు అన్నింటికీ దుమ్ముగూడెంతోనే సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సింగిల్ ప్రాజెక్టు డిజైన్‌ను తీసుకోవాలని నిర్ణయించింది. పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ఇల్లెందు నియోజకవర్గంలో గార్ల, బయ్యారం, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలు దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్‌లో ఉన్నాయి. ఇందిరాసాగర్ పనులు దుమ్ముగూడెంతో అనుసంధానం చేసి సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకూ సాగునీరు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ డిజైన్ కోసం రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత సాగునీటి ఇంజనీర్లతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇందిరాసాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి.. మ్యాప్ ద్వారా సింగిల్ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఎప్పటికి సాధ్యమయ్యేను..? ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను 2017లోగా పూర్తిచేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. గడువు ఇంకా రెండేళ్లున్నా పనులు మాత్రం పూర్తయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం సింగిల్ ప్రాజెక్టును తీసుకోవడం, జిల్లా అంతటికీ నీరందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ ప్రాజెక్టు ఇంకెప్పటికి పూర్తవుతుందోనని జిల్లా రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇందిరాసాగర్ ప్రధాన పనులు ఏపీలోకి వెళ్లాయని ప్రభుత్వం ఇదొక కారణంగా చూపుతున్నా.. రాజీవ్‌సాగర్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తే జిల్లా ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందంటున్నారు.