breaking news
Indica cars
-
‘టాటా ఇండికా’కు ఇక టాటా!
సాక్షి, న్యూఢిల్లీ: చిన్న కార్లను ఇష్టపడే మధ్య తరగతి ప్రజల ఆశలపై టాటామోటార్స్ నీళ్లు చల్లింది. తాజా సమాచారం ప్రకారం టాటా ఇండికా, టాటా ఇండిగో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. తద్వారా 20 సంవత్సరాలనుంచి టాటామోటార్స్ ప్రముఖ కారుగా నిలిచిన ఇండికా ఇక కనమరుగుకానుందన్నమాట. టాటా ఇండికా, ఇండిగో సెడాన్ల ఉత్పత్తిని శాశ్వతంగా నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2018-19 ప్రారంభంనుంచి ఇండికా, ఇండిగో సెడాన్‌కు సంబంధించి ఒక్క యూనిట్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు. పరిశ్రమల బాడీ సియామ్ గణాంకాలు ఈ సమాచారాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇంపాక్ట్ డిజైన్ కార్ల విజయాన్ని ఆస్వాదిస్తున్న టాటా మోటార్స్ కంపెనీ పాత డిజైన్, తక్కువ సేల్స్ ఉన్న ఇండికా, ఇండిగోలను పూర్తిగా పక్కన పెట్టేసిందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2017-18 ఆర్థిక సంవత్సరానికి టాటా మోటర్స్ 1,666 యూనిట్ల ఇండికా కార్లను, 556 యూనిట్ల ఇండిగో సిఎస్ సెడాన్లు ఉత్పత్తి చేసింది. అనంతరం క్రమంగా ఈ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. దీనిపై టాటా మోటార్స్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. కార్ల సెగ్మెంట్లో మారుతున్న మార్కెట్ డైనమిక్స్, రూపకల్పనకు సంబంధించి కొత్త టెక్నాలజీ నేపథ్యంలో ఇండికా, ఇండిగో ఇసిఎస్లను క్రమంగా ఫేజ్ అవుట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత ఉద్గార నిబంధనలు, బీఎస్-6 నిబంధనల నేపథ్యంలో వాహనాలను బీఎస్-6కు అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. ఇందుకు భారీ పెట్టుబడులు అవసరమని టాటా మోటార్స్ భావిస్తోంది. అలాగే 2020 నాటికి భారతదేశంలో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. కాగా 1998 లో జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన టాటా ఇండికా భారతీయ మార్కెట్లో ఒక ఐకానిక్ మోడల్ అని చెప్పాలి. మొట్టమొదటి స్వదేశీ కారుగా ‘మోర్ కార్ పెర్ కార్’ అనే టాగ్లైన్’తో లాంచ్ అయిన ఒక వారంలోనే 1.15 లక్షల బుకింగ్స్‌ను పొందింది. కేవలం రెండు సంవత్సరాలలో సెగ్మెంట్ లీడర్‌గా అవతరించింది. మరోవైపు టాటా ఇండికా, టాటా ఇండిగో తర్వాత టాటా కాంపాక్ట్ కారు నానో నిర్మాణాన్ని కూడా త్వరలోనే నిలిపివేయనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్ నెలలో, కంపెనీ కేవలం 45 యూనిట్ల నానో కార్లను మాత్రమే తయారు చేసిందని పేర్కొన్నారు. అయితే, టాటా నానో ఈ వెహికల్‌గా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం వుందని భావించారు. అంతేకాదు టాటా మోటర్స్ మాత్రమే కాకుండా మహీంద్ర లాంటి ఇతర కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయనున్నాయని విశ్లేషించారు. -
ఎస్పీ ఆఫీసు ఎదుటే కారు బీభత్సం
సాక్షి, కాకినాడ: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ఇండికా కారు హల్ చల్ చేసింది. సాక్షాత్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులను ఢీకొడుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కారును నడపటం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రాఫీక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఎస్పీ ఆఫీసు ఎదుట పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి తప్పించుకునే యత్నంలో ఇండికా కారు డ్రైవర్ పోలీసుల పైనుంచి దూసుకుపోయింది. కారు ఆపడం లేదని గ్రహించిన ఓ పోలీసు బారికేడ్ అడ్డు పెట్టినా అతడిని ఢీకొడుతూ డ్రైవర్ ఆ కారును నడిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయి. బానుగుడి వైపు వెళ్తున్న కారును ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు బైకర్స్ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులకు లిఫ్ట్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది. -
టాటా ఇండిగో, ఇండికా సీఎన్జీ వేరియంట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ ఇండిగో, ఇండికా కార్లలో ఇమ్యాక్స్ సిరీస్ వేరియంట్లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇమ్యాక్స్ సిరీస్‌లో సీఎన్జీ, పెట్రోల్-బై ఫ్యూయల్ సిస్టమ్ ఆప్షన్ ఉంటుందని కంపెనీ వివరించింది. టాటా ఇండిగో ఇమ్యాక్స్ వేరియంట్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.5.27 లక్షలు, టాటా ఇండికా ఇమాక్స్ వేరియంట్ ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.4.26 లక్షల రేంజ్లో ఉన్నాయని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ పేర్కొంది. సీఎన్జీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే సీఎన్జీ మోడళ్లను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్(కమర్షియల్)) అంకుష్ అరోరా చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. టాటా మోటార్స్ కంపెనీ ఈ ఏడాది జూన్‌లో హొరెజెనైక్స్ట్ ఈవెంట్ సందర్భంగా ఇమ్యాక్స్ రేంజ్‌ను ప్రదర్శించింది. మొదటగా నానో ఇమాక్స్ను అందుబాటులోకి తెచ్చింది.