breaking news
Indian retail market
-
India Wedding Industry: పెళ్లి.. యమా కాస్ట్లీ!
అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...! భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచి్చస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.చదువును మించి... భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచి్చస్తోంది!మన దేశంలో పెళ్లి ఖర్చు కుటుంబం ఖర్చు పేద రూ.3 లక్షలు దిగువ మధ్య తరగతి రూ.6 లక్షలు మధ్య తరగతి రూ.10–25 లక్షలు ఓ మాదిరి సంపన్నులు రూ.50 లక్షలు సంపన్నులు రూ.కోటి, ఆ పైన – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘చిల్లర వర్తకం’లో షైనింగ్ కెరీర్..
టాప్ స్టోరీ ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన సూపర్ మార్కెట్లు, ఫ్యాక్టరీ ఔట్లెట్లు, డిస్కౌంట్ స్టోర్లు వంటివి ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. ‘‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీ; రిటైలర్స్ అసోిిసియేషన్ ఆఫ్ ఇండియా’’ నివేదిక ప్రకారం... 2013లో భారతీయ రిటైల్ మార్కెట్ విలువ 520 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది 2018 నాటికి 950 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరనుంది. ఇంతగా విస్తరిస్తున్న రిటైల్ రంగంలో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇదే యువతకు సమున్నత కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ఉన్నత కెరీర్‌కు ఊతమిచ్చే కోర్సులు! చిల్లర వర్తక రంగం మంచి జోరుమీదుండటంతో దీనికి అవసరమైన మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని, విద్యా సంస్థలు పలు కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఎంబీఏలో పీజీ స్థాయిలో రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇంకా పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను కూడా విద్యా సంస్థలు అందిస్తున్నాయి. దూరవిద్యలోనూ కోర్సులున్నాయి. వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన మార్కెటింగ్ విభాగంలో అవకాశాలు పొందడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ వివిధ కోర్సులు అందిస్తోంది. కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ (కార్ట): రిటైలర్స అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ).. దేశంలోని రిటైల్ రంగ ప్రముఖులతో ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ రిటైల్ రంగ వ్యాపార విస్తరణ అంశాలతోపాటు, సుశిక్షితులైన మానవ వనరులను కూడా అందిస్తోంది. ఇందుకోసం ఏటా కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ పేరుతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా దేశంలోని 17 బి-స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అవకాశాలు బోలెడు!: రిటైల్ మార్కెట్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ విభాగాల్లో అవకాశాలుంటాయి. వీటిలో స్టోర్ ఆపరేషన్స్; హ్యూమన్ రిసోర్సెస్/ట్రైనింగ్; ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్; కస్టమర్ కాంటాక్ట్ సెంటర్స్; మార్కెటింగ్; లాజిస్టిక్స్ వంటివి ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: స్టోర్ మేనేజర్ - డిపార్ట్మెంట్ మేనేజర్ - ఫ్లోర్ మేనేజర్ - హెచ్ఆర్ మేనేజర్ - రిటైల్ స్టోర్ సూపర్వైజర్ - రిటైల్ ఎగ్జిక్యూటివ్ - విజువల్ మర్చండైజర్స్ - సేల్స్ మేనేజర్ - బ్రాండ్ మేనేజర్ - ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ - రిటైల్ బయ్యర్స్. ఇతర రంగాల్లోనూ: రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసిన వారికి సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలోనే ఉద్యోగాలు లభిస్తాయనుకోవడం పొరపాటు. ఇతర పరిశ్రమల్లోనూ రిటైల్ మేనేజ్మెంట్ అర్హులకు అవకాశాలుంటున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్, టెలికం, బ్యాంకింగ్, బెవరేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తాయి. భారతీయ రిటైల్ పరిశ్రమ - సూపర్ మార్కెట్ - అప్పరెల్స్ అండ్ ఫుట్‌వేర్ - హోమ్ ఫర్నీచర్ - లైఫ్‌స్టైల్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్ - హెల్త్ అండ్ వెల్నెస్ - కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిటైల్ రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు: - కమ్యూనికేషన్ స్కిల్స్ - బృంద స్ఫూర్తి - టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ - ఆత్మస్థైర్యం - మార్కెటింగ్ నైపుణ్యాలు - సమస్య పరిష్కార నైపుణ్యాలు టాప్ రిక్రూటర్స్: ఆదిత్యా బిర్లా గ్రూప్; షాపర్స్ స్టాప్, పాంటాలూన్స్, లైఫ్ స్టైల్, వాల్‌మార్ట్, బిగ్ బజార్, ఫ్యూచర్ గ్రూప్. వేతనాలు: రిటైల్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి వేతనాలు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.25,000కు పైగా సంపాదించొచ్చు. పేరున్న సంస్థల్లో అధిక వేతనాలను అందుకోవచ్చు. సంస్థలు, కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీ రిటైల్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ - హైదరాబాద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. వెబ్సైట్:www.ipeindia.org ఇండియన్ రిటైల్ స్కూల్ -ఢిల్లీ కోర్సులు: పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.indianretailschool.com సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స లెర్నింగ్ -పుణె కోర్సు: పీజీడీఆర్ఎం వెబ్సైట్: www.scdl.net ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - న్యూఢిల్లీ కోర్సు: బీబీఏ ఇన్ రిటైలింగ్, వ్యవధి: మూడేళ్లు, అర్హత: 10+2 ఉత్తీర్ణత. వెబ్సైట్: www.ignou.ac.in సుస్థిర కెరీర్‌ను ఖాయం చేసే కోర్సులు ‘‘దేశంలో నేడు యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలోనే కొనుగోలు శక్తి మెరుగుపడి, రిటైల్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విదేశీ పెట్టుబడుల కారణంగా భవిష్యత్తులో మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రధానంగా 18-25 ఏళ్ల లోపు యువతపైనే ఆధారపడి ఉంది. రిటైల్ రంగంలో ఉన్నత అవకాశాలను అందుకోవాలనుకునే వారికి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు చేస్తున్నప్పుడు మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ నైపుణ్యాలను అలవరచుకోవాలి. ఆపై మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకుంటూ ఓర్పు-నేర్పుతో శ్రమిస్తూ ముందుకెళ్తే రిటైల్ రంగంలో సుస్థిర కెరీర్‌ను ఖాయం చేసుకోవచ్చు’’ - ప్రొఫెసర్ బి.కృష్ణారెడ్డి, డీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ