breaking news
Indian Prime Minister Modi
-
కనీసం ఏడుసార్లు ముఖాముఖి
న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీ ఏడుసార్లు ముఖాముఖి కలువనున్నారు. ఒబామా ఈనెల 25న ఉదయం పదిగంటలకు ఢిల్లీలో దిగుతారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఆహ్వాన కార్యక్రమంలో ప్రణబ్, మోదీ పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చల్లో రెండోసారి కలుస్తారు. సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందులో మరోసారి కలుసుకుంటారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒబామా, మోదీ ఒకే దగ్గర కూర్చుంటారు. ఆ సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందులో వీరిద్దరూ ఐదోసారి కలుస్తారు. అదే రోజు వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ‘మన్ కీ బాత్’ పేరిట 27న ప్రసారమయ్యే రేడియో కార్యక్రమం రికార్డింగ్ కోసం వీరిద్దరూ ఏడోసారి కలుస్తారు. -
నేపాల్‌కు రూ. 6 వేల కోట్ల రుణం
మొత్తం 10 ఒప్పందాలపై ఎంవోయూలు నేపాల్ ప్రధాని కోయిరాలాతో భారత ప్రధాని మోదీ భేటీ రక్షణ సహా కీలకాంశాలపై చర్చ ఇరు దేశాల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం నేపాల్‌లో రూ. 500, రూ.1000 నోట్లపై నిషేధం ఎత్తివేత కఠ్మాండు: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా నేపాల్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి భారత్ సుమారు రూ.6,100 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అలాగే వివిధ రంగాల్లో పొరుగు దేశంతో కలసి పనిచేసేందుకు 10 ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం నుంచి నేపాల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం కఠ్మాండు చేరుకున్న భారత ప్రధాని మోదీ... నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలాతో సమావేశమై వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య రక్షణ సహా కీలక రంగాల్లో సహకారం గురించి ఆయనతో మోదీ మాట్లాడారు. అనంతరం 10 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో నేపాల్‌కు సుమారు రూ. 6,100 కోట్ల ఆర్థిక సాయం పై షరతుల ఖరారు ముఖ్యమైనది. నిర్దేశిత ప్రాంతాల్లో వాహన ప్రయాణాలకు అనుమతినిచ్చే మోటారు వాహనాల ఒప్పందంతోపాటు, కఠ్మాండు-వారణాసి, జానక్‌పూర్-అయోధ్య, లుంబినీ-బోధ్ గయ మధ్య ట్విన్ సిటీ ఒప్పందాలు, పర్యాటక, పోలీసు, సంప్రదాయ ఔషధాల వాడకం, అరుణ్ నదిపై 900 మెగావాట్లతో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం తదితర ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కఠ్మాండులోని బార్ ఆస్పత్రిలో భారత్ రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రామా సెంటర్‌ను మోదీ ప్రారంభించారు. అలాగే నేపాల్‌కు ధ్రువ్ హెలికాప్టర్‌తోపాటు బోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను నేపాల్ ప్రధానికి కానుకలుగా ఇచ్చారు. కఠ్మాండు-ఢిల్లీ మధ్య పశుపతినాథ్ ఎక్స్‌ప్రెస్ పేరిట బస్సు సర్వీసును కోయిరాలాతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో కదలిక రావడం సంతోషంగా ఉందని మోదీ చెప్పారు. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడు ఇరు దేశాలు సత్వర ముందడుగు వేయగలుగుతాయన్నారు. ముఖ్యంగా నేపాల్‌లో భారత కరెన్సీ రూ. 500, రూ. 1,000 నోట్ల వాడకంపై పదేళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇకపై నేపాల్‌కు వెళ్లే పర్యాటకులు ఈ నోట్లతో కూడిన రూ. 25 వేల విలువైన కరెన్సీని వెంట తీసుకెళ్లొచ్చు. ట్రామా సెంటర్ ప్రారంభం: భారత ప్రభుత్వం రూ. 150 కోట్ల వ్యయంతో కఠ్మాండులోని బీర్ ఆస్పత్రిలో నిర్మించిన 200 పడకల ట్రామా సెంటర్ (అత్యవసర చికిత్సా కేంద్రం)ను మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఏకాభిప్రాయ సాధన ద్వారా నేపాల్ రాజ్యాంగాన్ని వచ్చే ఏడాది తొలినాళ్లలోగా రాసుకోవాలని అన్ని రాజకీయ పక్షాలను కోరారు. ఈ విషయంలో తమకు ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేకపోవడం వల్ల సాయం చేయలేకపోతున్నందుకు విచారిస్తున్నామన్నారు. ఈ ట్రామా సెంటర్లో 14 ఐసీయూ లు, ట్రామా వార్డులో 150 పడకలు, ఆరు ఆపరేషన్ థియేటర్లు మొదలైనవి ఉన్నాయి. నేపాల్‌కు బోధి వృక్షం మొక్క, ధ్రువ్ హెలికాప్టర్ భారత్, నేపాల్‌లు పంచుకుంటున్న బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా భారత్‌లోని గయలో బుద్ధ భగవానుడు 2,600 ఏళ్ల క్రితం జ్ఞానం పొందిన బోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ప్రధాని మోదీ మంగళవారం నేపాల్‌కు కానుకగా ఇచ్చారు. ట్రామా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. బుద్ధుడు పుట్టిన లుంబినీలో ఉన్న మాయాదేవి ఆలయం ఆవరణలో ఈ మొక్కను తమ దేశ రాయబారి ఈ నెల 28న నాటుతారన్నారు. అలాగే నేపాల్‌తో సంబంధాల బలోపేతం విషయంలో భారత్ నిబద్ధతను చాటుతూ ప్రధాని మోదీ ఆ దేశానికి ధ్రువ్ మార్క్-3 రకానికి చెందిన అత్యుధునిక తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)ను బహూకరించారు. కఠ్మాండులోని నేపాల్ సైనిక పెవిలియన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ ప్రధాని, రక్షణ మంత్రి అయిన సుశీల్ కోయిరాలాకు దీన్ని అందించారు. సుమారు రూ. 60 కోట్ల నుంచి రూ. 80 కోట్ల మధ్య ఖరీదు చేసే ఈ హెలికాప్టర్ ఇద్దరు పైలట్లు, 14 మంది ప్రయాణికులతో ప్రయాణించగలదు.