breaking news
Indian Constituent Assembly
-
‘ఇండియా దటీజ్ భారత్’.. ఇంత జరిగిందా?
ఒకే దేశం– ఒకే పన్ను విధానం తర్వాత ఒకే దేశం–ఒకే ఎన్నిక దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేగంగా కదులుతున్నారు. ఇప్పుడు.. ఎవరూ ఊహించని విధంగా ఒకే దేశం – ఒకే పేరుపైనా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఇండియా దటీజ్ భారత్ అని రాజ్యాంగంలోని ఒకటవ అధికరణంలో పొందుపర్చారు. ఒక దేశానికి రెండురకాల పేర్లు పెట్టారు. అసలు దేశానికి రెండు పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది...దాని వెనుక జరిగిందేమిటి ? ఇండియా దటీజ్ భారత్ అని మన రాజ్యాంగం చెపుతోంది. ఒకటో అధికరణం ప్రకారం దేశానికి రెండు పేర్లు పెట్టారు. ఇలా రెండు పేర్లు పెట్టడం వెనుక రాజ్యాంగ సభలో రెండురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. మన దేశ చారిత్రక వారసత్వానికి అనుగుణంగా భారత్ అని పేరు పెట్టాలని రాజ్యాంగసభ సభ్యులు సేత్ గోవింద్‌దాస్, హరి విష్ణు కామత్ వాదించారు. అంతేకాదు ఇండియా అనే ఆంగ్లపదం ఆంగ్లేయుల పాలనను సూచిస్తుందన్నారు. మరోవైపు హరిగోవింద్పంత్ భారత్వర్షగా దేశం పెట్టాలని సూచించారు. మరికొందరు సభ్యులు చైనా యాత్రీకుడు హ్యుయాన్ త్సాంగ్ తన రచనల్లో దేశం పేరును భారత్ పేర్కొన్నారని ఉదహరించారు. ఇండియా పేరు వలసరాజ్యానికి, పాశ్చాత్యుల ఆధిపత్యానికి గుర్తుగా ఉంటుందని వాదించారు. అయితే ఇండియా పేరు ఎలా చేర్చారు ? చారిత్రకంగా చూస్తే ఇండస్ నది (సింధు నది)కి ఇవతల ఉండే భూభాగాన్ని విదేశీయులు ఇండియాగా పిలిచారు. కాలక్రమంలో అది కొనసాగుతూ వచ్చింది. నిజానికి ఆంగ్లేయుల పాలనా కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకువచ్చారు. మన రాజ్యాంగంలో చాలా అంశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే తీసుకున్నారు. ఆ తర్వాత 1947లో దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పాకిస్తాన్లో ఉన్న హిందువులు భారత్ వైపు, ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్‌వైపు వెళ్లే ప్రయత్నంలో భారీ ఊచకోత జరిగింది. వేలాదిమంది చనిపోయారు. మైనార్టీలలో తీవ్రమైన ఆందోళనలు చెలరేగాయి. ఈ విభజన గాయాల నేపథ్యం రాజ్యాంగ సభ Constituent Assembly సభ్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారత్ అనే పేరు హిందుత్వాన్ని మాత్రమే సూచిస్తుందనే ఉద్దేశంతో, దేశంలోని ఉన్న భిన్న మతాలు, సంస్కృతుల నేపథ్యంలో ఇండియా పేరును కూడా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఇండియా పేరుపై నిర్వహించిన ఓటింగ్లోఅనుకూలంగా 51, వ్యతిరేకంగా 38 ఓట్లు వచ్చాయి. అటు భారత్, ఇండియా మధ్య సమన్వయం కోసం ఇండియా దటీజ్ భారత్ అని రెండు పేర్లను రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో చేర్చారు. అయితే ఈ అంశంపై రాజ్యాంగసభలో వాడీవేడీ చర్చ జరిగిన సమయంలో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, పేర్లపైనా ఘర్షణపూరిత చర్చ కంటే, చేయాల్సిన అసలు పని చాలా ఉందని దానిపైనే దృష్టి పెట్టాలని కోరి ఈ చర్చకు ముగింపు పలికారు. ఇదీ చదవండి: భారత్ అనే పేరు ఎలా పుట్టిందంటే.. ఒకే దేశం–ఒకే పేరు ఒకే దేశం – ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఒకే దేశం– ఒకే చట్టం (ఉమ్మడి పౌరస్మృతి) అనే పాలసీని అమలు చేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం త్వరలోనే ఒకే దేశం–ఒకే పేరు తో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, దేశానికున్న రెండు పేర్లలో ఒకటి తొలగించి, భారత్‌ను శాశ్వతం చేయనున్నారు. :::నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారానికి మూలం?
‘జాతి భవిష్యత్తును సర్వతోముఖంగా తీర్చిదిద్దడానికి రాజ్యం ప్రాథమిక శాసనాన్ని రూపొందించుకోవాలి. దీని కోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి’ అనే భావన తొలిసారిగా పాశ్చత్య దేశాల్లో ఏర్పడింది. మొదటగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పర్చుకున్న రాజ్యాలు - అమెరికాలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ (క్రీ.శ. 1787), ఫ్రాన్స నేషనల్ అసెంబ్లీ (1789-91). ఇవి విప్లవాల మూలంగా ఉద్భవించాయి. తమ దేశ పౌరులకు ఉజ్వల భవిష్యత్‌ను కల్పించే సాధనాలుగా అవి రూపొందించుకున్న రాజ్యాంగ శాసనాలు ప్రపంచంలోని ఇతర రాజ్యాలకు ఆదర్శమయ్యాయి. భారత రాజ్యాంగ పరిషత్ భారత జాతి స్వయం పరిపాలన కోసం దేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని మొదట ఎం.ఎన్. రాయ్ 1934లో అభిప్రాయపడ్డారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకించి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని 1936 పైజ్‌పూర్ సమావేశంలో తీర్మానించారు. భారతీయులతో రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గాంధీజీ 1939లో ‘హరిజన’ పత్రికలో రాశారు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం తదితర అంశాలను నిర్ణయించారు. 1946 జూలై, ఆగస్టులో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. 1946 నవంబర్‌లో పరిషత్ సంపూర్ణంగా ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి, నలుగురు బ్రిటిష్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపికయ్యారు. దేశ విభజన తర్వాత మిగిలిన సభ్యుల సంఖ్య 299. వీరిలో ఎన్నికైన వారు 229, నియమితులైనవారు 70 మంది. సీనియర్ సభ్యుడైన సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ప్రారంభమైంది. దీనికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్; ఉపాధ్యక్షులుగా హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి; సలహాదారునిగా బిఎన్.రావును ఎన్నుకున్నారు. డిసెంబర్ 13న జవహర్ లాల్ నెహ్రూ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే రాజ్యాంగ ప్రవేశిక మూలం. రాజ్యాంగ పరిషత్ దీన్ని 22 జనవరి 1947న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో 12 విషయ నిర్ణాయక, 10 విధాన నిర్ణాయక కమిటీలున్నాయి. వీటిలో ముఖ్యమైంది ముసాయిదా సంఘం. ముసాయిదా సంఘం దీన్ని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య 7. అధ్యక్షుడు - అంబేద్కర్. సభ్యులు - గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం. మున్షి, మహమ్మద్ సాదుల్లా, మిట్టల్, కేతాన్. మిట్టల్ అనారోగ్యానికి గురవడం, కేతాన్ మరణించడంతో వీరి స్థానాల్లో వరుసగా మాధవరావు, కృష్ణమాచారి నియమితులయ్యారు. ముసాయిదా రూపకల్పనకు 114 రోజులు పనిచేశారు. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించారు. రాజ్యాంగ ప్రతిపై 7635 సవరణలు ప్రతిపాదించగా, 2473 మాత్రమే చర్చకు వచ్చాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఏకగ్రీవంగా ఆమోదించి, చట్టంగా మార్చింది. ఈ సమావేశానికి 284 మంది సభ్యులు హాజరయ్యారు. అప్పటి నుంచి రాజ్యాంగం పాక్షికంగా అమల్లోకి వచ్చింది. నెహ్రూ 1929 జనవరి 26న లాహోర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్య తీర్మానం’ ప్రవేశపెట్టారు. దీనికి గుర్తింపుగా 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకువచ్చారు. రాజ్యాంగ పరిషత్తు రెండేళ్ల 11 నెలల 18 రోజులు పనిచేసింది. రాజ్యాంగ రూపకల్పనకు అయిన మొత్తం ఖర్చు రూ. 64 లక్షలు. రాజ్యాంగ పరిషత్ గుర్తు ‘ఐరావతం’. రాజ్యాంగ పరిషత్ మొత్తం 12 పర్యాయాలు సమావేశమైంది. చివరి సమావేశాన్ని 1950 జనవరి 24న నిర్వహించారు. ఈ సమావేశంలోనే మొదటి అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు. పని విధానం ఆధారంగా రాజ్యాంగ పరిషత్‌ను మూడు దశలుగా పేర్కొనవచ్చు. మొదటి దశ: 9 -12-1946 నుంచి 15 - 8 - 1947 వరకు. ఈ దశలో ఇది రాజ్యాంగ పరిషత్తుగా మాత్రమే పనిచేసింది. రెండో దశ: 15 - 8 -1947 నుంచి 26 -11- 1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్గా, పార్లమెంట్‌గా పనిచేసింది. మూడో దశ: 26-11-1949 నుంచి 14-5- 1952 వరకు. ఈ మధ్యకాలంలో పార్లమెంట్‌గా మాత్రమే పనిచేసింది. పార్లమెంట్‌గా శాసన విధులను నిర్వహిస్తున్నప్పుడు అధ్యక్షునిగా జి.వి. మౌలాంకర్, ఉపాధ్యక్షునిగా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన వివిధ వర్గాల ప్రముఖులు: 1. భారత జాతీయ కాంగ్రెస్ - నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్ 2. ముస్లిం వర్గం - మౌలానా అబుల్ కలామ్ అజాద్, సయ్యద్ సాదుల్లా 3. సిక్కులు - సర్దార్ బలదేవ్‌సింగ్, హుకుంసింగ్ 4. యూరోపియన్లు - ప్రాంక్ అంథోనీ 5. మైనార్టీలు - హెచ్.సి. ముఖర్జీ 6. అఖిల భారత షెడ్యూల్ కులాలు - బి.ఆర్. అంబేద్కర్ 7. కార్మిక వర్గం - బాబు జగ్జీవన్‌రామ్ 8. పారశీలు -డాక్టర్ హెచ్.పి. మోడి 9. అఖిల భారత మహిళా సమాఖ్య - హంసా మెహతా 10. అఖిల భారత జమీందార్ల సంఘం - దర్బంగ మహారాజా 11. హిందూ మహాసభ - డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రాజ్యాంగ పరిషత్ కమిటీలు - అధ్యక్షులు 1. సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్ 2. నియమ నిబంధనల కమిటీ - రాజేంద్రప్రసాద్ 3. జెండా కమిటీ - రాజేంద్రప్రసాద్ 4. ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ పటేల్ 5. అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ పటేల్ 6. రాష్ట్ట్రాల అధికారాల కమిటీ - సర్దార్ పటేల్ 7. రాష్ర్ట రాజ్యాంగ కమిటీ - సర్దార్ పటేల్ 8. కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ 9. కేంద్ర అధికారాల కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ 10. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ 11. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ - జె.బి. కృపలాని 12. అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ - డాక్టర్ హెచ్.సి. ముఖర్జీ 13. హోస్ (ఏౌఠట్ఛ) కమిటీ - పట్టాభి సీతారామయ్య 14. సభ వ్యవహారాల కమిటీ - జి.వి. మౌలాంకర్ భారత రాజ్యాంగానికి ముఖ్య ఆధారాలు - గ్రహించిన అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం: సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ట్ర సంబంధాలు, అత్యవసర అధికారాలు, ద్విసభ విధానం. బ్రిటన్: పార్లమెంటరీ ప్రభుత్వం, ిస్పీకర్ వ్యవస్థ, శాసన ప్రక్రియ, సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఎన్నికల యంత్రాంగం, ఉద్యోగుల ఎంపిక పద్ధతులు. అమెరికా: ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ఆధిక్యత, న్యాయసమీక్ష, స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ర్టపతి వ్యవస్థ, మహాభియోగ తీర్మానం. ఐర్లాండ్: ఆదేశిక సూత్రాలు, రాష్ర్టపతి ఎన్నిక, రాజ్యసభ్యుల నియామక పద్ధతి. కెనడా: సమాఖ్య నిర్మాణం, అవశిష్ట అధికారాలు, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి సుప్రీంకోర్ట్టు సలహా కోరడం. ఆస్ట్రేలియా: ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం, కేంద్ర రాష్ట్రాల వాణిజ్య సంబంధాలు. ఫ్రాన్స: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర రాజ్యం, తాత్కాలిక స్పీకర్. జపాన్: జీవించే హక్కు, చట్టం నిర్ధారించిన పద్ధతి. జర్మనీ: జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం. దక్షిణాఫ్రికా: రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ్యుల ఎన్నిక. రష్యా: ప్రాథమిక విధులు, సామ్యవాద విధానం, న్యాయం. విమర్శలు భారత రాజ్యాంగం 1935 చట్టపు ‘జిరాక్స్’ కాపీ - ప్రొఫెసర్ కె.టి.షా. భారత రాజ్యాంగం ఒక ‘న్యాయవాదుల స్వర్గం’ - ఐవర్ జెన్నింగ్‌స. భారత రాజ్యాంగ పరిషత్ ఒక ‘హిందువుల సభ’ - సైమన్. రాజ్యాంగ పరిషత్ అనేది కాంగ్రెస్ పార్టీ సభ - గ్రాన్విల్లె ఆస్టిన్. 1. రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని జత ఏది? 1) రూల్స్ కమిటీ - రాజేంద్రప్రసాద్ 2) సలహా సంఘం - వల్లభాయ్ పటేల్ 3) సారథ్య సంఘం - జవహర్ లాల్ నెహ్రూ 4) ప్రాథమిక హక్కుల ఉపసంఘం - జె.బి. కృపలానీ 2. రాజ్యాంగ పరిషత్‌కు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? 1) సర్దార్ పటేల్ 2) జె.బి.కృపలానీ 3) జవహర్ లాల్ నెహ్రూ 4) కృష్ణస్వామి అయ్యర్ 3. రాజ్యాంగ పరిషత్ గురించి మొదట ఎక్కడ ప్రస్తావించారు? 1) 1942 క్రిప్స్ ప్రతిపాదనలు 2) సైమన్ కమిషన్ 3) క్యాబినెట్ మిషన్ ప్లాన్ 4) వేవెల్ ప్రకటన - 1945 4. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారానికి మూలం? 1) రాజ్యాంగం 2) పార్లమెంట్ 3) రాష్ట్రపతి 4) ప్రజలు 5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) ప్రాథమిక హక్కులు - అమెరికా 2) జీవించే హక్కు - జపాన్ 3) అత్యవసర పరిస్థితి - జర్మనీ 4) పైవన్నీ 6. కిందివారిలో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడెవరు? 1) వి.టి. కృష్ణమాచారి 2) హెచ్.సి. ముఖర్జీ 3) సచ్చిదానంద సిన్హా 4) ప్రాంక్ అంథోని 7. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ? 1) 26-1-1950 2) 26-11-1949 3) 15-8-1947 4) 24-1-1950 సమాధానాలు 1) 3; 2) 3; 3) 1; 4) 4; 5) 4; 6) 4; 7) 2.