breaking news
immigration plans
-
‘పరాయి ప్రతిభ’ కోసం పోటాపోటీ!
వలస కార్మికులకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి దేశాల మధ్య పోటీ విస్తృతమవుతోంది. వలస కార్మికుల కోసం కెనడా భారీ ప్రణాళికను ప్రకటించగా.. విదేశీ ప్రతిభను వద్దనుకున్న అమెరికా సైతం మనసు మార్చుకుని మళ్లీ కావాలంటోంది.ఆవిష్కరణలపరంగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక చర్యలు తీసుకుంది. 1,000 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ పరిశోధకులు ముఖ్యంగా హెచ్ -1బి వీసా హోల్డర్లను లను ఆకర్షించే లక్ష్యంతో 1.7 బిలియన్ కెనడియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తన మొదటి ఫెడరల్ బడ్జెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.నైపుణ్యం కలిగిన నిపుణులు, ముఖ్యంగా నిర్బంధ యూఎస్ వీసా విధానాల వల్ల ప్రభావితమైన వారి కోసం ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని కెనడా ప్రవేశపెడుతోంది. టెక్నాలజీ, హెల్త్ కేర్, నిర్మాణం వంటి అధిక-డిమాండ్ రంగాలను లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను కెనాడా ప్రభుత్వం తీసుకొచ్చింది. విదేశీ ప్రతిభకు గుర్తింపునిచ్చేలా, వారు కెనడియన్ శ్రామిక శక్తిలో ఏకీకృతం అయ్యేలా వ్యవస్థల రూపకల్పనకు నిధులు వెచ్చిస్తోంది.అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ -1బి వీసా రుసుములను పెంచేయడంతో విదేశీ ప్రతిభకు కలిగిన ఇబ్బందికర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రణాళిక రచించింది. ఫాస్ట్-ట్రాక్ మార్గంతో పాటు, అగ్రశ్రేణి పరిశోధకులు, ఆవిష్కర్తలను నియమించుకోవడానికి బడ్జెట్ నిధులను కేటాయిస్తోంది.ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా ఎదగాలన్న కెనడా ఆకాంక్షను తెలియజేస్తోంది. పరిశ్రమ నాయకులు ఈ ప్రణాళికను స్వాగతించారు. ఇది క్లిష్టమైన కార్మిక అంతరాలను భర్తీ చేయడానికి, ఏఐ, బయోటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కెనడా పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.మనసు మార్చుకున్న అమెరికా!వలస కార్మికుల విషయంలో అమెరికా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే వలస కార్మికులపై విరుచుకుపడిన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (US President Trump).. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారు.అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన వలస కార్మికులను నియమించుకోవాలన్నారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదని అంగీకరించారు. -
ట్రంప్ ఎఫెక్ట్: 3 లక్షల మంది ఎన్నారైలు ఇంటికే!
తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు కోటి మందికి పైగా వలసదారులను వాళ్ల వాళ్ల దేశాలకు తిప్పి పంపేయాలన్న ట్రంప్ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం పడుతుంది. తగిన పత్రాలు లేకుండా వలస వచ్చినవాళ్లపై వేటు వేసేందుకు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలును గణనీయంగా మారుస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నవాళ్లను ఏరి పారేయడంలో తమ శాఖ ఇక ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన ఎవరినైనా అరెస్టు చేయడానికి లేదా అదుపులోకి తీసుకోడానికి తమ శాఖ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే డీహెచ్ఎస్ రెండు ఎన్ఫోర్స్మెంట్ మెమోలను జారీచేసింది. వాటి ప్రకారం అక్రమ వలసదారులను వెంటనే తమ దేశాలకు పంపించేందుకు వీలుంటుంది. ప్రధానంగా నేరస్తుల మీదే ఇది దృష్టిపెడుతున్నా, ఇతరులకూ వర్తిస్తుంది. దాదాపు 3 లక్షల మంది వరకు భారతీయులు ఇలా తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. వీళ్లందరికీ కూడా ఈ కొత్త నిబంధనలతో ముప్పు తప్పదు. వాళ్లంతా వెనక్కి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మైనర్లు గానీ, ఆశ్రయం పొందిన వారు గానీ, లేదా సొంత దేశంలో ఏవైనా చిత్రహింసలు అనుభవిస్తామన్న భయంతో ఉంటున్నవాళ్లు.. ఇలాంటి వాళ్లకు మాత్రం కొంతవరకు మినహాయింపు లభిస్తుందని చెబుతున్నారు.


