breaking news
illhealth
-
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్‌ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్‌ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
శతాధికురాలు మృతి
పెదమల్లం(ఆచంట) : పెదమల్లం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు దిరిశాల చంద్రమ్మ(103) మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి ఆమె స్వగృహంలో మరణించారు. ఈమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మనుమలు, ముని, ఇని మనుమలు అంతా కలిపి మొత్తం 105 మంది ఉన్నారు. ఇప్పటివరకూ ఆమె ఎనిమిది పుష్కరాల్లో పుణ్యస్నానమాచరించారు. గత పుష్కరా సందర్భంగా ఆమె తన అనుభవాలను ‘సాక్షి’ పాఠకులతో పంచుకున్నారు. 2014 డిసెంబరు 21న చంద్రమ్మకు కుటుంబ సభ్యులు వసంతోత్సవం నిర్వహించారు. చంద్రమ్మ మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని సందర్శించారు. గ్రామ సమీపంలోని వశిష్ట గోదావరిలో బుధవారం కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమ్మ మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, సర్పంచ్ కొండేటి వీరాస్వామి, మాచేనమ్మ దేవస్థానం చైర్మన్ దిరిశాల ప్రసాద్ సంతాపం తెలిపారు