breaking news
illendu constituencies
-
పాత అభ్యర్థుల మధ్యే పోటీ
సాక్షి, ఇల్లెందు: నియోజకవర్గంలో మళ్లీ నలుగురు పాత అభ్యర్థుల మధ్యే పోటీ సాగుతోంది. ఐదు దఫాలు గెలిచి మూడు దఫాలు ఓడిపోయిన గుమ్మడి నర్సయ్య, మూడు దఫాలు గెలిచి నాలుగు దఫాలు ఓడిపోయిన ఊకె అబ్బయ్య, రెండు దఫాలు ఓడిపోయి ఒక దఫా గెలిచిన కనకయ్య, గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హరిప్రియ మధ్య పోటీలో నిలిచారు. ఈ దఫా 16 మంది బరిలో ఉండగా ఈ నలుగురుతో పాటు బీజేపీ కూడా పోటీ పడుతోంది. నెల రోజుల క్రితం టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ, బీజేపీ తరుపున మోకాళ్ల నాగస్రవంతి పోటీ చేస్తున్నారు. చివరి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన రెబెల్ అభ్యర్థి ఊకె అబ్బయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధానంగా పోటీలో ఈ నలుగురు మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రచారంలో ఎవరికివారు.. టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడంతోపాటు ఇంటింటి ప్రచారం చేశారు. నెల రోజుల నుంచి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ జత కట్టడంతో బలమైన కూటమిగా మారనుంది. సహజంగానే కాంగ్రెస్‌కు అత్యధిక ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ, సీపీఐ జత కావడంతో బలంగా మారే అవకాశం ఉంది. ఎన్డీ రాయల వర్గం గుమ్మడి నర్సయ్యను, చంద్రన్న వర్గం యదళ్లపల్లి సత్యంను మరోమారు తమ అభ్యర్థులుగా ప్రకటించుకుని ప్రచారం ముమ్మరం చేశారు. అగ్రనేతల రాక కోసం ఎదురు చూపు... టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్ర నేతలను రప్పించి ప్రచారం నిర్వహించుకునే ఏర్పాట్లు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర నేతలను, కాంగ్రెస్ రేవంత్‌రెడ్డిని దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ మాత్రం అమిత్‌షా, మురళీధర్‌రావును దించి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎన్డీ బహిరంగ సభను నిర్వహించి తమ విధానాలను ప్రజలకు వివరించే యత్నంలో ఉంది. జిల్లాల విభజన తర్వాత.. జిల్లాల విభజన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి చేరింది. కామేపల్లి మండలం ఖమ్మంలో, గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలో ఇల్లెందు, టేకులపల్లి మండలాలు, ఇల్లెందు మున్సిపాల్టీ భద్రాద్రి జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఇల్లెందు, గార్ల, బయ్యారం, కామేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీతో సాగుతున్న నియోజకవర్గంలో 1,96,798 మంది ఓటర్లు ఉండగా ఇందులో 97,552 మంది పురుషులు, 99,230 స్త్రీలు, 16 ఇతరులు మంది ఉన్నారు. నియోజకవర్గంలో 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పాత కాపుల మధ్య పోరు ఎవరి వైపునకు మొగ్గుతుందో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని వార్తాలు... -
విడిపోతూ...
రూపురేఖలు కోల్పోతున్న భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలు ముంపు మండలాల పేరిట.... తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సందర్భంగా పోలవరం ముంపు మండలాల పేరిట భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండల పరిధిలోని 70 గ్రామాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. జిల్లాలపునర్విభజనతో... భద్రాచలం నియోజకవర్గపరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలను వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ బోయే భూపాలపల్లి జిల్లాలో కలపాలంటూ ఆ జిల్లా కలెక్టర్ సీఎస్‌కు నివేదించారు. నియోజకవర్గాల పునర్విభజనతో... ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, గార్ల, బయ్యారం, టేకులపల్లి, గుండాల, కారేపల్లి మండలాలుండగా, 2009లో నియోజకవర్గాల పునర్విభజన పేరిట గుండాల మండలాన్ని పినపాకలో, కారేపల్లి మండలాన్ని వైరా నియోజకవర్గంలో కలిపారు. అప్పట్లో సుజాతనగర్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కామేపల్లిని ఇల్లెందులోకి తెచ్చారు. జిల్లాల పునర్విభజనతో... కొత్తగా ఏర్పడబోయే మహబూబాబాద్ జిల్లాలోకి గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను కలపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదే జరిగితే ఇల్లెందు నియోజకవర్గంలో మిగిలేవి కామేపల్లి, టేకులపల్లి మాత్రమే. సాక్షిప్రతినిధి, ఖమ్మం : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతోంది. ఇల్లెందు నుంచి మూడు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నుంచి రెండు మండలాలను భూపాలపల్లిలోకి కలపాలన్న ప్రతిపాదనలతో వీటిపైనే అందరి దృష్టి నెలకొంది. నియోజకవర్గ కేంద్రంతో సహా ఇల్లెందు రూపురేఖలే మారిపోనున్నారుు. జిల్లాలోనే ఒకప్పుడు ఎనిమిది మండలాలతో, భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం మూడు మండలాలకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రజల డిమాండ్లతో ఈ మండలాలను జిల్లాలోనే ఉంచుతారా..? లేక కొత్త జిల్లాల్లో కలుపుతారా..? అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భౌగోళిక వైభవాన్ని కోల్పోనున్న భద్రాచలం.. ఐటీడీఏ పరిధిలోకి వచ్చే 24 మండలాల్లో భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల్లోని మండలాలే కీలకం. ఈ మండలాల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలు, స్థానిక గిరిజన తెగలు ఎక్కువగా నివసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. దీంతో ఆపార అటవీ సంపద, కొన్ని ఆదివాసీ జాతులను జిల్లా కోల్పోయింది. రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. మూడు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలు ఏపీలోకి వెళ్లడంతో నియోజకవర్గ జనాభా తగ్గింది. ఇప్పుడు వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లిలో కలపాలన్న పరిస్థితులతో ఇప్పటికే స్వరూపాన్ని కోల్పోయిన భద్రాచలం నియోజకవర్గం భౌగోళిక వైశాల్యం మరింత తగ్గనుంది. ఇక ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలంగా ఉన్న గుండాలను ఇల్లెందు నియోజకవర్గం నుంచి.. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పినపాకలో కలిపారు. మళ్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోకి ఇల్లెందు, గార్ల, బయ్యారం మండలాలను కలపాలని వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. అయితే ఇల్లెందు నియోజకవర్గాన్ని అంతా కొత్తగూడెం జిల్లా పరిధిలోనే ఉంచాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2009కి ముందు ఇల్లెందు.. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, గార్ల, బయ్యారం, టేకులపల్లి, గుండాల, కారేపల్లి మండలాలున్నాయి. పునర్విభజనతో ఇల్లెందు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని పినపాక, కారేపల్లి మండలాన్ని వైరాలో కలిపారు. అప్పట్లో సుజాతనగర్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కామేపల్లిని ఇల్లెందులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను మహబూబాబాద్ జిల్లాలోకి కలపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇల్లెందు నియోజకవర్గ మొత్తం వైశాల్యం 1518.91 చదరపు కిలోమీటర్లు. మూడు మండలాలు మహబూబాబాద్ జిల్లాలో కలిపితే ఈ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారనుంది. నియోజకవర్గ కేంద్రం ఇల్లెందునే మహబూబాబాద్‌లో కలపాలని సోమవారం రాజధానిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సీఎస్‌కు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ మండలాలు మినహాయిస్తే ఈ నియోజకవర్గంలో టేకులపల్లి, కామేపల్లి మండలాలు మిగలనున్నాయి. వీటి వైశాల్యం 591.56 చదరపు కిలోమీటర్లు, జనాభా 67,980 మంది. ముంపు మండలాలతో మొదలై.. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ముంపు మండలాలు విలీనం కాకముందు భద్రాచలం నియోజకవర్గ జనాభా 3,27,945. భద్రాచలం మండలంలోని 70 గ్రామాలు, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోని 277 గ్రామాలను ఏపీలో విలీనం చేశారు. దీంతో ఈ మండలాల నుంచి 1,31,528 మంది జనాభా తూర్పుగోదావరిలోకి వెళ్లింది. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో 1,96,417 మంది జనాభా ఉన్నారు. తాజాగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. వాజేడు మండలంలో 24,816 మంది, వెంకటాపురం మండలంలో 31,765 మంది జనాభా ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ మండలాలను కలిపితే భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాలు ఉండనున్నాయి. వాజేడు, వెంకటాపురం మండలాల జనాభాను మినహాయిస్తే భద్రాచలం నియోజకవర్గ జనాభా 1,39,836 మంది.