breaking news
IFFCO Kisan SEZ
-
ప్రజా ప్రతినిధులా అయితే మాకేంటి?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాచర్ల పాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటైన గమేసా కార్పొరేట్ కంపెనీ స్థానిక ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం గౌవరం ఇవ్వలేదు. కర్మాగారం, పరిపాలనా భవనాల ప్రారంభోత్సవానికి శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ముద్రించిన ఆహ్వాన పత్రికలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతిధులెవరికీ చోటు దక్కలేదు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలు మాత్రమే స్థాపించాల్సిన కిసాన్‌సెజ్‌లో ప్రభుత్వ పెద్దల అండతో గమేసా కంపెనీ 150 ఎకరాల భూమి సంపాదించింది. పవన విద్యుత్ ఉత్పత్తి బ్లేడ్లు(రెక్కల) తయారీ కర్మాగారం ప్రారంభించింది. ఈ కర్మాగారం ఏర్పాటే సెజ్ నిబంధలకు విరుద్ధం. ఇదిలా ఉంటే ఇక్కడ ఎనిమిది రసాయనిక ఉత్పత్తుల తయారీ కోసం గమేసా సంస్థ కాలుష్య నివారణ సంస్థ నుంచి అనుమతి తెచ్చుకుని వీటి ఉత్పత్తి ప్రారంభానికి అడుగులు వేస్తోంది. ఇక్కడి రైతుల భూమి తీసుకుని, గాలిని కలుషితం చేస్తూ నీటిని కొల్లగొట్టేలా గమేసాకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై రైతులు మండిపడుతున్నారు. ఈ వివాదం హైకోర్టు వరకు చేరింది. రైతుల ఒత్తిడి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యవహారంలో గమేశా చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నోరు మూయించే ఎత్తుగడ వేసింది. హైకోర్టు స్టే ఉన్నా తమ కార్పొరేట్ పలుకుబడి ఉపయోగించి సీఎంను తీసుకు వస్తోంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాల్సిన గమేసా సంస్థ వారిని అసలు లెక్కలోకే తీసుకోలేదు. ఆ సంస్థ మీడియాకు పంపిన ఆహ్వాన పత్రికల్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ కైమల్ పేర్లు మాత్రమే ముద్రించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా మంత్రి పి.నారాయణ, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ చెముకుల శీనయ్య, ఎంపీపీ నల్లావుల వెంకమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మాణికెల చెంచమ్మ పేర్లు ముద్రించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడింది. గమేశా వ్యవహార శైలిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా అందజేయలేదు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కానందువల్ల ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ఇఫ్కో అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని సైతం ఎలా శాసిస్తాయనేందుకు ఈ ఆహ్వానపత్రికే పెద్ద ఉదాహరణగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించుకుంటున్నారు. -
మీకు ఆ హక్కు ఎవరిచ్చారు ?
♦ కిసాన్ సెజ్‌లో భూ పందేరంపై ఇఫ్కోను ప్రశ్నించిన హై కోర్టు ♦ రైతు సంఘాల పిటిషన్ విచారణకు స్వీకరణ ♦ గంట పాటు సాగిన వాదనలు ♦ 24వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఇఫ్కోకు ఆదేశం ♦ 31వ తేదీ వరకు తదుపరి చర్యలపై స్టే సాక్షి ప్రతినిధి – నెల్లూరు : ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమలకు జరిగిన భూ పందారంపై హై కోర్టు విచారణకు అంగీకరించింది. సెజ్ లక్ష్యానికి, ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా దేవస్థానం, ప్రభుత్వ భూములు ఇష్టారాజ్యంగా అప్పగించే అధికారం ఎక్కడినుంచి వచ్చిందని ఇఫ్కోను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 24వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఇఫ్కోను ఆదేశిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు తదుపరి పనులన్నీ నిలిపివేయాలని స్టేటస్కో ఇచ్చింది. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో 1996లో యూరియా తయారీ కర్మాగారం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2774 ఎకరాల భూములను సమీకరించింది. ఇందులో పట్టా, ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూములున్నాయి. రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అప్పట్లో ప్రజలు ఈ కర్మాగారం కోసం భూములు అప్పగించడానికి ముందుకొచ్చారు. అయితే కేంద్రంలో ప్రభుత్వ మార్పిడి తర్వాత యూరియా కర్మాగారం స్థాపించలేదు. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ భూములను 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కిసాన్ సెజ్‌గా మార్పు చేయించారు. ఈ సెజ్‌లో పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కర్మాగారాలను మాత్రమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం షరతు పెట్టింది. రైతుపోరు కిసాన్‌సెజ్ నిబంధనలకు విరుద్ధంగా ఇఫ్కో అధికారులు, ప్రభుత్వం ఈ సెజ్‌లో రసాయన పరిశ్రమల స్థాపనకు వందలాది ఎకరాల భూములు కేటాయించింది. కోకో–కోలా పరిశ్రమకు ఇక్కడి నీటిని కేటాయించి వారికి రెడ్‌కార్పెట్ పరిచింది. సెజ్‌ను ఆనుకుని 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాచర్ల పాడు చెరువును ఇఫ్కో తన ఆ«ధిపత్యంలోకి తెచ్చుకుంది. ఈ చెరువును సైతం కోకో– కోలాకు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. చెరువు మీద ఆధార పడి జీవించే వారిని ఆ పరిసర ప్రాంతాలకు కూడా రాకుండా అడ్డుకుంది. రేగడి చెలిక పంచాయతీ పాలక వర్గం అనుమతి ఇవ్వకపోయినా ప్రభుత్వ పెద్దల అండతో నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మించారు. ఈ అన్యాయంపై రైతులు ఇఫ్కో అధికారులతో యుద్ధానికి దిగారు. కొందరు రైతు నాయకులు హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు విచారణ జరిపి చెరువును రైతులకే అప్పగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ప్రభుత్వంలో ఉన్న పరపతి కారణంగా కలెక్టర్ సిఫారసులు అమలు కాకుండా పెండింగ్‌లో పడ్డాయి. అక్రమ భూ కేటాయింపులపై న్యాయ పోరాటం కోవూరు శ్రీకోదండరామాలయానికి చెందిన భూములు, చెరువు, ప్రభుత్వ భూములను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెజ్ అనుమతుల బోర్డు అనుమతులు, పంచాయతీ తీర్మానం లేకుండా రసాయన పరిశ్రమలకు, ఇతర రాష్ట్రాలు తమకు వద్దని తరిమేసిన కర్మాగారానికి భూములు కేటాయించడంపై రైతు సంఘాలు న్యాయ పోరాటానికి దిగాయి. ఈ భూములు తాము కొనుగోలు చేశామని ఇఫ్కో చెబుతున్నా, దేవాదాయ శాఖ భూములు కొనుగోలు చేయడానికి, ఇతరులకు కేటాయించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించడానికి అధికారం లేదని రైతులు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి, పెన్నా డెల్టా రైతు సంక్షేమ సంఘం నేతలు నెల్లూరు నిరంజన్‌రెడ్డి, బెజవాడ శ్రీనివాసులురెడ్డి, అక్కులరెడ్డి గత నెల 30వ తేదీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇఫ్కో చేయించిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసేలా ఆదేశించాలని వారు హై కోర్టును అభ్యర్థించారు. 31వ వరకు స్టేటస్కో జెడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ బెంచ్ మంగళవారం వాదనలు వినింది. దేవాదాయభూములు ఇతరులకు అమ్మే అధికారం, కొనే అధికారం ఇఫ్కోకు ఎవరిచ్చారని హై కోర్టు ప్రశ్నించింది. సుమారు గంట పాటు వాదనలు విన్న అనంతరం ఈ నెల 24వ తేదీ కౌంటర్ దాఖలు చేయాలని ఇఫ్కోకు ఆదేశించింది. ఈనెల 31వ తేదీ వరకు ఇఫ్కో సెజ్‌లో భూములు, ఇతర వ్యవహారాలకు సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.