breaking news
ieeja
-
వెలుగులేవీ?
గద్వాల్/అయిజ (అలంపూర్): కొన్ని నెలలుగా నగరపంచాయతీ పరిధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి అయిజ పట్టణానికి మూడు వేల ఎల్ఈడీ బల్బులు కావాలని అధికారులు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు గత నవంబర్‌లో నగరపంచాయతీకి రెండు విడతలుగా 1,100 పంపిం చారు. అయితే పట్టణంలో ఇంతవరకు వీటిలో 500మాత్రమే విద్యుత్ స్తంభాలకు అమర్చారు. మూడో తీగ లేకపోవడంతో మిగతావి అమర్చలేకపోయారు. వాటి స్థానంలో ఇతర బల్బులు ఉండటంతో అవి రాత్రీపగలు వెలిగి తక్కువ కాలంలోనే కాలిపోతున్నాయి. ఇదిలాఉండగా 2014–15 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌కోకు విద్యుత్ బిల్లుల కింద రూ.3.4లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తు తం ఈ బకాయిలు రూ.4.5కోట్లకు చేరుకున్నాయి. దీంతో ట్రాన్స్‌కో అధికారులు పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు మూడో తీగ ఏర్పాటు చేయడంలేదు. -
వీరోచితం.. విమోచనం
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రకు సజీవ సాక్ష్యం అప్పంపల్లి 11మందిని విచక్షణరహితంగా కాల్చిచంపిన నిజాం సైన్యం నైజాంసర్కార్ను ఎదురించిన అయిజ రైతులు సైనికుల తూటాలకు ఐదుగురు అన్నదాతలు బలి అమరవీరులను ఏనాడూ స్మరించుకోని పాలక గణం ఓ వైపు దేశం సంబురాలు జరుపుకుంటోంది. స్వేచ్ఛావాయువులు పీల్చిన ఆనందంలో తాండవమాడుతోంది. మరోవైపు హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాంప్రభువు అండతో రజాకార్లు చేస్తున్న ఆగడాలతో నిలువెళ్లాగాయాలపాలై ఉంది. ఖాసీం రజ్వీ చేస్తున్న దురాగతాలకు అంతులేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ సమయంలో నిరంకుశ నైజాం పాలన పీడ తొలగించి, తెలంగాణకు విముక్తి ప్రసాదించేందుకు పాలమూరులో ఉద్యమం ఉధృతంగా సాగింది. ఎందరో వీరులు పోరాడి ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విమోచనదినోత్సవం నేపథ్యంలో ఆనాటి పోరాట స్మృతులు.. – ‘సాక్షి’ నెట్వర్క్ అప్పంపల్లిలో నెత్తుటి తర్పణం చిన్నచింతకుంట: ఈ రావిచెట్టు గుండెలు పిండేసే విషాదానికి మౌన సాక్షి.. అది ఎందరో తల్లుల కన్నీటి కథలకు సాక్షి.. తుపాకీ తూటాలు దూసుకుపోతూ చీల్చిన గుండెలు చేసిన ఆర్థనాదాలకు ఈ రావిచెట్టు సాక్షి.. అది తిరగబడ్డ భూమిపుత్రుల వీరోచిత పోరాటానికి సాక్షి.. చరిత్ర మీద తెలంగాణ వీరులు తమ గుండెనెత్తురుతో చేసిన సంతకానికి సాక్షి.. అప్పంపల్లి గ్రామం నిజాం సైనికుల తూటాలకు చెరగని తార్కాణం. నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ బిడ్డల నెత్తురు చూసింది ఈ రావి చెట్టు. నిజాం సైనికుల రక్త చరిత్ర ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన సమయమది. దేశమంతటా త్రివర్ణపతాకంతో సంబరాలు చేసుకుంటున్న తరుణమది. కానీ తెలంగాణలో ప్రజలు నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ విమోచన కోసం గర్జిస్తూ ఆ రక్తపుటేరుల పోరాటంలో తమ ప్రాణాలకు తృణప్రాయంగా పెట్టిన 11మంది అప్పంపల్లి అమరవీరుల త్యాగాన్ని చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. ఆత్మకూర్ సంస్థానంలో అప్పంపల్లికి చెందిన ఉద్యమనేత బెల్లం నాగన్న ఆధ్వర్యంలో లంకాల, దాసర్పల్లి, నెల్లికొండి, వడ్డెమాన్, తదితర గ్రామాల్లో రెండువేల మంది కార్యకర్తలు ఉద్యమించారు. ఉద్యమాన్ని అణచివేయడంలో నిజాం సర్కారు విఫలమైంది. పోరాటానికి నేతృత్వం వహిస్తున్న బెల్లం నాగన్నను అరెస్టు చేస్తే నీరుగారిపోతుందన్న ఉద్దేశంతో 1947 అక్టోబర్ 7వ తేదీన మహబూబ్‌నగర్ నుంచి నిజాం రిజర్వ్ దళాలను అప్పంపల్లికి రప్పించారు. వస్తూనే మార్గమధ్యలో తిర్మాలపురం చెరువు కట్టపై వస్తున్న కల్లు బండిని ఆపి కడుపు నిండ కల్లు సేవించారు. తాగిన మత్తులో అప్పంపల్లిలో ఉన్న నాగన్న ఇంటికి చేరుకున్నారు. అరెస్టు వార్త తెలుసుకున్న గ్రామస్తులు సైనికులపై రాళ్లతో ప్రతిఘటించారు. గ్రామస్తుల తాటికి భయపడి పక్కనే ఉన్న విడిది భవనంలో తలదాచుకున్నారు. సైనికులను తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రం మసకచీకటి పడుతున్న వేళ ఉద్యమకారులు దివిటీలు పట్టుకుని రావిచెట్టు కింద సమావేశమయ్యారు. అంతలోనే క్షణాల్లో కిటికీ నుంచి తుపాకుల మోతలు...ఏం జరుగుతుందోనని తేరుకునే లోపే ఉద్యమకారుల గుండెల్లో నెత్తురు. నిజాం సైనికులు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో తంగెడి రాంరెడ్డి, తంగెడి లక్ష్మారెడ్డి, తంగెడి బాల్‌రెడ్డి, చాకలి కురుమన్న, పోతురాజు ఈశ్వరయ్య, కటికె నన్నెమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, గొల్ల గజ్జెలన్న, వడ్డెమాన్ నర్సన్న, కుర్వ సాయన్న మొత్తం 11మంది ఉద్యమకారులు నేలకొరిగారు. 25మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తీవ్ర గాయాలైన ఉద్యమ నాయకుడు బెల్లం నాగన్నను కర్నూలు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆయన 1983లో అనారోగ్యంతో మృతి చెందాదు. ఎవరూ పట్టించుకోలేదు.. అమరుల కుటుంబాలను గానీ పోరాట యోధులకు గానీ ఒరిగింది ఏమిలేదు. ఎవరు సాయం చేసిన పాపనపోలేదు. ప్రభుత్వం పింఛన్ సైతం ఇవ్వలేదు. అమరవీరుల భార్యలకు ఏమాత్రం ఆసరా ఇవ్వలేదు. అమరవీరుల జ్ఞాపకంగా 2011 అక్టోబర్ 7న బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమకారులను శిక్షించేందుకు కాలాపాని మన్ననూర్: నిజాం నవాబులకు వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించే ఉద్యమకారులను కఠినంగా శిక్షించేందుకు నల్లమల అడవుల్లో 1905లో కాలాపాని పేరుతో జైలు నిర్మించారు. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉద్యమకారులను చిత్రహింసలు పెట్టేందుకు పక్క మనిషికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా రహస్యంగా ఉండేలా నిర్మాణం చేశారు. జైలుకు ఎదురుగా నిజాం నవాబుల సేనలు, సిబ్బంది ఉండేందుకు మరో భవనం ఉంది. దానికి 100అడుగుల దూరంలో జైలు బావి ఉండేది. ఆర్యసమాజ స్థాపన కోసం కృషి చేసిన పండిట్ నరేందర్జీని 1938లో ఈ జైలులోనే బంధించారు. అప్పట్లో ఇక్కడి ప్రజలు పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకోవాలన్నా నవాబుల అనుమతి తప్పనిసరై ఉండేంది. ఉద్యమనాయకుల్లో ఎక్కువకాలం శిక్షణను అనుభవించిన పండిట్ నరేందర్‌జీ జ్ఞాపకార్థం ఆయన పేరుతో ఇక్కడ ఆర్యసమాజ్ భవనం నిర్మించింది. పోరాటాల పురిటిగడ్డ అయిజ అయిజ: చరిత్రలో పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచిపోయింది. నిజాం నవాబుల దుర్మార్గం పాలనకు చరమగీతం పాడేందుకు అయిజలో 1947లో పోరాటం చేశారు. నిజాం ప్రవేశపెట్టిన లెవీ(ధాన్యం)పన్నును ఆ రోజుల్లో తెలంగాణ రైతుల నుంచి సేకరించేవారు. దీంతో మొట్టమొదటిసారిగా లెవీ సహాయ నిరాకరణోద్యమానికి అయిజలో బీజం పడింది. ఇక్కడి రైతులు నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఆలయం నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని సహించలేని నిజాం తన సైన్యంతో 1947 డిసెంబర్ 12న కాల్పులు జరిపించాడు. ఆ కాల్పుల్లో అయిజకు చెందిన రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నరసప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అయిజలో రైతు పోరాటం ఆగలేదు. చివరికి నైజాం తెలంగాణలో విలీనం అయ్యే వరకు కొనసాగింది. స్మరించుకోని పాలకులు నైజాం నవాబులకు వ్యతిరేకంగా లెవీ ఉద్యమాన్ని లేవదీసి, ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ప్రస్తుతం పాలకులు స్మరించుకోకపోవడం దురదష్టకరం. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో స్థూపాన్ని నిర్మించారు. అదే స్థూపాన్ని 1999లో ఆధునికీకరించి ఆ స్థూపంపై గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి నివాళ్లు అర్పించినప్పుడైనా అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం. -
అట్టహాసంగా క్రీడాపోటీలు
అయిజ : ఉత్తనూరు గ్రామంలో క్రీడాదినోత్సవం సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో టీఆర్ఎస్ నాయకులు ఉత్తనూరు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు విద్యార్థులు, పీఈటీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చైర్పర్సన్ రాజేశ్వరి, సింగిల్‌విండో ప్రెసిడెంట్ రామముడు, తహసీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ నాగేంద్ర, ఎంఈఓ గిరిధర్, వైస్ ఎంపీపీ నీలకంఠరెడ్డి, వ్యవసాయ అధికారి శంకర్‌లాల్ హాజరయ్యారు. ముందుగా జాతీయజెండా, క్రీడల జెండాలను ఆవిష్కరించారు. విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. పిరమిడ్ ఆకారంలో కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. ప్రతిభను వెలికితీసేందుకే: తిరుమల్‌రెడ్డి అనంతరం టీఆర్ఎస్ నాయకులు తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల బాల బాలికలతో మూడురోజులపాటు అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ప్రత్సహించాలని, క్రీడాకారులకు చేయూతనందించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి సానెపట్టాలని కోరారు. అనంతరం కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో క్రీడాపోటీలను ప్రారంభించారు. వివిధ క్రీడా పోటీల్లో అన్ని పాఠశాలల విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. క్రీడాపోటీలను చూసేందుకు ప్రజలు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఎన్టీఆర్ మినీస్టేడియం కిక్కిరిసిపోయింది.