breaking news
Hyderabad-Karnataka
-
అక్రమ రవాణాకు అడ్డా !
బెంగళూరు: ఐటీ నగరిగా పేరుగడించిన బెంగళూరు నేడు నేర నగరిగా మారిపోతోంది. మునుపటి ప్రశాంతత కోల్పోతోంది. నగరం నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. సోమవారం అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాల జాడలు రాష్ట్రంలో బహిర్గతమవుతుండటంతో నగర ప్రజల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా చిన్నారులను అక్రమ మార్గంలో అమెరికాకు చేరవేసేందుకు ముఠాల సభ్యులు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా అమెరికాకు ఎగుమతి చేస్తున్న 16 మంది సభ్యులు గల ముఠాను సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ ముఠాసభ్యులు పిల్లలను అమెరికాకు తీసుకువెళ్లే క్రమంలో అనుసరిస్తున్న దారులు విస్మయానికి గురిచేస్తున్నాయి. నకిలీ ధ్రువపత్రాలే కాదు.. నకిలీ తల్లిదండ్రులు కూడా.... బెంగళూరుకు చెందిన ఉదయ్‌ప్రతాప్ సింగ్ విదేశాల్లో సంతానం లేనివారితో పాటు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలకు పిల్లలను ఎగుమతి చేసేవాడు. ఇందు కోసం ముగ్గురు మహిళలతో సహా పదహారు మందితో ప్రత్యేక ముఠాగా ఏర్పడ్డాడు. వీరిలో కొంతమంది రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన హైదరాబాద్ కర్ణాటక జిల్లాల్లోని నిరుపేదల నుంచి నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలను కొంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకొచ్చేవారు. అటుపై ఆ పిల్లలకు తన బృందంలోని సభ్యులనే నకిలీ తల్లిదండ్రులుగా ఏర్పాటు చేసేవాడు. అదేవిధంగా నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, వీసాలు, పాస్‌పోర్టులు చేయించి పిల్లలను, నకిలీ తల్లిదండ్రుల ద్వారా అమెరికాకు టూరిస్ట్ వీసాల ద్వారా పంపించేవారు. ఈ నకిలీ తల్లిదండ్రులు అమెరికాకు చేరుకునే సమయానికి అంతకు ముందుగానే డీల్ కుదుర్చుకున్న సంతానం లేని దంపతులు ఎయిర్‌పోర్టులో వేచి ఉంటారు. ఆ సమయంలో పిల్లలను సదరు దంపతులకు అప్పగించి కొన్ని వారాల పాటు అక్కడే ఉండి నకిలీ దంపతులు వెనక్కి వచ్చేస్తారు. టూరిస్ట్ వీసా ద్వారా అమెరికాకు వెళుతుండటంతో ఈ దంపతులపై పెద్దగా అనుమానం కూడా వచ్చేది కాదు. మరోవైపు ఇలా బెంగళూరు నుంచి అమెరికాకు చేరుకున్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడున్నారన్న విషయాన్ని ముఠాసభ్యులు చెప్పలేకపోతున్నారు. దీంతో సంతానంలేని దంపతులకు పిల్లలను అందజేసే నెపంతో అమెరికాలోని చిన్నపిల్లల స్మగ్లింగ్ గ్యాంగులకు ఉదయ్ ప్రతాప్ సింగ్ ముఠాసభ్యులు సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం ఇలా మొదలైంది! బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిన్నారులతో టూరిస్ట్ వీసాపై అమెరికా వెళ్లిన కొంతమంది దంపతులు వారం లోపే తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు. అయితే తిరిగి వచ్చే సమయంలో వారి వద్ద చిన్నారులు ఉండటం లేదని నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాకుండా బెంగళూరుకు చేరుకున్న తర్వాత నిందితులు అమెరికా వెళ్లే సమయంలో అధికారులకు అందజేసిన వివిధ ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్న చిరునామాలో ఉండటం లేదని కూడా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్ఐటీ) ఏర్పాటు చేసి దాదాపు ఏడాది పాటు నిందితుల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. పక్కా ఆధారాలతో బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ ముఠాను అరెస్ట్ చేసింది. ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచే..... ఈ ముఠాలు ఎక్కువగా గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోని వెనకబడిన ప్రాంతం హైదరాబాద్-కర్ణాటక నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో చిన్నారులను అక్రమంగా తీసుకొచ్చే వారని తెలుస్తోంది. పేదరికంలో ఉంటూ ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలను గుర్తించి వారి నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఆ తర్వాత వారిని అమెరికాలో అమ్మేయడం వీరి ప్రధాన కార్యకలాపాలుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇలాంటి ముఠాలు నగరంలో ఇంకా ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
‘హై-క’ అభివృద్ధే లక్ష్యంగా నేడు గుల్బర్గాలో అసెంబ్లీ
బెంగళూరు : హైదరాబాద్-కర్ణాటక ప్రాంత సమగ్ర అభివృద్ధే ముఖ్య అజెండాగా శుక్రవారం గుల్బర్గాలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతమైన హై-క అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుల్బర్గాలోని కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక హై-క ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇక్కడ సాగు, తాగునీటి వనరుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు అందజేయాల్సిన సాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. హై-క ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను 371(జె) ప్రకారం ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి రాకపోవడంతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక హై-క అభివృద్ధి మండలికి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పాటు ఇప్పటికే విడుదలైన నిధులను సైతం సరిగ్గా వినియోగించలేదు. ఈ కారణంగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక మంత్రి వర్గ సమావేశ నిర్వహణ కోసం గుల్బర్గాకు వస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులకు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గుల్బర్గా నగరాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జెండా లు, కాంగ్రెస్ నాయకుల కటౌట్లతో కాంగ్రెస్ శ్రేణులు నింపేశాయి. కాగా చెరుకు మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు ఈ మంత్రి వర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుల్బర్గాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఇందుకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించి గుల్బర్గాలో మోహరించారు.