breaking news
HV duty supply
-
కేసీఆర్ చైనా టూర్,ఆరంభం అదుర్స్
-
ఆరంభం అదుర్స్
* తొలిరోజే రూ. 1,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన చైనా కంపెనీలు * కేసీఆర్ బృందంతో సంస్థల సీఈవోల చర్చలు * హెవీ డ్యూటీ పంపుల పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న లియో గ్రూప్ కంపెనీ * తమ ప్రాంతాన్ని సందర్శించాలంటూ ముఖ్యమంత్రికి వివిధ ప్రావిన్సుల ఆహ్వానం *నేడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రసంగించనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: చైనాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తొలిరోజునే అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు చైనాలోని లియో గ్రూప్ కంపెనీ ముందుకొచ్చింది. హెవీ డ్యూటీ పంపుల తయారీ పరిశ్రమల స్థాపనకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు డేలియన్ నగరంలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో లియో గ్రూప్ కంపెనీస్ చైర్మన్ లియో వాంగ్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అపూర్వ ఆదరణ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనాకు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి అంచనాలకు మించి ఆదరణ లభిస్తోంది. తమ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుతూ వివిధ ప్రాంతాల్లోని పారిశ్రామిక బృందాల నుంచి తెలంగాణ ప్రతినిధి బృందానికి ఆహ్వానాలు వెల్లువెత్తాయి. షెంఝెన్కు చెందిన ‘చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీసీపీఐటీ)’ అధ్యక్షుడు జినేడ్ యే ప్రత్యేకంగా కేసీఆర్‌కు లేఖ రాశారు. తమ ప్రాంతాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న షెంఝెన్ ప్రావిన్స్‌లోని కంపెనీలు తెలంగాణ వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు. 14న ప్రతినిధి బృందంతో పాటు షెంఝెన్ సందర్శనకు రావాలని.. వాణిజ్యంతో పాటు పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారాన్ని పెంపొందించే ఆలోచనలు పంచుకుందామని కేసీఆర్‌ను కోరారు. ఎంపీ కె.కేశవరావు, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. సీఎంను కలిసిన భారత రాయబారి: మంగళవారం ఉదయం చైనాలోని భారత రాయబారి కె.అశోక్కాంత సీఎం బృందంతో సమావేశమయ్యారు. చైనాలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితులు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పరిశ్రమలకు ఉన్న లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌కు వివరించారు. సాయంత్రం లియావోనింగ్ రాష్ట్రానికి చెందిన 30 కంపెనీల సీఈవోలతో కేసీఆర్ బృందం సమావేశమైంది. దాదాపు 3 గంటలకుపైగా వివిధ అంశాలను చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వివరించారు. సింగిల్ విండో విధానంతో పాటు అందిస్తున్న రాయితీలన్నింటిపై ఈ సందర్భంగా చర్చించారు. కాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేల బృందంతో చైనాకు చేరుకున్నారు. నేడే సదస్సు..: మూడు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తొలిరోజునే సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్రం నుంచి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధి బృందం పాల్గొననుంది. ‘ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు... అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు..’ అనే అంశంపై కేసీఆర్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు.