breaking news
huriath
-
‘దారికొస్తున్న కశ్మీరం’
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని, హురియత్ చర్చలకు సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ అన్నారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చొరవ చూపినా విముఖత ప్రదర్శించిన హురియత్ నేతలు ఇప్పుడు చర్చలకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారని, శుక్రవారం ప్రార్ధనల సమయంలోనూ సమస్యలు సైతం సద్దుమణిగాయని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్‌లోని యురిలో ఉగ్ర దాడి అనంతరం నిలిచిన భారత్- పాక్ చర్చలు తిరిగి ప్రారంభించాలని హురియత్ చీప్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ప్రకటన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఓ వైపు హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడులు జరుగుతుంటే చర్చలు జరపలేమని భారత్ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉండగా ఎన్ఎన్ వోహ్రా స్ధానంలో ఈ ఏడాది ఆగస్టులో సత్య పాల్ మాలిక్‌ను కేంద్రం నియమించింది. -
నరనరాన భారత వ్యతిరేకత
హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీకి వారసుడిగా పేరున్న కరడుగట్టిన వేర్పాటువాది మసరత్ఆలం(42) నరనరాన భారత వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి. ‘భారత వ్యతిరేకత ఆలం రక్తంలోనే ఉంది. 2008, 09, 10ల్లో జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకూడదంటే ఆలంను అరెస్ట్ చేయాల్సిందే’ అని 2014 లో శ్రీనగర్ డీసీపీ పేర్కొనడం ఆలం ఏ స్థాయి వేర్పాటువాద నేతో తేటతెల్లం చేస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆలం.. డిగ్రీవరకు చదివాడు. 1989 నాటి సాయుధ తిరుగుబాటును సమర్థించడంతో ఆయనను అరెస్ట్ చేసి..1996 వరకు జైల్లో ఉంచారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడం వదిలేయడం పరిపాటిగా మారింది.కశ్మీర్ పాకిస్తాన్లో విలీనం కావాలనే ముస్లింలీగ్ పార్టీలో ఆలం చేరారు. క్విట్ కశ్మీర్.. గో ఇండియా గో! ఆలం 2008లో అరస్టై 2010 వరకు జైల్లో ఉన్నాడు. విడుదలయ్యే సమయానికి కశ్మీర్ అల్లర్లతో అట్టుడుకుతూ ఉండేది. ఆలం ‘క్విట్ కశ్మీర్’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ‘భారత్ కో దే రగ్డా’ అనే భారత వ్యతిరేక గేయాన్ని, ‘గో ఇండియా గో’ నినాదాన్ని ప్రచారం చేశాడు. వారంలో ఏ రోజు ఏ ఆందోళన చేయాలో తెలిపే కేలండర్ రూపొందించాడు. వీధుల్లో నిరసనలు, సాయుధ బలగాలపై రాళ్ల దాడులు తదితర వ్యూహాల్తో వేర్పాటువాదుల్లో పాపులారిటీ సంపాదించాడు. అతికష్టం మీద 2010 అక్టోబర్‌లో పోలీసులు ఆయనను మళ్లీ అరెస్ట్ చేశారు. ఆలం దాదాపు 17 ఏళ్లు కటకటాల్లోనే గడిపాడు.