breaking news
HPCL refinery accident
-
23కు పెరిగిన హెచ్‌పీసీఎల్ మృతుల సంఖ్య
హెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురు ఈరోజు మృతి చెందారు. ఆగస్టు 23న విశాఖ హెచ్‌పీసీఎల్ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. కూలింగ్ టవర్‌లోకి గ్యాస్ లీకేజీ వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులు తర్వాత వెల్లడించారు. కూలింగ్ టవర్‌కు వెళ్లే పైపుల్లోకి గ్యాస్ (హైడ్రో కార్బన్, మీథేన్, ఈథేన్, ప్రొఫేన్) లీకేజీ కావడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చినట్లు చెప్పారు. గ్యాస్ భారీ స్థాయిలో రావడంతో అలారం పనిచేయలేదన్నారు. దీనిపై విచారణ జరపనున్నట్టు తెలిపారు. 2009లో నిర్మించిన రెండో కూలింగ్ టవర్‌ను యూరో-4 నాణ్యతాప్రమాణాల మేరకు ఆధునీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. దుర్ఘటన సమయంలో కూలింగ్ టవర్ వద్ద సుమారు వంద మంది పనిచేస్తున్నారని చెప్పారు. పనులు పూర్తయిన టవర్‌లో నిర్వహించిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంప ముంచాయని వారు చెబుతున్నారు. హైడ్రాలిక్ టెస్ట్ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్‌పైన వెల్డింగ్ పనులు కూడా ప్రమాదానికి దోహదం చేశాయి. -
మరో మూడు మృతదేహాలు లభ్యం?
సాక్షి, విశాఖపట్నం: హెచ్‌పీసీఎల్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. ఎనిమిది మంది మృతిచెందినట్టు ప్లాంట్ యాజమాన్యం చెబుతోంది. అయితే పదిమంది మరణించినట్టు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. తాజాగా ఆదివారం ప్లాంటు శిథిలాలు, సంప్ బయట ప్రాంతం నుంచి గుర్తు పట్టడానికి వీల్లేని రీతిలో మూడు మృతదేహాలు బయటపడినట్టు ప్లాంటు వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కొందరు సిబ్బంది వెల్లడించారు. దీంతో పేలుడు ఘటనలో దుర్మరణం పాలైన వారి సంఖ్య 13కు చేరినట్లయింది. అయితే ప్లాంటు యాజమాన్యం మాత్రం ఈ మృతులను ధ్రువీకరించడం లేదు. కాగా పేలుడు నేపథ్యంలో చెలరేగిన మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి బూడిదవడంతో ఆనవాళ్లు దొరకడం లేదన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 37 మందిలో తొమ్మిదిమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మిగిలిన వారిలోనూ కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉండగా కూలింగ్ టవర్ కూలిన ప్రాంతంలో అయిదు సంప్లుండగా.. వీటిలో ఒకటి, రెండు, ఐదు సంప్ల్లో శిథిలాల తొలగింపు పూర్తయింది. మూడు, నాలుగు సంప్ల్లో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. దేవదారు చెక్క, రసాయన షీట్లు కాలిపోవడంతో సంప్ మొత్తం బూడిదతో నిండిపోయింది. వీటిని తొలగించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌పీసీఎల్ చైర్మన్ ఎస్.రాయ్‌చౌదరి ఆదివారం ఢిల్లీనుంచి వచ్చి ప్లాంట్ పరిసరాలను పరిశీలించారు. మూడు యూనిట్ల మూసివేత హెచ్‌పీసీఎల్ ప్రస్తుతం పూర్తిసామర్థ్యంతో నడుస్తోంది. అయితే ప్రమాద ఘటన నేపథ్యంలో కూలింగ్ టవర్ కూలిపోవడంతో దానితో అనుసంధానమై పనిచేయాల్సిన మూడు యూనిట్లను తాత్కాలికంగా అధికారులు మూసేశారు. మరోవైపు కాంట్రాక్టు కార్మికులు సుమారు రెండువేల మందికిపైగా విధులు బహిష్కరించడంతో కొన్ని పనులు ఆగిపోయాయి. కంపెనీ ఉద్యోగులు సైతం ప్రస్తుతం విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు.