breaking news
horrific experience
-
మాపైకి మరో విమానం దూసుకొచ్చింది
కోల్‌కతా: మూడు రోజుల క్రితం చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా తమ విమానానికి ఎదురుగా మరో విమానం దూసుకొచ్చిందని చెప్పారు. తమ పైలట్ తక్షణమే అప్రమత్తమై చాకచాక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. లేకపోతే మరో 10 సెకండ్ల వ్యవధిలోనే రెండు విమానాలు ఢీకొనేవని తెలిపారు. పైలట్ సమర్థత కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడించారు. మమత ప్రయాణిస్తున్న విమానం భారీగా కుదుపులకు లోనైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విమానం కుదుపుల వల్ల మమతా బెనర్జీ ఛాతీ, వీపు భాగంలో గాయాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను బెంగాల్ ప్రభుత్వం కోరింది. (చదవండి: బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా) -
అఫ్గనిస్తాన్: అక్కడ క్షణక్షణం... భయం భయం...
నిశ్శబ్దం... శ్మశాన నిశ్శబ్దం. సాయుధ తాలిబన్ల పహారాలో భీతావహ నిశ్శబ్దం. మొన్నటి దాకా జనంతో కిటకిటలాడిన ఆ కాబూల్ విమానాశ్రయం రోడ్లు ఇప్పుడు నిర్మానుష్యం. అఫ్గాన్‌ను పూర్తిగా విడిచివెళ్ళడానికి అమెరికన్ సైనిక బలగాలు పెట్టుకున్న ఆగస్టు 31 తుది గడువు ముగియడానికి 24 గంటల కన్నా తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో అఫ్గాన్ అంతటా అనిశ్చితి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయం. మరోపక్క అమెరికా వెంటాడి వేటాడిన ఒసామా బిన్ లాడెన్ మాజీ అంగరక్షకుడు – అల్‌ఖైదా కమాండర్ అఫ్గాన్‌కు తిరిగి రావడంతో, తీవ్రవాదంలో పరాకాష్ఠకు చేరిన ‘ఇస్లామిక్ స్టేట్– ఖొరసాన్’ (ఐఎస్–కె) సహా అనేక తీవ్రవాద సంస్థలకు మళ్ళీ అఫ్గాన్ అడ్డాగా మారినట్టయింది. ఒకపక్క భయపెడుతున్న తాలిబన్ల హింసాత్మక పాలన. మరోపక్క వివిధ తీవ్రవాద వర్గాల ఆత్మాహుతి దాడులు. అమాయక అఫ్గాన్ల పని ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్క. దాదాపు 180 మంది అఫ్గాన్లు, 13 మంది అమెరికన్ సైనికులను బలిగొన్న ఆగస్టు 26 ఆత్మాహుతి దాడుల నుంచి సోమవారం ఉదయం విమానాశ్రయం లక్ష్యంగా సాగిన రాకెట్ దాడుల దాకా అనేకం అందుకు నిదర్శనం. తీవ్రవాదంపై పోరు పేర నాటో సేనలతో కలసి అమెరికా 20 ఏళ్ళు చేసిన పని ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. సైనిక ఉపసంహరణ గడువుకు కౌంట్‌డౌన్ మొదలైంది. కథ మళ్ళీ మొదటికే వచ్చింది. దాదాపు 1.14 లక్షల మందిని అఫ్గాన్ నుంచి తరలించామంటోది అమెరికా. ఇప్పటికీ కొన్ని వందల మంది అఫ్గాన్ నుంచి బయటపడేందుకు బేలగా నిరీక్షిస్తున్నారు. గడువు దాటే లోగా అమెరికన్ పౌరుల తరలింపు పూర్తి చేస్తామంటోంది అగ్రరాజ్యం. గడువు దాటినా ఆ ప్రక్రియ కొనసాగిస్తామని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వర్గాల మాట. మరి, మిగిలిన దేశీయుల సంగతి, అగ్రరాజ్యానికి ఇప్పటి దాకా బాసటగా నిలిచినందుకు ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ల పరిస్థితి ఏమిటో తెలీదు. అమెరికన్ గూఢచర్య సంస్థ ‘సిఐఏ’ డైరెక్టర్ వచ్చి, తాలిబన్ నేత బరాదర్‌ను ఇటీవల రహస్యంగా కలసినట్టు కథనం. వీటినిబట్టి పౌరుల తరలింపు విషయంలో వెసులుబాటు దక్కుతుందనే ఆశ. ఆ వెసులుబాటు ఇతర దేశాలకూ దక్కకుంటే అమానుషమే. మరోపక్క శరణార్థుల తరలింపు కోసం కాబూల్‌లో ఉంచిన వైమానిక దళ విమానాలను భారత్ వెనక్కి రప్పిస్తోంది. తాలిబన్లపై ఒత్తిడి పెంచడానికి ఐరాస భద్రతాసమితిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. అఫ్గాన్ వ్యవహారంలో ప్రపంచ దేశాలకు ఏకీభావ వైఖరి అవసరం. అదే ఇప్పుడు ప్రయత్నం కూడా. కానీ, చైనా, రష్యాలు ఇప్పటికే అఫ్గాన్ సానుకూల వైఖరితో ఉన్నందు వల్ల అది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న. కాబూల్ విమానాశ్రయం వద్ద సురక్షిత జోన్‌ను కోరుతూ, ఫ్రాన్స్, బ్రిటన్లు భద్రతాసమితిలో తీర్మానం ప్రవేశపెట్టే పనిలో పడ్డాయి. భద్రతా సమితి తాత్కాలిక నెలవారీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొనే లోగా, పాక్ ప్రేరేపిత తాలిబన్లపై ఒత్తిడి పెంచాలని భారత్ విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే, భద్రతాసమితిలో శాశ్వతసభ్యులైన చైనా, రష్యాలు ఇప్పటికే తాలిబన్ సానుకూల వైఖరిలోకి వచ్చాయి. పొరుగుదేశం పాకిస్తాన్ తాలిబన్లకు అధికారిక వాణిలా మాట్లాడుతోంది. తాలిబన్ పాలనను పాశ్చాత్య ప్రపంచం గుర్తించకుంటే, మరో ‘9/11’ ఘటనకు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొనడం దిగ్భ్రాంతికరం. సైన్య ఉపసంహరణపై అనాలోచిత నిర్ణయం, దోహా చర్చల్లో అమాయకంగా తాలిబన్లను నమ్మడంతో 8500 కోట్ల డాలర్ల విలువైన అమెరికన్ ఆయుధాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో పడ్డాయి. అమెరికా వదిలేసిన పదుల కొద్దీ బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, విమానాలు, కార్గో విమానాలన్నీ వారి కనుసన్నల్లో చేరాయి. అఫ్గాన్ భూభాగంపై తీవ్రవాదాన్నీ, తీవ్రవాద కార్యకలాపాలనూ ససేమిరా అనుమతించమన్నది దోహా ఒప్పందంలో తాలిబన్ల వాగ్దానం. కానీ, అవన్నీ వట్టి నీటి మీద రాతలని తేలిపోయింది. తాలిబన్ల చేతికొచ్చిన అఫ్గాన్‌లో ‘ఐఎస్–కె’ సహా అనేక సంస్థల తీవ్రవాదుల పట్టు తెలుస్తూనే ఉంది. మారామంటున్న తాలిబన్ల మాట నిజం కాదనీ అర్థమవుతోంది. ఓ అఫ్గాన్ జానపద సింగర్ ప్రాణాలు తీసిన సంఘటన చదివాం. ఓ అఫ్గాన్ టీవీ స్టూడియోలో సాయుధ తాలిబన్లు వెన్ను మీద తుపాకులు పెట్టగా, న్యూస్ రీడర్ భయంతో వార్తలు చదువుతూ, తాలిబన్లను ప్రశంసిస్తున్న దృశ్యాలు చూశాం. ఇవన్నీ అక్కడి వాస్తవికతకు దర్పణం. అఫ్గాన్‌కు భారత్ కీలక దేశమనీ, భారత్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నామనీ తాలిబన్ నేత ఒకరు ప్రకటించారు. తరతరాలుగా సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ బంధాలున్న అఫ్గాన్‌తో ఆ స్నేహం ఆహ్వానించదగినదే. కానీ అఫ్గాన్ గడ్డ మీద నుంచి పెరుగుతున్న తీవ్రవాద ముప్పు ఇప్పటికే దేశరక్షణపై భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ మాటే అన్నారు. తాలిబన్లు చెప్పే తీపిమాటలు తీరా చేతల్లో ఏ మేరకు కనిపిస్తాయన్నది అనుమానం. అఫ్గాన్‌లో ఏర్పడే రాజకీయవ్యవస్థను బట్టే భారత కార్యాచరణ సాధ్యం. అంటే, మరికొద్దిరోజులు వేచిచూడక తప్పదు. ఇప్పటికే అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం. బ్యాంకులు మూతబడ్డాయి. ధరలు కొండెక్కాయి. తిండి దొరక్క మానవతావాదులిచ్చే ఆహారం కోసం పిల్లలు, పెద్దలు ఎగబడుతున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. మానవీయ కోణం పక్కకు పెట్టి, భౌగోళిక రాజకీయాల పరంగా చూసినా ఇది అఫ్గా న్కే పరిమితమైన సంక్షోభం కాదు. తీవ్రవాద ముప్పు, వేల మంది శరణార్థుల వ్యవహారం కాబట్టి, ప్రపంచ సంక్షోభం. ఇరవై ఏళ్ళ క్రితమే వ్యూహాత్మక తప్పిదం చేసిన అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే ఆరని రావణకాష్ఠంలా కనిపిస్తోంది. -
‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా’
పారిస్ దోపిడీ ఘటన తర్వాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలను తనను రేప్ చేసి, చంపేస్తారని భావించానని తెలిపింది. గతేడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సందర్భంగా తనను ఎదురైన అనుభవాన్ని తన సోదరీమణులతో పంచుకుంది. ‘అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలో కాలుస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేస్తారని అనుకున్నాను. అందుకు మానసికంగా సిద్ధమయ్యాన’ని కర్దాషియన్ వెల్లడించింది. దుండగులు ఆమెకు భౌతికంగా ఎటువంటి హాని తలపెట్టలేదు. ఆమెను స్నానాల గదిలో బంధించి ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు.