breaking news
Hizb ul Mujahideen
-
ఇజ్రాయెల్‌పై భారీ అటాక్‌కు ఇరాన్ ప్లాన్?
జెరూసలెం పోస్ట్ ఒక సంచలన నివేదిక ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. టెల్‌అవీవ్‌పై గతంలో హమాస్ జరిపిన అక్టోబర్ 7 తరహా దాడికంటే మరింత విస్తృతమైన, బహుముఖ దాడికి ఇరాన్ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌తో అనుబంధంగా ఉన్న ప్రాంతీయ సాయుధ సంస్థలను సమన్వయంతో ఒకేసారి రంగంలోకి దించాలని ప్రణాళిక రచిస్తోన్నట్లు పేర్కొంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హూతీలు, గాజాలోని హమాస్‌తో పాటు ఇరాక్, సిరియాల్లోని ఇరాన్ అనుకూల మిలీషియాలను ఒకేసారి ఇజ్రాయెల్‌పై దాడికి ఉపయోగించే అవకాశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ దాడి గతంలో హమాస్ చేసిన దాడికంటే చాలా పెద్దదిగా ఉండేలా ప్రణాళిక వేస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన సమయంలో ఇరాన్‌తో పాటు ఆ దేశానికి చెందిన ఇతర అనుకూల బలగాలు దాడులు చేయలేదు. అయితే ఈ సారి అలా కాకుండా ఇరాన్ తాజా వ్యూహం లక్ష్యంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా ఒక సంస్థ దాడి చేసి, దాని ప్రభావంతో ఇతర సంస్థలు యుద్ధంలోకి వస్తాయనే విధానానికి బదులుగా, అన్ని అనుబంధ బలగాలు ఒకేసారి దాడి ప్రారంభించేలా ముందస్తు సమన్వయం చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు నివేదిక తెలిపింది.ఇందులో భాగంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన ఖుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియా కమాండర్లతో సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. కాన్ఫరెన్స్ కాల్స్‌తో పాటు ప్రత్యక్ష సమావేశాల ద్వారా భవిష్యత్ దాడుల సమన్వయం, కార్యకలాపాల విస్తరణపై చర్చలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. హమాస్, హిజ్బుల్లా మధ్య ఇరాన్ సహకారంతో సమన్వయం పెరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉత్తరంవైపు హిజ్బుల్లా, దక్షిణం వైపు హమాస్ తదితర బలగాల నుంచి ఒకేసారి ఒత్తిడి తీసుకురావడమే ఈ సమన్వయానికి ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.అదేవిధంగా ఇరాన్ గతంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఇరాన్ అనుకూల బలగాల మధ్య సైనిక, వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడటం కోసం , ఆ గ్రూపుల మధ్య సంయుక్తగా శిక్షణలు నిర్వహించడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఇరాన్ తన ప్రాంతీయ మిత్ర బలగాలను విడివిడిగా కాకుండా ఒకే వ్యూహం కింద సమన్వయం చేసి, ఇజ్రాయెల్‌పై బహుముఖ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ నివేదిక సూచిస్తోంది.అయితే ఇజ్రాయెల్ సైతం ఎక్కడా తగ్గే విధంగా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ సైతం ఈ అంశమై గతంలో ట్రంప్‌తోనూ విభేదించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఇరాన్ ఈ కథనంలో ప్రచురించినట్లు భారీ దాడికి ప్రణాళిక రచిస్తే పరిస్థితి ఇప్పటి కంటే ఎంతో ఉద్రిక్తంగా మారడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. -
నాడు గ్రనేడ్‌తో అరిచి నేడు లొంగిపోయాడు
శ్రీనగర్: నెల రోజుల కిందట చేతిలో గ్రనేడ్ పట్టుకొని ప్రభుత్వ, సైనిక వ్యతిరేక నినాదాలు చేసిన దానిష్ అహ్మద్ అనే కశ్మీర్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అతడికి ఎలాంటి హానీ చేయబోమని తల్లిదండ్రులకు మాట ఇవ్వడంతో బుధవారం ఉదయం లొంగిపోగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘కొద్ది రోజుల కిందట ఓ వీడియో క్లిప్‌లో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది చేతిలో గ్రనేడ్ పట్టుకొని నినాదాలు చేస్తూ కనిపించాడు. ఆ వీడియో క్లిప్ ట్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రిరిస్టు కమాండర్ జబ్జార్ భట్ అంతిమయాత్ర కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ స్థానిక మీడియా ప్రతినిధి రికార్డు చేశాడు. తర్వాత ఆ వీడియోను పరిశీలించగా అందులో ఉగ్రవాదిగా కనిపించిన ఆ వ్యక్తి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ ప్రాంతంలోగల డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న దానిష్ అహ్మద్ అని గుర్తించాం. అనంతరం అతడి తల్లిదండ్రులను సంప్రదించి వివరాలు తెలుసుకోగా వారు తమ నుంచి హామీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు బుధవారం కశ్మీర్‌లోని హంద్వారాలో లొంగిపోయాడు’ అని ఓ పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో తాను సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉన్నానని దానిష్ చెప్పినట్లు వారు తెలిపారు. గతంలో కూడా అతడిపై రాళ్లు విసిరిన ఘటనలో అరెస్టు చేసినా అతడి కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టారు.


