breaking news
hindu dharma rakshana pariraksana
-
ధర్మ ప్రచార కేంద్రంగా ‘అరసవల్లి’
అరసవల్లి: హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అటు విశాఖ నుంచి ఇటు ఒడిశా వరకు అరసవల్లి సూర్య క్షేత్రం ధర్మ ప్రచార కేంద్రంగా విరాజిల్లే అవకాశముందని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ఆయన ఆదివారం పీఠాధిపతి హోదాలో తొలిసారి శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. అనంతరం గర్భాలయంలో ఆదిత్యుడికి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు నిర్వహించారు. తర్వాత అనివెట్టి మండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. శనివారం నారాయణుడిని (శ్రీకూర్మం), ఆదివారం సప్తమి నాడు సూర్యనారాయణుడిని దర్శించుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించారు. నేపాల్ యాత్రలో భాగంగా 1985లో నాటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో కలిసి అరసవల్లికి తొలిసారిగా వచ్చానని, అయితే అప్పటికీ ఇప్పటికీ ఆలయంలో అద్భుత మార్పులు వచ్చాయని చెప్పారు. ఈ కళింగ ప్రాంతంలో ధర్మ ప్రచారం దీక్షగా చేయాలని, ఇలాంటి క్షేత్రాన్ని ధర్మ ప్రచార కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి నగేష్ కాశ్యప శర్మ, రంజిత్ శర్మ, ఫణీంద్ర శర్మ, షణ్ముఖ శర్మ తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, ఎన్.కోటేశ్వర చౌదరి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయాలు ధర్మ రక్షణ నిలయాలు
కడప కల్చరల్ : హిందూ ధర్మ పరిరక్షణకు దేవాలయాలు ముఖ్య కేంద్రాలుగా నిలువాలని హిందూ ధర్మ రక్షణ సమితి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కార్యవర్గం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాని సోమవారం కడప నగరం మున్సిపల్ మైదానంలోగల శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ధ్యాన మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ధర్మ రక్షణ చేయాల్సిన పీఠాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయాయని, టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖలు మాత్రమే హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించగలిగాయని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యత హిందువులందరిపై ఉందన్నారు. సంస్థ కార్యదర్శి చిలకపాటి విజయ రాఘవాచార్యులు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసమే రాష్ట్ర దేవాదాయశాఖకు అనుబంధంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరిట అంకితభావంతో పనిచేస్తామన్న వారితో కమిటీని నియమించామన్నారు. జిల్లా దేవాదాయశాఖ ఏసీ శంకర్‌బాలాజీ కూడా సభలో మాట్లాడారు. కార్యక్రమంలో బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి, అచలానంద ఆశ్రమం పీఠాధిపతి స్వామి విరజానంద, బ్రహ్మంగారిమఠం ప్రముఖులు జీవీ సుబ్బారెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, తంబి సుబ్బరామయ్య తదితరులు మాట్లాడారు. నూతన కమిటీ ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆలయ ఈఓ శ్రీధర్ పర్యవేక్షణలో తంబి సుబ్బరామయ్య జిల్లా కో ఆర్డినేటర్‌గా, వీరభోగ వెంకటేశ్వరస్వామి, విరజానందస్వామి, జీవీ సుబ్బారెడ్డిలను కో ఆప్షన్ సభ్యులుగా ప్రకటించారు. 12 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యుల్లో స్థానికులు రామమహేష్, న్యాయవాది భారవి, పాణి, భూపతిరాయల్, విజయ్‌స్వామి తదితరులు ఉన్నారు.