breaking news
highest railway bridge
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం!
కాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తై రైలు వంతెన చినాబ్ నదిపై నిర్మిస్తున్న రైల్వే శాఖ కౌరీ(జమ్మూకాశ్మీర్): భారత్‌లో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. జమ్మూ కాశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైలు వంతెన ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. భారీ పర్వతాల మధ్య కౌరీ ప్రాంతం వద్ద చేపట్టిన ఈ వారధి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది. వంతెన నిర్మాణం కోసం రైల్వే ఇంజనీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. కేబుల్ క్రేన్ల సాయంతో తోరణాల మాదిరిగా ఉక్కు స్తంభాలను నిలబెట్టి వంతెనను నిర్మిస్తున్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో భారీ వస్తువులను వంతెన వద్దకు తరలించేందుకు హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నారు. మొత్తం 25 వేల టన్నుల ఉక్కును వాడుతున్నారు. నదీప్రవాహానికి ఆటంకం లేకుండానే బ్రిడ్జిని నిర్మించడం అనేది పెద్ద సవాలుగా మారిందని అయినా, 2016 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తై రైల్వే వంతెన చైనాలోని గిర ప్రావిన్స్‌లో బీపాన్‌జియాంగ్ నదిపై ఉంది. ఆ వంతెన ఎత్తు 275 మీటర్లు కాగా.. కాశ్మీర్లో నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తు అంతకన్నా 84 మీటర్లు ఎక్కువ కానుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా కూడా 35 మీటర్లు ఎక్కువ పొడవు ఉంటుంది. భూకంపం వచ్చినా తట్టుకుంటుంది...: ఈ వంతెన నిర్మాణం 2002లోనే ప్రారంభమైంది. అయితే ఈ ప్రాంతంలో భూకంపాల ముప్పు ఉండటం, బలమైన గాలులు వీస్తుండటం వంటి కారణాల వల్ల వంతెన నిలుస్తుందా? లేదా? అన్న సందిగ్ధంతో 2008లో పనులు ఆపేశారు. అధ్యయనాల తర్వాత భూకంపాలు వచ్చినా, బలమైన గాలులు వీచినా తట్టుకునేలా బ్రిడ్జిని డిజైన్ చేశారు. ఎట్టకేలకు నిర్మాణం తిరిగి మొదలైంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ వంతెనకు రూ. 552 కోట్ల వ్యయం కానుందని అంచనా. ఈ వంతెన బారాముల్లా, జమ్మూప్రాంతాలను కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం సాగుతున్న 13 గంటల ప్రయాణం 4గంటలకు తగ్గుతుంది.