breaking news
Hero Mohanbabu
-
కేసీఆర్ కృషి అభినందనీయం
మాజీ ఎంపీ, సినీనటుడు మోహన్‌బాబు వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ ఎంపీ, సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కృషి చేశారన్నారు. ఆ తర్వాత ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రశంసించారు. పదమూడేళ్ల తర్వాత మరోసారి రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత తమ కుటుంబం క్షేమంగా ఉందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని రాజన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. తన మిత్రుడు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను ఈ జిల్లాకు ప్రచారం చేసేందుకు వచ్చానని ఆయన గుర్తు చేశారు. సాగర్జీతో ఉన్న స్నేహబంధం తనను మరోసారి ఇక్కడికి వచ్చేలా చేసిందన్నారు. ఆయన వెంట కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఉన్నారు. అంతకుముందు ఆలయ ఈవో దూస రాజేశ్వర్, అర్చకులు మోహన్‌బాబుకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం బహూకరించారు. -
దటీజ్ మోహన్‌బాబు
‘దానవీరశూరకర్ణ’ చిత్రానికి పోటీగా విడుదలైన ‘కురుక్షేత్రం’(1977) చిత్రాన్ని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తిలకించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఆ చిత్రం ఎన్టీఆర్‌కి నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రంలో శిశుపాలుడు పాత్ర పోషించిన కుర్రాడైతే బాగా నచ్చేశాడు. ‘ఈ శిశుపాలుడెవరో కానీ.. భవిష్యత్తులో గొప్పవాడవుతాడు’ అని జోస్యం చెప్పారు ఎన్టీఆర్. మహానటుని ప్రశంసలు పొందిన ఆ నటుడు - డా.మోహన్‌బాబు. 1980లో ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా విడుదలైంది. బంపర్ హిట్. డైలాగుల కేసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడైపోయాయి. తొలిసారి ఎన్టీఆర్ డైలాగులతో పాటు మోహన్‌బాబు డైలాగుల గురించి కూడా మాట్లాడుకోవడం మొదలైంది. ‘మా వంటవాడు భారతీయుడు... మా తోటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు..’ అంటూ బ్రిటీష్ దొరగా మోహన్‌బాబు పలికిన డైలాగులు పిల్లల నోళ్లలో విపరీతంగా నానాయి. తన జోస్యం త్వరగా నిజమైనందుకు ఎన్టీఆర్ కూడా ఎంతో సంతోషించారు. ‘కొండవీటిసింహం’(1981)లో ఎన్టీఆర్, మోహన్‌బాబు తండ్రీ కొడుకులుగా నటించారు. ఆ సినిమా విడుదలై ముప్ఫై ఏళ్లు దాటుతున్నా... ఇప్పటికీ వారి పాత్రలనూ, ఆ సన్నివేశాలనూ ప్రేక్షకులు మర్చిపోలేరు. ‘కొండవీటి సింహం’ టైమ్‌కి నటునిగా మోహన్‌బాబు వయసు ఏడేళ్లు. అయినా సరే... ఆయనలో ఎక్కడా ‘మహానటుని ముందు నటిస్తున్నాను’ అనే భయం కనిపించదు. నిరూపించుకోవాలనే కసి కనిపిస్తుంది. దటీజ్ మోహన్‌బాబు. ప్రతినాయకునిగా మోహన్‌బాబుది ఓ చరిత్ర. కొత్త కొత్త ఊతపదాలను సృష్టించి సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికారాయన. సినిమాల విజయాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు కూడా కీలక భూమికలు పోషించేవంటే అతిశయోక్తికాదు. గోరంతదీపం, శివరంజని, పదహారేళ్ల వయసు, దేవత, తాండ్రపాపారాయుడు, శ్రీనివాసకల్యాణం, వారసుడొచ్చాడు, బ్రహ్మపుత్రుడు, ఖైదీనంబర్ 786, కొదమసింహం, కొడుకు దిద్దిన కాపురం... తదితర చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఇక హీరో మోహన్‌బాబు గురించి నేటి తరానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఫలానా తరహా పాత్రలు పోషించడంలో మోహన్‌బాబు దిట్ట’ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే... ఏ తరహా పాత్రనైనా అమోఘంగా పోషించగల దిట్ట ఆయన. పౌరాణిక, జానపద, చరిత్రాత్మక, సాంఘిక, కౌబాయ్... ఇలా అన్ని తరహా పాత్రల్లోనూ నటించిన ఘనత ఆయనది. నటునిగానే కాదు... నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయకేతనం ఎగుర వేసిన ప్రతిభాశాలి ఆయన. మోహన్‌బాబు నట ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికి 39 ఏళ్లు పూర్తిచేసుకుని, 40వ పడిలోకి ప్రవేశించారు. ‘స్వర్గం-నరకం’(1975) చిత్రంతో ఆయన హీరోగా తెరంగేట్రం చేశారు. ఇప్పటికీ అడపాదడపా నటిస్తూనే ఉన్నారు. త్వరలో ‘యమలీల-2’తో యమధర్మరాజుగా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.