breaking news
hawala markets
-
బుకీ ఫారెన్‌లో... పంటర్లు సిటీలో!
సాక్షి, సిటీబ్యూరో/ సనత్ నగర్: క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహణలో ఇదో హైటెక్ పంథా... పోలీసు నిఘాకు చిక్కకుండా ఆద్యంతం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు... విజిట్ వీసాపై వెళ్ళి అమెరికాలో తిష్టవేశాడు ప్రధాన బుకీ... పందేల కోసమే ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేయించాడు. సబ్–బుకీలకు గోవాలో సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేశాడు. వీళ్ళు దళారుల సాయంతో నగరంలోని పందెంరాయుళ్ళ (పంటర్లు) ద్వారా దందా నడిపిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో మొదలై, వరల్డ్ కప్ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ వ్యవహారం గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి రూ.8 లక్షల నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వెల్లడించారు. అమెరికాను అడ్డాగా చేసుకుని... నగరంలోని సింధికాలనీ ప్రాంతానికి చెందిన బర్కత్ లలానీ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు దానికి అవసరమైన ఖర్చుల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి క్రికెట్ బెట్టింగ్స్పై పడింది. హైదరాబాద్ కేంద్రంగా కొన్నాళ్ళు నిర్వహించినప్పటికీ ఆపై పోలీసుల నిఘాకు భయపడ్డాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకావడానికి ముందే విజిట్ వీసాపై అమెరికా వెళ్ళాడు. అక్కడ ఉంటూనే బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేకంగా ‘మ్యాచ్బాక్స్9.కామ్’ పేరుతో యాప్ తయారు చేయించాడు. బెట్టింగ్స్ నిర్వహణకు అవసరమైన రికార్డులు, స్లిప్స్, పత్రాలు, మ్యాచ్ చూడటానికి టీవీ, రెష్యో తెలుసుకోవడానికి ఫోన్... ఇలా ఏదీ అవసరం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్ ఆధారంగా అటు పంటర్లు, ఇటు బుకీ దందా నిర్వహించడానికి ఉపయుక్తంగా దీన్ని రూపొందించాడు. దీని అడ్మిన్‌గా అతడే ఉండి సకల లావాదేవీలు అనునిత్యం పరిశీలించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. డిపాజిట్ చేస్తేనే లింకు పంపేది... తనకు పరిచయస్తులైన దానిష్, సోహైల్, సాహిల్‌లను ప్రధాన అనుచరులుగా మార్చుకున్నాడు. మ్యాచ్‌లకు చెందిన సిరీస్ ప్రారంభంకావడానికి ముందు సింధికాలనీకి చెందిన ఈ ముగ్గురినీ గోవాకు పంపిస్తాడు. అక్కడ వీరికి సకలసౌకర్యాలతో బస ఏర్పాటు చేస్తాడు. బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన లింకు వీరి వద్ద మాత్రమే ఉంటుంది. ఈ ముగ్గురూ నగరానికి చెందిన మోహిత్ జైన్, నిఖార్ మహేశ్వరి, రాహుల్‌జైన్, వైభవ్ సాల్విలను సబ్–బుకీలుగా నియమించుకున్నారు. స్థానికంగా ఉన్న పంటర్లలో నమ్మకమైన వారిని గుర్తించే వీళ్ళు వారికి ఈ యాప్, బెట్టింగ్స్ దందాలను వివరిస్తారు. పంటర్లుగా మారడానికి ఆసక్తిచూపిన వారితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిపాజిట్‌గా గోవాలోని వారికి చెల్లించేలా చేస్తాడు. ఈ డబ్బు ముట్టిన వెంటనే వాళ్ళు యాప్‌నకు సంబంధించి లింకును వాట్సాప్ ద్వారా పంటర్లకు పంపిస్తారు. యాప్ ద్వారా పందేలు కాస్తూ డిపాజిట్ మొత్తం ఖాళీ అయ్యే వరకు వీళ్ళు పాలుపంచుకోవచ్చు. ఆపై మళ్ళీ డిపాజిట్ చేసి కొనసాగాల్సి ఉంటుంది. కొందరు పంటర్ల నుంచి డబ్బు వసూలు చేయడానికి జయానీ రూపానీ, నిజాం గిలానీలను కలెక్షన్ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. మూడు శాతం కమీషన్ తీసుకుంటూ... గోవాలో కూర్చున్న ముగ్గురూ ఈ యాప్‌కు సంబంధించిన లైన్‌ను నిర్వహిస్తూ బెట్టింగ్ రేష్యోలు తెలుసుకుని అప్డేట్ చేస్తుంటారు. ఈ పంథాలో బర్కత్ ఒక్కో మ్యాచ్‌కు గరిష్టంగా రూ.50 లక్షల వరకు టర్నోవర్ చేస్తున్నాడు. నగరంలో ఉన్న సబ్–బుకీలు, కలెక్షన్ ఏజెంట్లు ఈ మొత్తంలో మూడు శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలింది గోవాలోని వారికి పంపిస్తారు. వాళ్ళు తమకు రావాల్సింది మినహాయించుకుని మిగిలిన మొత్తం బర్కత్‌కు చేరవేస్తుంటారు. ఈ లావాదేవీలు అన్నీ హవాలా మార్గంలోనే నడిపిపోతున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో బర్కత్ జోరుగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, ఎన్.శ్రీశైలం,వి.నరేందర్, తర్ఖుద్దీన్‌లు సింధికాలనీలోని ఓ ప్రాంతంపై దాడి చేశారు. బర్కత్,డానష్, సోహైల్, సాహిల్ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును రామ్‌గోపాల్‌పేట పోలీసులకు అప్పగించారు. -
హవాలా మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది
పెద్దనోట్ల రద్దుతో చాలా రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం.. హవాలా మార్కెట్. అవును.. ఢిల్లీలో ఇన్నాళ్లుగా జోరుగా సాగుతున్న హవాలా మార్కెట్ మొత్తం పెద్దనోట్ల రద్దుతో కుప్పకూలింది. కస్టమర్లు రాకపోవడంతో చాలామంది ఏజెంట్లు దుకాణాలు మూసేసుకున్నారు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది మాత్రం ఢిల్లీలో ఉన్న గుజరాతీ వ్యాపారులేనని అంటున్నారు. దీపావళి వచ్చిందంటే ఈ దుకాణాల వాళ్లు మొత్తం వ్యాపారం మూసేసి 15-20 రోజుల పాటు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయేపవారని పాత ఢిల్లీలో కొరియర్ సర్వీసు నడుపుకొంటున్న రాకేష్ చెప్పారు. కానీ ఈసారి మాత్రం అలా వెళ్లినవాళ్లు తిరిగి రాలేదని అంటున్నారు. సాధారణంగా హవాలా ఆపరేటర్లు కొంత మొత్తం కమీషన్ తీసుకుని ఎంత పెద్ద మొత్తాలనైనా ఎక్కడినుంచి ఎక్కడికైనా పంపేస్తారు. దీనికి ఎలాంటి అడ్డు అదుపు ఉండేది కాదు. ఎక్కువగా టెర్రరిస్టులు, డ్రగ్ డీలర్లు, ఆయుధాల వ్యాపారులు, ఇతర నేరగాళ్లు ఈ హవాలా నెట్వర్కును బాగా వాడుకునేవారు. దేశంలోని ప్రతి చిన్న,పెద్ద నగరాల్లో ఈ హవాలా వ్యాపారులు ఉన్నారు. ప్రధానంగా మాత్రం ఢిల్లీ, ముంబై, గుజరాత్ ప్రాంతాల్లో ఈ వ్యాపారం ఉందని సమాచారం. తాము ఇంతకుముందు చేసిన వ్యాపారంలో కేవలం 3-5 శాతం వ్యాపారం మాత్రమే ఇప్పుడు సాగుతోందని భారతదేశంతో పాటు పాకిస్థాన్, దుబాయ్ ప్రాంతాల్లో ఉన్న హవాలా ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి తాము వ్యాపారం మూసేసి తమ ఊరు వెళ్లిపోయామని ఒక పెద్ద హవాలా డీలర్ చెప్పాడు. పెద్దనోట్ల రద్దుకు ముందు తీసుకున్న నోట్లు చాలా పెద్దమొత్తంలో వీళ్ల వద్ద ఉండిపోయాయని, దానివల్ల ఇప్పుడు వీళ్లు దివాలా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. 20 లక్షల పాత నోట్లు మార్చాలని ఒక జాతీయ పత్రిక ప్రతినిధి మామూలు కస్టమర్లా వెళ్లి అడిగితే హవాలా ఆపరేటర్ కుదరదన్నారు. పోనీ కొత్త నోట్లయినా సరే 20 లక్షలను ముంబై పంపాలని కోరగా.. మహా అయితే 4-5 లక్షలు పంపగలనని చెప్పారు. కొత్త నోట్ల అందుబాటు చాలా తక్కువగా ఉండటంతో తాము ఏమీ చేయలేక అలా ఒక పక్కన కూర్చుంటున్నామని ఆపరేటర్లు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి 10 శాతం కమీషన్ తీసుకుని నల్లడబ్బును తెల్లగా మారుస్తూ పొట్ట పోసుకుంటున్నట్లు చెబుతున్నారు.