breaking news
harvest farmer
-
అరటి సాగుతో లక్షలు గడిస్తున్న గుంటూరు రైతు
-
అకాల వర్షాలు రైతన్న బెంబేలు
మారిన వాతావరణంతో అన్నదాత వెన్నులో వణుకు జిల్లా అంతటా ఆవరించిన అల్పపీడన ద్రోణి ఇంకా కల్లాల్లోనే ధాన్యం, మొక్కజొన్న మరో 48 గంటల పాటు వర్షసూచన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రబీ రైతును బెంబేలెత్తిస్తున్నాయి. చేతికందే దశలో ఉన్న పంటలు వర్షాలకు తడిచి పోవడం.. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే పరిస్థితి ఉండటంతో అన్నదాత గజగజ వణికిపోతున్నాడు. శుక్రవారం నాటి వర్షాలతో వరి, మొక్కజొన్న రైతులు పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రబీ సీజన్ ముగింపులో అకాల వర్షాలు రైతన్న వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు ఒక మోస్తరు వర్షం నమోదైంది. ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 57,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరో ఐదువేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారమంతా ఆకాశంలో నల్లటి మేఘాలు ఆవరించి ఉండటంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. వరి పంట ప్రస్తుతం కోత, కుప్పనూర్పిడి దశలో ఉంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు హార్వెస్టర్ యంత్రాల ద్వారా పనులు పూర్తి చేసుకున్నారు. యంత్రాలతో వరికోతలు పూర్తి చేసిన పొలాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రాశులుగా పోశారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురవటంతో ధాన్యం తడిచిపోయింది. భారీ వర్షం కురిస్తే పొలాల్లో నీరు నిలిచి ధాన్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న ధాన్యం రాశులతో పాటు రోడ్డు పక్కన నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిచాయి. ఈదురుగాలులు వీస్తే మామిడికి ముప్పే... జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం 3, 4 దశల కోతలు పూర్తయ్యాయని రైతులు చెబుతున్నారు. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తే మామిడికి ప్రమాదమేనని అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, గన్నవరం, పామర్రు, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో మొక్కజొన్న సాగు అధికంగా జరిగింది. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న తడవటంతో బూజు తెగులు వ్యాపించే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. కలిదిండిలో అధిక వర్షపాతం... జిల్లాలో కలిదిండి మండలంలో 20.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పెడన మండలంలో 2.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గంపలగూడెంలో 4.8, గన్నవరంలో 5, ఆగిరిపల్లిలో 4.2, నూజివీడులో 3.6, ఉంగుటూరులో 3.6, బంటుమిల్లిలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 1.1 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులుచెప్పారు. రైతుల ఉరుకులు, పరుగులు... శుక్రవారం తెల్లవారుజామున వర్షం ప్రారంభం కావటంతో పొలాల్లో ఉన్న ధాన్యం రాశులను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. పరదాలు, వరిగడ్డితో ధాన్యం రాశులను కప్పి ఉంచారు. ఆరిన పొలంలో వర్షం కురవటం.. ట్రాక్టర్లు, టైరు బండ్లు నడిచే బాటల్లో నీరు నిలబడటంతో ధాన్యం త్వరితగతిన బయటకు తెచ్చుకోలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఓ మోస్తరు వర్షం కురిసింది కాబట్టి ఇప్పటికి ప్రమాదం లేదని, భారీ వర్షం కురిస్తే తీవ్ర నష్టం తప్పదని రైతులు పేర్కొంటున్నారు. తిరువూరు మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యం... తిరువూరు, గంపలగూడెం మార్కెట్ యార్డులలో విక్రయించేందుకు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిచిపోయింది. నూజివీడు, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట, ఆగిరిపల్లి ప్రాంతాల్లో మామిడి కోత దశలో ఉంది. ఈదురుగాలులు వీస్తే కాయలు రాలిపోయి పాడవుతాయని రైతులు భయపడుతున్నారు. జగ్గయ్యపేటలో ఒక మోస్తరు వర్షం కురవటంతో వరి, మొక్కజొన్న తడిచిపోయాయి. నందిగామలో మిర్చి, మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఈ పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో మొక్కజొన్న కల్లాల్లోనే ఉంది. శుక్రవారం కురిసిన వర్షానికి తోడు మరింత వర్షం కురిస్తే మొక్కజొన్నలో తేమశాతం పెరిగే ప్రమాదముందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కురిసిన వర్షపాతం, పంటలు ఏయే స్థితిలో ఉన్నాయి తదితర వివరాలను ఆయా మండలాల నుంచి సేకరిస్తున్నట్లు వ్యవసాయాధికారులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కొనసాగుతున్న భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి నందిగామ, జి.కొండూరు, మైలవరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ వర్షాలు మామిడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.