breaking news
happy homes apartments
-
త్వరలోనే దోషులను పట్టుకుంటాం: ఏసీపీ
హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీకి యత్నించిన ముఠాను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులు బంటి, సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఉన్నారన్న సమాచారంతోనే ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో సోదాలు నిర్వహించామన్నారు. మొత్తం ఆరుగురు ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించినట్లు గుర్తించామన్నారు. చోరికి నెల రోజులుగా ముఠా రెక్కీ నిర్వహించినట్లు గుర్తించామన్నారు. వీరంతా ముంబైకి చెందిన అర్జున్వెట్టి గ్యాంగ్ సభ్యులుగా ఏసీపీ వెల్లడించారు. ఎక్కువ బంగారం దొరుకుతుందనే ముత్తూట్‌ను టార్గెట్ చేసి ఉంటారని, త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. టవేరా వాహనంలో యాక్సిల్ బ్లేడ్, వేట కొడవలి, ఫేక్ నంబర్ ప్లేట్, ఓ పెద్ద బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టవేరా వాహనం గుజరాత్‌కు చెందినదిగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. మొత్తం ఎనిమిది బ్లాక్‌ల్లో తనిఖీలు చేశామని,ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు క్లూస్ టీమ్ పూర్తి ఆధారాలు సేకరిస్తోందని అన్నారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండటం వల్లే ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదనే ఆక్టోపస్‌ను రంగంలోకి దింపామన్నారు. మరోవైపు పోలీసు శునకాలు దుండగుల వాహనం దగ్గరి నుంచి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనాల్లో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారు హ్యపీహోమ్ అపార్ట్మెంట్లో ఉండొచ్చనే యోచనతో అణువణువునా తెల్లవారు జాము 3 గంటల వరకూ తనిఖీ చేశారు. -
‘హ్యాపీ హోమ్స్’ ముట్టడి
- ముత్తూట్ దొంగలను ఎట్టకేలకు పట్టుకున్న ఆక్టోపస్ బలగాలు - తెల్లవారుజాము 3:30 వరకూ కొనసాగిన ఆపరేషన్ - ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారుల ప్రకటన - ముత్తూట్ కార్యాలయంలోకి తుపాకులు, తల్వార్లతో వచ్చిన దొంగలు - బంగారం తాకట్టు పెడతామంటూ మాటా ముచ్చట - ఒక్కసారిగా కౌంటర్‌పై నుంచి దూకి దోపిడీకి యత్నం - భయంతో కేకలు వేసిన ఉద్యోగులు, ఖాతాదారులు - అప్రమత్తమైన స్థానికులు.. ఆందోళనతో దొంగలు పరారు - స్పందించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ఉదయం గం. 10:00 - మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం ఉదయం గం. 10:29 - ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్లో టవేరా వాహనాన్ని నిలిపిన దుండగులు సాయంత్రం గం. 6:30 - హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్ సెల్లార్లో టవేరా వాహనాన్ని గుర్తించిన పోలీసులు రాత్రి గం. 7:30 - వందలాది మంది పోలీసుల మోహరింపు రాత్రి గం. 9:30 - ఆక్టోపస్ బలగాల రాక. విద్యుత్ సరఫరా నిలిపివేత రాత్రి గం. 10:00 - సైబరాబాద్ పోలీసులు, ఆక్టోపస్ సిబ్బంది కార్టన్ సెర్చ్ ప్రారంభం తెల్లవారుజాము(బుధవారం) 3:30 - ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి ప్రయత్నించిన దుండగులు.. వారిని పట్టుకొనేందుకు భారీ స్థాయిలో ఆపరేషన్.. వందలాది మంది పోలీ సులు.. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు.. దాదాపు 500 ఫ్లాట్లలో అణువణువూ గాలింపు.. వెరసి క్షణక్షణం ఉత్కంఠ! గంటలపాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆపరేష్ పూర్తయిందని, ఇక పట్టుబడ్డవారిని విచారించాల్సిఉందని అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీ యత్నం, దొంగలను పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్‌తో నెలకొన్న పరిస్థితి ఇదీ.. అసలేం జరిగింది..? హైదరాబాద్ శివార్లలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. దాదాపు ఆరు నెలల కింద బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ. 12 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన తరహాలోనే... మంగళవారం మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీకి ప్రయత్నించారు. ఇందుకోసం ఒక రోజు ముందుగానే రెక్కీ చేసి.. పక్కాగా ప్లాన్ వేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తల్వార్లు, తుపాకీలతో ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. లాకర్ తాళాలివ్వాలంటూ మేనేజర్‌కు తుపాకీ ఎక్కుపెట్టారు. కానీ కార్యాలయం సిబ్బంది, ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండి కేకలు వేయడం, చుట్టుపక్కల వారు స్పందించడంతో దొంగలు పారిపోయారు. హిందీలో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ప్రజాభవన్ ప్రధాన రహదారిపై ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఆ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో హార్డ్‌వేర్ దుకాణం, కిరాణా, మొబైల్స్ సెంటర్, టీ స్టాల్లు ఉండగా.. మొదటి అంతస్తులో ఈ కార్యాలయం ఉంది. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న కొందరు యువకులు సిల్వర్ (వెండి) రంగు టవెరా కారు (టీఎస్ 12 ఈబీ 3711)లో అక్కడికి వచ్చారు. వారిలో నలుగురు బంగారం తనఖా పెడతామంటూ కార్యాలయంలోకి వచ్చి దోపిడీకి విఫలయత్నం చేశారు. సిబ్బంది, ఖాతాదారులు పెద్ద పెట్టున కేకలు వేయడంతో ఎవరైనా వస్తారేమోనన్న ఆందోళనతో పారిపోయారు. వారంతా హిందీలోనే మాట్లాడటంతో ఉత్తరాదికి చెందిన దొంగల ముఠా కావొచ్చని.. ఉదయం పెద్దగా జనమెవరూ ఉండరనే ఉద్దేశంతో దోపిడీకి ఆ సమయాన్ని ఎంచుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాపాడాలంటూ అరుపులతో.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి ఓ పక్కన పెద్ద కిటికీ ఉంది. దాని ద్వారా పక్కనే ఉన్న బస్తీ కనిపిస్తుంది. ఆ కిటికీ పక్కనే ఉన్న స్థలంలో ఇంటి యజమాని కిషోర్ అదనపు గదులు కట్టిస్తున్నారు. మంగళవారం 10 గంటల సమయంలో ముత్తూట్ కార్యాలయం కిటికీ నుంచి ‘కాపాడండి’అంటూ పెద్ద పెట్టున కేకలు వినిపించాయి. దీంతో కిషోర్ వెంటనే పైఅంతస్తులోకి పరుగు తీశారు. అదే సమయంలో కిందికి పరుగెత్తుకుంటూ వస్తున్న నలుగురు దుండగులు ఆయుధాలతో బెదిరించడంతో గోడదూకి బయటకు వచ్చారు. దీంతో కిశోర్ కాళ్లకు గాయాలయ్యాయి. రోజూ లక్షల రూపాయల లావాదేవీలు నిర్వహించే ముత్తూట్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగిందన్న ప్రచారంతో.. బంగారం తాకట్టు పెట్టిన వారంతా కార్యాలయానికి చేరుకున్నారు. ఎలాంటి దోపిడీ జరగలేదని తెలుసుకుని వెనుదిరిగారు. పక్కాగా రెక్కీ చేసి..: పటాన్చెరు నుంచి ఓఆర్ఆర్ మీదుగా వచ్చిన దుండగుల కారు శంషాబాద్ టోల్గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు టోల్ ఫీజు కట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4.15 గంటల సమయంలో వారు మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చారు. బంగారం తనఖా పెడతామంటూ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్‌ను అడిగారు. అయితే వారివద్ద ఆధార్ కార్డుగానీ, ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలుగానీ లేకపోవడంతో.. బంగారాన్ని తాకట్టు పెట్టుకునేందుకు మేనేజర్ నిరాకరించారు. ఈ సమయంలో దాదాపు గంట పాటు వారు అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు. తాము అద్దెకు ఉంటున్న వ్యక్తి నుంచి ఆధార్ కార్డు తీసుకొని మరుసటి రోజు వస్తామంటూ వెళ్లిపోయారు. వేగంగా స్పందించిన పోలీసులు: ముత్తూట్ దోపిడీ యత్నం విషయం తెలిసిన పోలీసులు వేగంగా స్పందించారు. మంగళవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఔటర్ రింగ్‌రోడ్‌తో పాటు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లిపోయే దారుల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల డేటా ఆధారంగా దుండగులు ఉపయోగించిన టవెరా కారును ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ వద్ద పార్కు చేసినట్టుగా గుర్తించారు. ఉదయం 10.45 గంటల సమయంలోనే హ్యాపీహోమ్స్ వద్దకు వచ్చిన దొంగలు.. ముందు గేట్ నుంచి వెళ్లి లోపల పార్క్ చేశారు. అనంతరం కారు నంబర్ ప్లేట్‌ను ఊడదీసి పడేసి.. వెనుకగేటు నుంచి వెళ్లిపోయారు. అయితే కారు ఛాసిస్ నంబర్ ఆధారంగా అది గుజరాత్‌కు సంబంధించిన కారు అని, యజమాని పేరు మహ్మద్ ఫజుల్లాగా పోలీసులు గుర్తించారు. బీరంగూడ ముత్తూట్ చోరీ వ్యక్తేనా? మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన ముత్తూట్ దోపిడీ యత్నానికి గతేడాది డిసెంబర్ 28న రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దోపిడీలో భాగస్వామి అయిన ఒక నిందితుడు.. ఆ సమయంలో ఉప్పర్‌పల్లిలోని హ్యపీ హోమ్స్ వద్దే ఉన్నట్టుగా నిర్ధారణ కావడం... తాజా దోపిడీకి యత్నించినవారు ఇక్కడే కారు పార్కింగ్ చేయడంతో సందేహాలు వస్తున్నాయి. అలాగే ఈ దోపిడీలో భాగస్వాములైన వారిలో ఒకరు పదిరోజుల క్రితం ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నట్టుగా అనుమానిస్తున్న పోలీసులు... ఎవరు ఆశ్రయం కల్పించి ఉంటారనే దిశగా విచారణ ముమ్మరం చేశారు. టెన్షన్.. హైటెన్షన్ హ్యపీ హోమ్స్ వద్ద దుండగుల కారును గుర్తించడంతో వందలాది మంది పోలీసులు మోహరించారు. దొంగల వద్ద తుపాకులు, మారణాయుధాలు ఉన్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ దళాలూ రంగంలోకి దిగాయి. హ్యాపీ హోమ్స్‌లో 9 బ్లాకుల్లో దాదాపు 500 ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపు రాత్రి 9 గంటల ప్రాంతంలో హ్యాపీ హోమ్స్‌ను చుట్టుముట్టిన పోలీసులు.. అపార్ట్మెంట్లన్నింటికీ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులతో అణువణువూ గాలింపు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీమ్, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ జానకి షర్మిల, శంషాబాద్ ఇన్చార్జి డీసీపీగాఉన్న సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందాలు ప్రతి ఫ్లాట్‌ను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పోలీసు శునకాలు దుండగుల వాహనం దగ్గరి నుంచి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనాల్లో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారు హ్యపీహోమ్ అపార్ట్మెంట్లో ఉండొచ్చనే యోచనతో అణువణువునా తనిఖీ చేశారు.