breaking news
hanging rope
-
ఉరితాళ్లు సిద్ధం చేయండి
పట్నా: ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత నిర్భయ దోషులను త్వరలో ఉరితీయనున్నారా? ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయా? అవునంటున్నాయి ఇటీవలి పరిణామాలు. ఉరితాళ్లను తయారు చేయడంలో దేశంలో పేరెన్నికగన్న ఓ జైలుకు 10 తాళ్లను ఈ వారాంతంలోగా సిద్ధంగా ఉంచాలన్న ఆదేశాలు రావడం దీనికి కారణం. డిసెంబర్ 14వ తేదీకల్లా పది ఉరితాళ్లను సిద్ధంగా ఉంచాలని తమకు జైళ్లశాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారో మాత్రం తెలియదని బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ అరోరా తెలిపారు. ఒక్కో ఉరితాడు తయారీకి కనీసం మూడు రోజులు పడుతుందని, దాదాపు పెద్ద యంత్రాలేవీ వాడకుండా చేతులతోనే వీటిని తయారుచేస్తారని విజయ్ వివరించారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీసిన తాడు కూడా ఈ బక్సర్ జైలులోనే తయారైందని చెప్పారు. 2016–17లో పటియాలా జైలు నుంచి కూడా ఉరితాళ్లు కావాలంటూ తమకు ఆర్డర్లు వచ్చాయని, కాకపోతే వినియోగించేది ఎక్కడ అనేది మాత్రం తెలియలేదని విజయ్ చెప్పారు. చివరిసారిగా తాము సరఫరా చేసిన ఒక్కో ఉరితాడుకు రూ.1,725 రూపాయలు ఖర్చయిందని, ఇనుము, ఇత్తడి ధరల్లో మార్పులను బట్టి ఉరితాడు ధర మారుతుందని తెలిపారు. తాళ్లను పురివేసి ఉరితాడుగా మార్చేటపుడు ఈ లోహాల తీగలనూ వినియోగిస్తారు. మెడచుట్టూ ఉరి బిగుతుగా ఉండేందుకు ఉరితాడులోని ఈ లోహాల తీగలు సాయపడతాయని, దోషి శరీరం వేలాడేటప్పుడు ముడి విడిపోకుండా చేస్తాయని విజయ్ వివరించారు. ఒక్క తాడు తయారీకి ఐదారుగురు ఒక ఉరితాడు తయారుచేయడానికి సుమారు ఐదారుగురు పనివాళ్లు అవసరమవుతారని విజయ్ అరోరా తెలిపారు. ఉరితాడు తయారీ ప్రక్రియలో భాగంగా మొదటగా 152 పోగులను పెనవేసి ఒక చిన్నపాటి తాడుగా చేస్తారని విజయ్ చెప్పారు. ఇలాంటి తాళ్లను పురివేసి ఉరితాడును తయారుచేస్తారు. మొత్తంగా చూస్తే ఒక ఉరితాడు తయారీలో దాదాపు 7000 పోగులను వినియోగిస్తారని తెలిపారు. ఈసారి నిర్దేశిత సమయంలోపే ఉరితాళ్లను సిద్ధం చేయగలమని, అనుభవజ్ఞులైన సిబ్బంది తగినంత మంది ఉన్నారని చెప్పారు. తాము తయారు చేసే ఉరితాళ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతాయని స్పష్టం చేశారు. నిర్భయ దోషులను ఈ నెల పదహారున ఉరితీయనున్నారని ఒక వర్గం మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉరితాడు తయారీ వార్తకు ప్రాధాన్యమేర్పడింది. -
ఆ ఉరితాడు ఎక్కడ తయారైందో తెలుసా?
పట్నా: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ను ఉరితీయడానికి ఉపమోగించిన తాడును బిహార్ జైలు నుంచి పంపించినట్లు జైలు అధికారులు తెలిపారు. బుక్సార్ సెంట్రల్ జైలులో తయారుచేసిన ఈ తాడును మెమన్ ఉరితీత కోసం పంపినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్కే చౌదరి వెల్లడించారు. గతంలో దేశంలోని పలు జైళ్లలో కూడా ఈ తాడును వియోగించినట్లు చెప్పారు. తొలిసారిగా 2004లో 14 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసులో ధనంజయ్ బెనర్జీని ఉరితీయడానికి కోల్‌కతాకు ఈ తాడు చేరవేసినట్లు తెలిపారు. పార్లమెంట్ దాడులకు కారుకుడైన అఫ్జల్‌గురు, ముంబై దాడుల కేసులో నిందితుడు అజ్మల్ కసబ్ లను ఉరితీసేందుకు ఇక్కడ తయారుచేసిన తాడునే వాడినట్లు చౌదరి పేర్కొన్నారు. జే-34 కాటన్ వాడి తాడును తయారు చేశామని, ఆ తర్వాత మైనంతో దానిని మెత్తబడేలా చేస్తామని తయారీ పద్ధతిని వివరించారు. -
ఊయలతాడే ఉరితాడయింది...
కడప అర్బన్: ఊయల తాడు ఓ చిన్నారి పాలిట ఉరితాడయింది. ఊయల ఊగుతుండగా ప్రమాదవశాత్తూ ఆ తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కడప జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... కడప పట్టణంలోని మరియపురానికి చెందిన నర్సింహులు, మారెమ్మ దంపతులు. వీరు స్థానికంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి రెండో కుమార్తె నయోమి(10) గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఊయల ఊగుతోంది. అయితే, ప్రమాదవశాత్తు ఊయల తాడు ఆ బాలిక గొంతుకు బిగుసుకుంది. దాని నుంచి బైట పడేందుకు చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో నయోమి ఊపిరాడక మృతి చెందింది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు నయోమి విగతజీవిగా కనిపించింది. కన్నకూతుర్ని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి పరిస్థితి చూపరులను సైతం కంటతడి పెట్టించింది.