breaking news
Handloom Department
-
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
తుర్కయాంజాల్: రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్‌పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. నేత కార్మికులకు వరాలు... చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్లూమ్స్ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులవృత్తులకు జీవం... నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్‌తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్‌కు భూమిపూజ ఉప్పల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్‌కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి కారిడార్ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. -
గుండ్లపోచంపల్లిలో హస్తకళల శిక్షణా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల హస్తకళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గుండ్లపోచంపల్లి పారిశ్రామిక వాడలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా మని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీని నిర్వహణ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయి స్తామన్నారు. అలాగే ఈ పారిశ్రామికవాడలో సంబంధం లేని ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తుల అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. చేనేత శాఖపై మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. పాశమైలారం టెక్స్టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు టెస్కో ఆధ్వర్యంలో విక్రయ కేంద్రాల పెంపు, వెబ్సైట్ ఏర్పాటు, రీ బ్రాండింగ్ వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, లూమ్స్ అప్‌గ్రెడేషన్ వంటి కార్యక్రమాలను లబ్ధిదారుల్లోకి తీసుకెళ్లేందుకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లను నియమించుకోవాలన్నారు. సెప్టెంబర్‌లోగా అందుబాటులోకి బతుకమ్మ చీరలు: చేనేత శాఖ డైరెక్టర్ ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ మంత్రికి నివేదించారు. మొత్తం చీరలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయిస్తున్నామని, సెప్టెంబర్ మూడో వారంలోగా చీరలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక వసతులు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌ను కలిసిన బ్రిటన్ మంత్రి సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ ప్రభుత్వంలోని ఆసియా, పసిఫిక్ వ్యవహారాల మంత్రి మార్క్ ఫీల్డ్ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును మంగళవారం కలిశారు. బ్రిటన్ హై కమిషనర్ డొమినిక్ అస్క్విత్, డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను కలిసిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడల విశేషాలను కేటీఆర్ బ్రిటన్ మంత్రికి తెలియజేశారు. -
‘బతుకమ్మ చీర’కు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండగకు పంపిణీ చేయనున్న చీరల కొనుగోలుకు చేనేత జౌళిశాఖ టెండర్లు పిలిచింది. సిరిసిల్ల మరమగ్గాల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం తలపెట్టింది. దీనికోసం దాదాపు 86 లక్షల చీరెలు అవసరం. కానీ అంత భారీ మొత్తం వస్త్రోత్పత్తి సిరిసిల్లలో ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అధికారు లు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలోనే అత్య ధికంగా సిరిసిల్లలో 32 వేల మరమగ్గాలు న్నాయి. కానీ అక్కడున్న రెగ్యులర్ ఆర్డర్ల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ పదివేల మరమగ్గాలపై మాత్రమే ప్రారంభమైంది. ఈ లెక్కన రోజుకు 8 లక్షల మీటర్ల ఉత్పత్తికి మించి సాధ్యం కాదు. కానీ ప్రభుత్వ ఆర్డరు మేరకు ఆరు కోట్ల మీటర్లు ఉత్పత్తి కావాలి. నెలలో ఇంత భారీ మొత్తం సాధ్యం కాదు కనుక... టెండర్లను ఆహ్వానించింది.