చీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రూ.8.14 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన భయ్యా రంగారావు చీటీల వ్యాపారం చేస్తూ పలువురిని మోసగించి రూ.12 లక్షలతో ఉడాయించాడు. దీనిపై ఈనెల 2న ముడికూటి సోమేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు రంగారావును శనివారం ఉదయం అతని ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 27మందికి చెందిన రూ.8.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టు సీఐ చెప్పారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సీఐ మూర్తి, ఎస్సై ఐ.వీర్రాజు కేసు దర్యాప్తు చేశారు.