జీవీఎంసీ సీఈపై వేటు?
ఆయన్ను సరెండర్ చేస్తారని ప్రచారం
లేదా బదిలీ వేటు తప్పకపోవచ్చు కమిషనర్‌తో విభేదాలే కారణం
మరోవైపు ఎస్ఈ మోజెస్‌కుమార్ డిప్యుటేషన్ విజయవాడ సీఈగా నియామకం
ఇంజినీరింగ్ సెక్షన్లో దుమారం
విశాఖపట్నం: జీవీఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్లో బదిలీల కుదుపు మొదలైంది. సూపరింటెండింగ్ ఇంజనీర్(స్మార్ట్‌సిటీ) టి.మోజెస్‌కుమార్‌ను డిప్యుటేషన్‌పై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్(సీఈ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్టీఎస్, జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టుల్లో ఎక్కువ కాలం పనిచేసిన ఆయన ప్రస్తుతం స్మార్ట్ సిటీతో పాటు రెండు జోన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీతో కార్పొరేషన్లో అలజడి రేగింది. మరోపక్క సీఈ దుర్గాప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసేస్తున్నారన్న ఊహాగానాలు జీవీఎంసీలో తీవ్ర దుమారం రేపాయి. గత కొంత కాలంగా ఈయన బదిలీపై చర్చ జరుగుతోంది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సీఈ దుర్గాప్రసాద్‌ల మధ్య సఖ్యత లేక పోవడం.. ప్రతి అంశంలోనూ కమీషనర్‌తో విభేదిస్తుండటంతో సీఈని దాదాపుగా పక్కన పెట్టి నగర ప్రాజెక్టులతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న పనులను కమిషనరే నేరుగా పర్యవేక్షిస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇటీవల రాజీవ్ స్మృతి భవన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీలో నేదునూరి కృష్ణమూర్తి స్మారక మందిరం, విగ్రహావిష్కరణ, ఇతర పనులను తన ప్రమేయం లేకుండా నిర్వహించారంటూ సీఈపై కమిషనర్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. సీఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కమిషనర్ ఆయన్ను సరెండర్ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిసింది. కాగా సీఈకి జిల్లాకు చెందిన ఓ మంత్రి అండ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఈ దుర్గాప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారని, ఆయన స్థానంలో చంద్రయ్యకు బాధ్యతలు అప్పగించారనే పుకార్లు గురువారం జీవీఎంసీలో షికార్ చేశాయి. ఈవాళో రేపో సీఈ సరెండర్ లేదా బదిలీ వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.