breaking news
Gururaja
-
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
దర్శకుడిగా మారిన విలన్!
సీనియర్ నటుడు సత్యప్రకాష్ పేరు చెప్పగానే ‘పోలీస్ స్టోరీ’ సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగానూ, ముఖ్య పాత్రధారిగానూ రాణించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 11 భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టారు. సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు ‘ఉల్లాలా ఉల్లాలా’. గత వాలంటైన్స్ డేకి భారీ ఎత్తున ‘లవర్స్ డే’ చిత్రాన్ని విడుదల చేసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుఖీభవ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ `ఉల్లాలా ఉల్లాలా` చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ ‘తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించాను. ‘పోలీస్ స్టోరీ’, ‘సీతారామరాజు’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘సమర సింహారెడ్డి’, ‘మాస్టర్’, ‘డేంజర్’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘బిగ్ బాస్’ తదితర చిత్రాలు నాకెంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్లో నటుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో చాలా వింతలూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుంది. దర్శకునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’ అని అన్నారు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. -
అరవయ్యేళ్లవారు కూడా ఎంజాయ్ చేస్తారు
‘‘కన్ను కొట్టి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ప్రియా ప్రకాశ్. ఆమె నటించిన క్రేజీ చిత్రం రైట్స్ మాకు దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అనువాద హక్కులకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను చూసి వాళ్లు రేట్ బాగా పెంచారు. భారీ హీరోకు పెట్టే బడ్జెట్‌తో కొనుగోలు చేశాం. దానికి కారణం సినిమా మీద ఉన్న ప్యాషనే’’ అన్నారు నిర్మాత గురురాజ్. ప్రియా ప్రకాశ్ వారియర్ ముఖ్య పాత్రలో ఒమర్ లూలు రూపొందించిన చిత్రం ‘ఒరు అధార్ లవ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సీహెచ్ వినోద్ రెడ్డి సమర్పణలో గురురాజ్ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒమర్ లూలు తీసిన రెండు లవ్ స్టోరీలు సూపర్ హిట్. ఇప్పుడు తీసిన మూడో లవ్‌స్టోరీలో ప్రియా ప్రకాశ్ కన్ను గీటే వీడియా వైరల్ అయ్యాక సినిమాలో మార్పులు, చేర్పులు చేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా మాకు దక్కడానికి కారణమైన మిత్రులు సీతారామరాజు, సురేశ్ వర్మకు థ్యాంక్స్. ఇది ప్రేమ కథ అయినప్పటికీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అరవయ్యేళ్ల వాళ్లు కూడా ఇరవయ్యేళ్లవారిలా ఆనందిస్తారు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణమైన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. -
లిఫ్టర్ గురురాజ్‌కు భారీ నజరానా
యశవంతపుర : అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత కీర్తిని చాటి వెండి పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ గురురాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ. 25 లక్షల నగదుతో పాటు ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ప్రమోద్ మద్వరాజ్ తెలిపారు. గురువారం ఆయన ఉడిపిలో విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే గురురాజ్‌కు ఏకలవ్యం ప్రశస్తితో సన్మానించినట్లు చెప్పారు. దేశ కీర్తిని విదేశాలలో రెపరెపలాడించిన గురురాజ్ వెండి పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. -
వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో గురురాజాకు రజతం
-
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో గురురాజాకు ఇదే తొలి పతకం. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్ లిప్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ పసిడి సాధించగా, శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.