breaking news
gurralagondi village
-
అక్కడ దహన సంస్కారాలు ఉచితం
సాక్షి, సిద్దిపేట: పేదలు చనిపోతే చందాలు వసూలు చేసి దహన సంస్కారాలకు నిర్వహించిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.. అటువంటి పరిస్థితి తమ గ్రామంలో ఎవరికీ రాకూడదు.. అంటూ సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొంది సర్పంచ్ ఆంజనేయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీలో మూల నిధి ఏర్పాటు చేసి గ్రామంలో చనిపోయిన వారికి ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఆలోచనకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మద్దతు తెలపడం. తన వంతు కూడా సాయం అందచేస్తానని ముందుకు రావడంతో ఆ కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో మూల నిధి.. ఉచిత దహన సంస్కారాలు నిర్వహించడానికి మూల నిధినిఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే వడ్డీతో ఈ ఖర్చులు నిర్వహించేందుకు సర్పంచ్ సిద్ధమయ్యారు. గత ఏడాది ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహకం నుంచి రూ. 5లక్షలు, సర్పంచ్ రూ. 50వేలు, ఎంపీటీసీ రూ.30వేలు, జెడ్పీటీసీ రూ.25వేలు, గ్రామాన్ని దత్తత తీసుకున్న పారిశ్రామిక వేత్త రవీందర్రావు రూ.50వేలు, మాజీ సర్పంచ్ రూ.25వేలు, అదేవిధంగా ఇతర దాతలు కలిపి మొత్తం రూ.8,35,000 జమచేశారు. వీటికి తోడు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రూ.1లక్ష అభివృద్ధి నిధుల నుంచి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం నుంచి ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా పంచాయతీ సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేసేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం అంతా అమలు ఉచిత అంతిమ సంస్కారాల క్రమానికి మూలనిధిని అందచేసే కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అంజనేయులును అభినందించారు. గుర్రాల గొంది గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొవాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉచిత దహన సంస్కారాల కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచ్‌లు నిధుల సేకరణ పనిలో ఉన్నారన్నారు. ఇందుకోసం గ్రామస్తులు, పారిశ్రామిక వేత్తలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. -
వ్యవసాయ బావిలో పడ్డ డీసీఎం వ్యాన్ : క్లీనర్ మృతి
మెదక్ జిల్లా చినకోడూరు మండలం గుర్రాలగొండి గ్రామ శివారులో డీసీఎం వ్యాన్ అదుపు తప్పి గత అర్థరాత్రి వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను వ్యవసాయ బావి నుంచి బయటకు తీసి హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఏకంగా వ్యానే బోరు బావిలో పడిపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్ అలాగే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని క్లీనర్ మృతదేహన్ని స్థానికుల సాయంతో వెలుపలకు తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.