10వేల మీటర్ల రేసులో గుల్వీర్ చరిత్ర.. పోల్‌వాల్ట్‌లో తొలి పతకం
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ రజత పతకం సాధించాడు.శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును గుల్వీర్ 28:29.38 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత హాంగ్జౌ (2022) ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్, ఈసారి తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని వెండిని కొల్లగొట్టాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బలేవ్ (28:27.51 నిమిషాలు) బంగారు పతకాన్ని గెలుచుకోగా.. బహ్రెయిన్‌కే చెందిన ఆల్బర్ట్ కిప్టో (28:34.18 నిమిషాలు) కాంస్యం సొంతం చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 5వేల మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో నాయబ్ సుబేదార్ అయిన గుల్వీర్ సింగ్ కొంతకాలంగా సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుల్వీర్ సింగ్ 5వేల మీటర్లతో పాటు 10వేల మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. 5వేల మీటర్ల రేసును 12:59.77 నిమిషాల్లో పూర్తి చేసిన గుల్వీర్ ఆసియా నుంచి 13 నిమిషాల బారియర్‌ను బ్రేక్ చేసిన మొదటి అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.పోల్‌వాల్ట్‌లో తొలిసారి పతకంఆసియా గేమ్స్‌కు పోల్‌వాల్ట్‌లో భారత్‌కు తొలిసారి పతకం లభించింది. భారత అథ్లెట్ బరానికా ఎలన్గోవన్ మహిళల పోల్‌వాల్ట్‌లో కాంస్య పతకం సాధించింది. తన ఐదో ప్రయత్నంలో పోల్వాల్ట్తో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరిన బరానికా తన బెస్ట్ ప్రదర్శనను నమోదు చేసి కాంస్యం ఒడిసిపట్టింది. తొలి ప్రయత్నంలో 3.45 మీటర్లు, రెండో ప్రయత్నంలో 3.65 మీటర్లు, మూడో ప్రయత్నంలో 3.85 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 4 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరింది.షాట్‌పుట్‌లో కాంస్యంమహిళల షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. ఆమె షాట్‌పుట్‌ను 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్యం ఒడిసిపట్టింది. చైనాకు చెందిన సోంగ్ జియాహున్ (19.40 మీటర్లు), జాంగ్ లిన్రు (18.14 మీటర్లు) స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 23వ పతకం కాగా, ఇందులో రెండు స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం