breaking news
guardianship Act
-
పురుషుల అనుమతి లేకుండానే..
రియాద్ : ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియా కీలక సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. మహిళలు ఇక భర్త, పురుష బంధువుల అనుమతి లేకుండానే సొంత వ్యాపారం చేపట్టవచ్చని సౌదీ సర్కార్ పేర్కొంది. దశాబ్ధాల తరబడి సౌదీలో రాజ్యమేలుతున్న సంరక్షక వ్యవస్థకు దూరంగా నూతన విధాన మార్పుగా ఈ చర్యను అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సౌదీ గార్డియన్షిప్ పద్ధతి ప్రకారం మహిళలు ఎలాంటి వ్యాపారం చేపట్టాలన్నా..విద్యాసంస్థల్లో ప్రవేశానికి, ప్రయాణాలకు పురుష సంరక్షకుని నుంచి అనుమతి పత్రం అవసరం ఉంది. తాజాగా ఇలాంటి అనుమతులు అవసరం లేదని వాణిజ్య, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో పొందుపరిచింది. ముడిచమురు ఉత్పాదన ద్వారా ఇబ్బడిముబ్బడిగా రాబడులు ఆర్జించిన సౌదీ అరేబియా ప్రస్తుతం ఆ రాబడి గణనీయంగా తగ్గడంతో దేశంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, మహిళా ఉపాధిని విస్తరించడం వంటి చర్యల దిశగా కీలక సంస్కరణలకు మొగ్గుచూపుతోంది. మహిళలపై పలు ఆంక్షలున్న సంప్రదాయ ముస్లిం రాజ్యంలో మహిళా పరిశోధకులను నియమించనున్నట్టు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం ప్రకటించింది. -
చట్టాలున్నాయి... సమానత్వమే లేదు!
అసమానం గోవాలో హిందూ మతానికి వర్తించే ఒక చట్టం ఉంది. ముప్పై ఏళ్లు వచ్చాక కూడా తన భార్య మగ పిల్లవాడిని కనకపోతే ఆ భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చు! పురుషాధిక్య సమాజంలోని పక్షపాత చట్టాలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఐక్యరాజ్య సమితి ఇటీవలే ఇలాంటి చట్టాల జాబితాతో ఒక నివేదిక విడుదల చేసింది. ఇవన్నీ కూడా మహిళపై పురుషుని ఆధిక్యాన్ని, అధికారాన్ని సమర్థించేవిగా ఉండడం విశేషం. హిందూ వారసత్వ చట్టం: పెళ్లి, విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణకు సంబంధించి భారతదేశంలో ఒక్కో మతానికి ఒక్కోరకమైన చట్టం ఉంది. హిందువుల విషయానికి వస్తే, ఒక మహిళ కనుక వీలునామా రాయకుండా చనిపోతే... భర్తగానీ, పిల్లలు గానీ లేనప్పుడు ఆమె ఆస్తి ఆమె అత్తమామలకు సంక్రమిస్తుంది! పార్శీల వారసత్వ చట్టం: పార్శీ చట్టం ప్రకారం పార్శీలు ఇతర మతస్థులను వివాహం ఆడడం నిషిద్ధం. ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ పార్శీ మతస్థురాలు కాని భార్యకు, లేదా వితంతువుకు భర్త ఆస్తి సంక్రమించదు. అలాగే పార్శీ మహిళకు పార్శీ మతస్థుడు కాని భర్త వల్ల కలిగిన సంతానాన్ని పార్శీల వారసత్వ చట్టం పార్శీలుగా పరిగణించదు. బాల్య వివాహాల నిషేధ చట్టం: ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు నిషిద్ధమే కానీ, అలా జరిగిన పెళ్లి చట్ట విరుద్ధమా కాదా అన్నది చట్టంలో నిర్దిష్టంగా లేదు. బహుశా ఇందుకే ఈ దేశంలో నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని సమితి వ్యాఖ్యానించింది. సమ్మతి వయసు: బాల్య వివాహాలు చట్ట విరుద్ధం కాకపోవడంతో భర్త తన మైనరు భార్యతో కలవడం చట్ట సమ్మతమే అవుతోంది! పెపైచ్చు దాంపత్య అత్యాచారం మన దేశంలో నేరం కూడా కాదు. విడిపోయాక అత్యాచారం: విడిపోయిన భార్యపై అత్యాచారం చేస్తే పడే శిక్ష, మూమూలు అత్యాచారంలో పడే శిక్ష కన్నా తక్కువ! అంటే మొదటి కేసులో 2 నుంచి 7 ఏళ్ల వరకు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటే, రెండో కేసులో ఏడేళ్ల శిక్ష లేదా జీవితఖైదు పడొచ్చు. వివాహ వయఃపరిమితి: చట్ట ప్రకారం అబ్బాయి పెళ్లి వయసు 21 ఏళ్ళు, అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్ళు. భార్య ఎప్పుడూ భర్త కన్నా వయసులో చిన్నదిగానే ఉండాలన్న పురుషాధిక్య సమాజపు పోకడకు అద్దం పట్టే నిబంధన ఇది. హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ యాక్టు: ఈ చట్టం ప్రకారం భర్తకు సమానంగా భార్య.. పిల్లల సంరక్షకురాలు కాదు! ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లి సంరక్షకురాలే అయినప్పటికీ మొత్తంగా తండ్రిని మాత్రమే పిల్లల సహజ సిద్ధమైన సంరక్షకుడిగా చట్టం గుర్తిస్తోంది. సమాజంలో స్త్రీ ద్వితీయశ్రేణి పౌరురాలిగానే మిగిలిపోయిందనీ, చట్ట పరంగా అమెకు మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని చెప్పడానికి ఇవి కొన్ని అంశాలు మాత్రమే. దేశంలోని పౌరులందరికీ మతాతీతంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బి.జె.పి చాలాకాలంగా అంటోంది. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వివాహిత హక్కులకు భరోసా ఉంటుంది.