పాపం.. తాతామనవళ్లను పొట్టనపెట్టుకున్నాడు
ముంబై: అన్నీ సవ్యంగా సాగినట్టయితే ఆ బాలుడు మరో రెండు వారాల్లో ఆరో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సివుంది. మద్యంతాగిన కారు డ్రైవర్ రూపంలో మృత్యువు ఊహించని విధంగా వచ్చింది. పాపం ఆ చిన్నారితో పాటు అతని తాతను పొట్టనపెట్టుకుంది. ముంబై శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సార్తక్, తాత భికు కొలెకర్ (65) మరణించారు. మద్యంమత్తులో కారు నడిపిన వ్యక్తి దర్శకుడు, నిర్మాత.
సార్తక్ కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఒషివరాలోని ఆనంద్ నగర్లో సార్తక్, తల్లి శిల్ప, అవ్వతాతలు ఇందు (58), భికుకొలెకర్ రోడ్డు దాటుతుండగా.. స్పీడ్‌గా వచ్చిన వోక్స్ వ్యాగన్ కారు వారిని ఢీకొట్టింది. సార్తక్ గాల్లో ఎగిరి కారు బ్యానెట్‌పై పడి దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డాడు. తాతా భికు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. శిల్ప భుజాలకు స్వల్ప గాయాలయ్యాయి. సార్తక్ను, తల్లి శిల్పను సమీపంలోని రూబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, సార్తక్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సార్తక్ తాతను కూపర్ హాస్పిటల్‌కు తరలించగా, ఆయన కూడా మరణించినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఈ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సార్తక్ తండ్రి సందీప్ ఈ పార్టీకి వెళ్లలేదు. కారు డ్రైవర్ మద్యంమత్తులో తన కొడుకు, తండ్రిని బలితీసుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యాడు.
మద్యంమత్తులో ఈ కుటుంబాన్ని ఢీకొట్టిన కారు డ్రైవర్ ఇంద్రజిత్ నట్టోజి (45) వాహానాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు బైకులపై వెళ్లి అతన్ని పట్టుకుని బందించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యంతాగి వాహనాన్ని నడిపినట్టు పోలీసులు చెప్పారు.