breaking news
Government of Singapore
-
అంతా కుతంత్రం!
► రాజధాని నుంచి స్వరాజ్యమైదానం వరకు సర్కారు ‘మంత్రాం’గం ► రాజధాని నిర్మాణం జపాన్ చేతికి ► విజయవాడ స్క్వేర్ పేరుతో డ్రాగన్ పాగా ► చివరకు పుష్కర ఘాట్లు కూడా చైనా కంపెనీకే ► విస్తుపోతున్న రాజధాని ప్రాంత వాసులు వ్యాపారం కోసం వచ్చి మన సంపదను కొల్లగొట్టుకుపోయి.. మనల్ని బానిసలుగా చేసి చిత్రహింసలకు గురిచేసిన తెల్లదొరలను పడమర దారి పట్టించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుత పాలకుల తీరుతో మరోమారు వ్యాపారం కోసం పలు దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కన్నేశాయి. ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధిలోనూ వారు పెట్టుబడుల రూపంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజధానితో మొదలైన విదేశీ మంత్రం చివరకు స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించిన స్వరాజ్యమైదానాన్ని పరాయివారికి కట్టబెట్టే వరకు వెళ్లింది. సాక్షి, విజయవాడ బ్యూరో : చంద్రబాబు గత పాలనలో అంతా హైటెక్ నామస్మరణం చేస్తే ఇప్పుడు విదేశీ తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ నుంచి రాష్ట్రంలో ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా అంతా విదేశీ కార్పొరేట్ శక్తు విదేశీ పెత్తనం పెరిగిపోవడంతో పాటు వాటిలో సేవలు పొందాలంటే మనం నేరుగా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఇలాగే వదిలేస్తే క్రమంగా విదేశీ కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అగత్యం వచ్చినా ఆశ్ఛర్యం లేదు. సింగపూర్ అన్నారు.. జపాన్‌కు కట్టబెడుతున్నారు.. అమరావతి రాజధానిని సింగపూర్ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించనుందని చంద్రబాబు సర్కారు ఏడాది పాటు ఊదరగొట్టింది. గ్రాఫిక్స్‌తో రూపొందించిన చిత్రాలను విడుదల చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింగపూర్‌తో ‘డీల్’ కుదరలేదేమో.. చివరకు నిర్మాణ బాధ్యతలు జపాన్‌కు అప్పగించే ప్రయత్నాలకు తెరలేచింది. సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్‌ప్లాన్ ఉచితంగా ఇస్తున్నట్టు తొలుత ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అటు తరువాత అందుకు కోట్లాది రూపాయలు పారితోషికంగా చెల్లించింది. అమరావతి రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వం చేపడుతుందని ఒకసారి, అటు తరువాత సింగపూర్‌లోని సంస్థ అని మరోసారి ప్రకటనలు చేసిన ప్రభుత్వం వారు పెట్టిన షరతులతో చేతులెత్తేసి జపాన్ వైపు దృష్టిపెట్టింది. ఇటీవల జపాన్‌కు చెందిన మాకీ సంస్థ అమరావతి భవనాల డిజైన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జపాన్‌కు చెందిన మాకీ సంస్థ టోక్యో నగరం మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో జపాన్ వాణిజ్య మంత్రి టాకాగి నాయకత్వంలోని 80 మందితో కూడిన ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. భవిష్యత్‌లో టోక్యో నుంచి నేరుగా అమరావతికి వచ్చేలా విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని, ఇది వారికి రెండో రాజధానిగా భావించాలని ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం. స్వరాజ్య మైదాన్ అప్పగింతపై సర్వత్రా నిరసనలు... స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించిన స్వరాజ్యమైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్)ను డ్రాగన్ (చైనా)కు అప్పగించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో చారిత్రాత్మకమైన విశాల స్థలాన్ని విదేశీ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో విజయవాడ స్క్వేర్ నమూనాలను చైనాకు చెందిన జీఐఐసీ సంస్థ రూపొందించిన నమూనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రూ.135 కోట్ల ఖర్చుతో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్, ఎగ్జిబిషన్లు, భవనాలు, పార్కింగ్ ఏరియా నిర్మాణాలను చైనా సంస్థకే కట్టబెట్టే ప్రయత్నాల వెనుక ఏం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. స్క్వేర్ నిర్మాణంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడబోదని అధికారులు ప్రకటించడం వెనుక అసలు ఆంతర్యం ఇదే. అంటే చైనా సంస్థకు అప్పనంగా భూమి ఇచ్చి పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టి దానిపై ఆదాయం ఆ సంస్థ వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఇదో విహార కేంద్రంగా తీర్చిదిద్దినప్పటికీ పర్యాటకులపై ట్యాక్స్ రూపంలో బాదుడు తప్పదు. అధికారులు చెబుతున్న మాటలు ఇప్పుడు జనాన్ని మభ్యపెట్టడానికే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్కర ఘాట్లకూ చైనా నిపుణులే.. ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్నట్టు ఉంది ప్రభుత్వ యంత్రాంగం తీరు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి సరిపడే డిజైన్లు ఇచ్చే సామర్థ్యం ఉన్న ఇంజనీర్లు, నిపుణులు రాష్ట్రంలో లేరని తేల్చేసిన సర్కారు కనీసం పుష్కర ఘాట్లను నిర్మించే నైపుణ్యం కూడా మనకు లేదని చెప్పకనే చెప్పింది. కృష్ణా పుష్కరాల్లో అద్భుతమైన ఘాట్లు, నిర్మాణాలు చేపట్టే పేరుతో పలు పనులను చైనాకు చెందిన జీఐఐసీ సంస్థకు అప్పగించడం గమనార్హం. 10 మీటర్ల వెడల్పు, నాలుగు అడుగుల లోతుతో స్నానఘాట్ల నిర్మాణం, ఇతర కట్టడాలకు చైనా సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే స్వదేశీ పరిజ్ఞానం, నైపుణ్యంపై పాలకులకు కనీస నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. -
రాజధాని ప్రణాళికలో మార్పులు
-
రాజధాని ప్రణాళికలో మార్పులు
సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు ఆదేశం * రాజధాని రీజియన్‌లో 8 జోన్లు * కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు సాక్షి, విజయవాడ బ్యూరో: అర్బన్ ప్లానింగ్ నిపుణుల సూచనల మేరకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో రాజధాని వ్యవహారాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. మార్పుల తర్వాత రెండు నెలల్లో రాజధాని తుది ముసాయిదా ప్రణాళిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. రాజధాని రీజియన్‌లో 8 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో దాన్ని ఒక్కోరకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. శాటిలైట్ మ్యాప్‌ల ఆధారంగా మాస్టర్‌ప్లాన్ 7,420 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని, దీన్ని సర్వే నెంబర్లతో సరిపోల్చితే 7,317.15 చదరపు కిలోమీటర్లు వచ్చిందని తెలిపారు. రాజధాని రీజియన్‌లో 55.05 లక్షల జనాభా ఉన్నారని రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగనున్న దృష్ట్యా వసతులు మెరుగుపరచాలని సూచించారు. కొత్తగా ఉభయగోదావరి జిల్లాలను కలిపి గోదావరి, కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకరించారు. మూడు మొబైల్ కంపెనీలతో ఎంఓయూ చిత్తూరు జిల్లా రేణిగుంటలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సెల్కాన్, కార్బన్, మైక్రోమ్యాక్స్ కంపెనీలతో మం గళవారం ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుం ది. ప్రభుత్వం తరఫున సీఎం సమక్షంలో పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ఆయా కంపెనీలతో ఒప్పం దాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ మూడు కంపెనీల వల్ల ఏడువేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రేణిగుంటలోని ఈ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ల క్లస్టర్ విమానాశ్రయానికి ఎదురుగానే ఉంటుందని దీనివల్ల చాలా ఉపయోగాలుంటాయన్నారు. త్వరలో ఏపీ హార్డ్‌వేర్ హబ్‌గా మారుతుందన్నారు. హార్డ్‌వేర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఎటువంటి వాతావరణం ఉండాలనే దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఇంజనీర్లు సృజనాత్మకంగా ఆలోచించాలి ‘ఇంజనీర్లు సృజనాత్మకంగా ఆలోచించాలి. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. జల వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలో మంగళవారం ఇంజినీర్ల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన ఇంజనీర్లనుద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఏడాది కృష్ణానదికి 100 నుంచి 120 టీఎంసీల గోదావరి నీటిని తీసుకురానున్నామని సీఎం చెప్పారు. బుధవారం పట్టిసీమ మొదటి పంపును ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణాలో కలిపే పవిత్ర సంగమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై మిగతా రాష్ట్రాల్లో చర్చ మొదలైందనీ, కేవలం 5 నెలల 15 రోజుల్లో రెండు నదుల అనుసంధానం జరగడం విశేషమన్నారు. పొగాకు కొనుగోళ్లకు చర్యలు: సీఎం పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 18న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం పొగాకు రైతులు సీఎంను కలిశారు. కేంద్రం ఒక పక్క పొగాకు ద్వారా క్యాన్సర్ వస్తుందని భయపెడుతూ మరోవైపు టొబాకో బోర్డు ద్వారా పంట సాగును ప్రోత్సహిస్తున్నామంటోందని రైతులు సీఎం దృష్టికి తెచ్చారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఈ విషయమై చర్చిద్దామని చెప్పారు.