breaking news
government hospital Guntur
-
నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి
ఆ బాలిక పేరు మానస. నిండా 13 ఏళ్లు కూడా లేవు. ఆమెకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ.. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. నిద్ర మత్తు ఆవహించే మందుల్ని కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో చెబితే.. తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి న్యూరాలజీ విభాగంలో చూపించగా.. అక్కడి స్లీప్ ల్యాబ్‌లో రాత్రంతా ఉంచి పరీక్షలు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే బాలిక నిద్రపోవటం లేదనే విషయాన్ని వైద్యులు నిర్థారించి.. కంటి నిద్ర రావటానికి వీలుగా తగిన సూచనలిచ్చారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. గుంటూరు (మెడికల్) సాధారణంగా వయసు మీరిన వారికి నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ.. చిన్న పిల్లలూ, యువకులు సైతం నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, స్మార్ట్ ఫోన్స్ యుగంలో ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తుండటం వల్ల పాఠశాల విద్యార్థి మొదలుకుని పెద్దవారి వరకు అనేక మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేనిపక్షంలో అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్). తొలి ఆస్పత్రిగా రికార్డు ‘మీకు నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి’ అని ఆహ్వానిస్తున్నారు అక్కడి వైద్యులు. నిద్ర పట్టకపోవటానికి గల కారణాలను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని హాయిగా నిద్రపోయేందుకు అవసరమైన వైద్యాన్ని జీజీహెచ్ డాక్టర్లు అందిస్తున్నారు. ఇక్కడి న్యూరాలజీ వైద్య విభాగంలో నిద్ర ప్రయోగ శాల (స్లీప్ ల్యాబ్)ను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ ల్యాబ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి రికార్డు సృష్టించింది. నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ నన్నపనేని వెంకయ్యచౌదరి ఇక్కడి ల్యాబ్‌కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు. నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చు తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని, నిద్రలో నడవడం, నిద్రలోనే సైకిల్ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్ రావడం వల్ల నిద్రపోవటానికి భయపడతారని వైద్యులు వివరిస్తున్నారు. రుగ్మతల నిర్ధారణకు స్లీప్‌ల్యాబ్ ఈ రుగ్మతలు రావడానికి గల కారణాలు నిర్ధారించేందుకు స్లీప్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. కొంతమంది రాత్రివేళలో నిద్రపోకుండా, పగటి పూట నిద్రిస్తుంటారు. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేకం ఉంటాయి. ఎలాంటి సమయాల్లో నిద్రపోవాలి, నిద్ర పోకపోతే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయనే విషయాలను స్లీప్ డిజార్డర్‌తో బాధపడేవారికి స్లీప్ ల్యాబ్‌లో వైద్య పరీక్షలు చేసి వివరిస్తున్నారు. నిద్రపట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను త్వరితగతిన సులభంగా నయం చేయవచ్చని, అందుకోసం స్లీప్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి తెలిపారు. పరీక్షల విధానం ఇలా.. ఒక్కో వ్యక్తికి వైద్య పరీక్ష చేసేందుకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది. ► సుమారు 30 నుంచి 40 వరకు వైర్లను శరీరంలోని వివిధ భాగాలకు అతికిస్తారు. ► రాత్రి వేళల్లో సహజ సిద్ధంగా నిద్రించే సమయంలో ఈ పరీక్ష నిర్వహించటం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ► ఇక్కడి ల్యాబ్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరీక్షలు చేస్తారు. – ఆస్పత్రి ఓపీ విభాగంలో మంగళ, గురు, శనివారం న్యూరాలజీ విభాగానికి వచ్చిన వారికి నిద్ర సమస్యలు ఉంటే స్లీప్ల్యాబ్లో పరీక్ష చేసి చికిత్స అందిస్తారు. ► వైద్య పరీక్షలు చేసే సమయంలో ప్రత్యేక శిక్షణ పొందిన న్యూరో టెక్నీషియన్‌తో పాటు ఒక డాక్టర్, రోగి అటెండెంట్ ఉంటారు. ► నిద్ర సమస్యలపై పరిశోధన చేసేందుకు ఒక పీజీ డాక్టర్‌ను ప్రత్యేకంగా నియమించారు. రెండేళ్లుగా ఉచిత పరీక్షలు స్లీప్‌ల్యాబ్‌ను 2017 జూలైలో ప్రారంభిం చినా వైద్య పరీక్షలు మాత్రం 2018 జనవరి నుంచి చేస్తున్నాం. 2018లో 47 మందికి, 2019 లో 40 మందికి స్లీప్ ల్యాబ్‌లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించాం. నిద్ర సమస్యలతో వచ్చే వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారు. 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు వారు కూడా నిద్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే నిద్రలేమి సమస్యలను నిర్ధారించే పాలిసోనోగ్రఫీ (పీసీజీ) పరీక్ష చేస్తున్నాం. సుమారు రూ.25 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షను న్యూరాలజీ విభాగంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి, విభాగాధిపతి, న్యూరాలజీ వైద్యం -
తవ్వేకొద్దీ అవినీతి బహిర్గతం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : ఏరియా వైద్యశాలలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతుంది. విజయవాడ ఫైనాన్స్ ఆఫీసర్ మాధవిలత, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె.లతారాణి, అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ రాజేష్‌కన్నా గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో మరోసారి ఆడిట్ నిర్వహించారు. ఏరియా వైద్యశాలలో 2017 నుంచి 2018 సంవత్సరంలోపే ఔట్సోర్సింగ్ సిబ్బంది స్వామి, చిరంజీవిలను అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి ఏరియా వైద్యశాల యంత్రాంగం చక్రం తిప్పారు. ఈ ఆరోపణలతో జిల్లా ఏరియా వైద్యశాల కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి నెలరోజుల కిందట తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు విచారణకు గత నెల 24వ తేదిన ప్రత్యేక అధికారులను పంపించారు. నాలుగురోజులు పాటు అకౌంట్స్ పుస్తకాలు, రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. రూ.80 లక్షలకుపైగానే అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. శాఖపరమైన విచారణ పూర్తి... రాష్ట్ర ఆడిట్ విభాగం చేపట్టిన విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య విధాన పరిషత్ జిల్లా అకౌంటింగ్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ అడిట్ అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 1వతే దీన మళ్లీ ఆడిట్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన అడిట్ అధికారులు అవినీతి జరిగిన మాట వాస్తవమేని తేల్చారు. కానీ ఏ మేరకు జరిగిందో చెప్పటంలేదు. కొనసాగుతున్న ఆడిట్ గత నెల 24వతేదీన ఆడిట్ చేసిన బృందం మళ్లీ గురువారం వచ్చారు. గతంలో సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, సిబ్బందిని విచారణ చేశారు. తాజాగా ఏరియావైద్యశాలకు అభివృద్ధి కమిటీ పాలకవర్గాన్ని కూడా విచారణ చేపట్టారు. బిల్లులపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నివ్వెరపోతున్న ఆడిట్ బృందం.. ఏరియావైద్యశాల సూపరిండెంట్, ఆర్ఎంఓ, అభివృద్ధి కమిటీ చైర్మన్ సంతకాలు లేకుండా రూపాయలు కూడా బయటకు తీసేందుకు అవకాశం లేకపోవటంతో ఎంచక్కా తీర్మానాలు రూపొందించి మరీ అవినీతికి పాల్పడినట్లు ఆడిట్ అధికారులు ప్రాథమిక విచారణలో పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఏరియా వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి ఫండ్ నిధులు, స్పెషల్ గదుల అద్దెలు, జననీ సురక్షిత పథకం నిధులు, ఉద్యోగుల పీఎఫ్, ఈపీఎఫ్, ప్రత్యేక నిధులు సైతం హాస్పిటల్ కమిటీ నిధులు నుంచి కొత్త అకౌంట్లులోకి బదిలీ చేసి మరీ అవినీతికి పాల్పడారు. వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు సైతం రూ.50 వేలు ఉంచి రూ.90 వేలు కూడా వేసి డ్రా చేసిన రికార్డులలో ఉండటం కొసమెరుపు. వీటితో పాటు బాపట్ల ఏరియా వైద్యశాలలో ఉన్న పాత ఇనుము మూడు టన్నులకుపైగా ఉండగా వాటిని విక్రయించిన యంత్రాంగం ఆ లెక్కలను ఖాతాలో కూడా చూపించలేదనే విషయంపై విచారణ చేపట్టారు. హాస్పిటల్లో కూడా కొన్ని పరికరాలు లేకపోవటంపై కూడా దృష్టి సారించారు. ఏదిఏమైనప్పటికి ఈ విచారణలో ఏరియా వైద్యశాలలో పలువురిపై వేటుపడటంతోపాటు జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని బాపట్లలో తీవ్రచర్చానీయాంశమైంది. -
డాక్టర్ గోఖలేకు సీఎం సన్మానం
విజయవాడ : గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో ఒకరికి గుండె మార్పిడి చేసి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా జరిపిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాల యంలో శనివారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఎంసెట్ ఫలి తాలను ప్రకటించడంలో, నీట్ ఆర్డినెన్స్ జారీచేయడంలో కృషిచేసిన సీఎం చంద్రబాబునాయుడును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఎంసెట్ మెడికల్ ఫలితాల విడుదల కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సరైన విధంగా చర్యలు తీసుకున్నారని కామినేని సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని , ప్రత్తిపాటి పాల్గొన్నారు. సందర్శకులకు సీఎం చేయూత సమస్యలతో వచ్చిన పలువురు సందర్శకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేశారు. విజయవాడకు చెందిన చందన సీఎంను కలిసి తన భర్తకు హెచ్ఐవీ ఉందని, కుమారుడు మానసిక వికలాంగుడని, కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాని వివరించగా, సీఎం స్పందించి ఇల్లు మంజూరు చేసి, రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని అదికారులను ఆదేశించారు. మచిలీపట్నానికి చెందిన భారత్ గ్యాస్ డీలర్ బడే వెంకటేశ్వరరావు తాను భాగస్వామి చేతిలో మోసపోయానని, న్యాయం చేయాలని కోరగా ఆ మేరకు సీఎం హామీ ఇచ్చారు.