breaking news
government decided
-
నివాసాలుగా ఉప్పు భూములు
సాక్షి, ముంబై: నగర శివారు ప్రాంతాల్లో వృథాగా ఉన్న ఉప్పు భూముల్లో నివాస గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ బృహత్ నిర్ణయం వల్ల శివారు ప్రాంతాల్లో వృథాగా ఉన్న సుమారు మూడు వేల ఎకరాల స్థలాలు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించేందుకు మార్గం సుగమమైందన్నారు. నగరంలో సొంత గూడు లేక అద్దె ఇంట్లో ఉంటున్న వేలాది పేదలకు గిట్టుబాటయ్యే ధరలకు ఈ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుకానుంది. ముంబై చుట్టూ ఉన్న సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న స్థలాల్లో రైతులు ఉప్పు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడ ఉప్పు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి కొన్ని ఎకరాల స్థలాలు వృథాగా ఉన్నాయి. ఈ స్థలాల్లో గృహ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇందుకోసం మూడు వేల ఎకరాల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పేరుపై బదిలీ చేయడానికి ఆమోదం లభించింది. అయితే శివారు ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల స్థలాలపై గత కొంత కాలంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. అందులో మూడు వేల ఎకరాల స్థలాలపై నివాస సముదాయాలు నిర్మించేందుకు మార్గం సుగమమైంది. నగరానికి ఆనుకుని ఉన్న 10 శివారు ప్రాంతాల్లో 59 చోట్ల స్థలాలున్నాయి. వీటిని అభివృద్ధి పనుల కోసం ఖాళీ చేస్తే అనేక ఎకరాల స్థలాలు అందుబాటులోకి వస్తాయి. ఇదే తరహాలో మూతపడిన మిల్లు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని మాడా ద్వారా ట్రాన్సిట్ క్యాంపులు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మూడు వేల ఎకరాల స్థలాల్లో 1,672 ఎకరాల స్థలం మాత్రమే ఇళ్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉందనే విషయం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. మిగతా భూములు నివాసాలకు పనికిరావని తేలింది. అయితే ఆ స్థలాలను రాళ్లు, మట్టితో నింపితే కొంత ఉపయోగపడవచ్చని స్పష్టం చేసింది. మొత్తం స్థలాల్లో 31 శాతం నివాసాలకు, మిగతా వాణిజ్య, పరిశ్రమలు, ఇతర సంస్థలకు వినియోగించుకోవచ్చని తెలిపింది. -
రిజిస్ట్రేషన్లకు బ్రేక్..!
సాక్షి, గుంటూరు: రిజిస్ట్రేషన్ శాఖ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పలు సేవలను ‘మీ-సేవ’ కేంద్రాల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దస్తావేజు నకలు (సీసీ), ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ)లను చలానా చెల్లించి ‘మీ-సేవా’ కేంద్రాల్లో దరఖాస్తు చేయడం, అక్కడే స్వీకరించే విధంగా సేవలను అందు బాటులోకి తెచ్చింది. అయితే, ప్రభుత్వ ప్రకటనతో దస్తావేజు లేఖరులు, స్టాంప్‌వెండర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉపాధికి గండికొట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తక్షణమే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కిందటి నెల 26వ తేదీ నుంచి నెలాఖరు వరకు సమ్మె చేపట్టిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్‌ల శాఖ మంత్రి తోట నరసింహం స్పందించారు. మీ-సేవా కేంద్రంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో దస్తావేజు లేఖరులు ద్వారా సీసీ, ఈసీలు తీసుకోవచ్చని ఈనెల 6వ తేదీన ఉత్తర్వులిచ్చారు. అప్పట్లో ఆందోళన సద్దుమణిగినప్పటికీ, తాజాగా 16వ తేదీన ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. కచ్చితంగా మీ-సేవా కేంద్రాల ద్వారానే సదరు సేవలు పొందాలని ఆ జీవో సారాంశం. దీంతో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు సమ్మె చేపట్టి కొనసాగిస్తున్నారు. ఈనెల 23 వరకు తమ సమ్మె కొనసాగిస్తామని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. అధికార యంత్రాంగం కూడా తమ సమ్మెకు సహకరించాలని కోరు తూ కార్యాలయాలకు తాళాలు వేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. భూముల మార్కెట్ విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానా రోజూ భారీగా నిండుతోంది. మార్చి నెల తర్వాత మరోమారు భూముల ధరల పెరుగుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం వుందనే సమాచారం మేరకు అగ్రిమెంట్ల వద్ద ఆగిన తంతును హడావుడిగా అధికారికం చేసుకునేందుకు కొనుగోలుదారులు హడావుడి పడుతున్నారు. అయితే, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాల యాలు మూతపడటంతో ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, తెనాలిలలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఏడాదికి సుమారు రూ.260 కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. నరసరావుపేట, గుంటూరు నుంచి పన్నుల రూపేణా అధిక ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం కార్యాలయాలు మూతపడటంతో రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు భూ లావాదేవీలు నిలిచిపోయాయి. అదేవిధంగా రోజుకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పన్ను రూపేణా ప్రభుత్వానికి సమకూరే ఆదాయానికి గండి పడింది. సమ్మె నేపథ్యంలో అటు కొనుగోలుదారులు,ఇటు విక్రయదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.