breaking news
Government assistance
-
బిందు సేద్యం.. సర్కారు సాయం
సాక్షి రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటూ వస్తోంది. ఒకవైపు రైతు భరోసా, మరోవైపువైఎస్సార్ పంటల బీమా, ఇంకోవైపు సున్నావడ్డీ ఇలా చెబుతూ పోతే రైతు భరోసా కేంద్రాల వరకు అన్నదాతలకు సర్కార్ అండగా ఉంటూ వస్తోంది. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లతోపాటు యంత్రపరికరాలను ఇటీవల ప్రభుత్వం అందించింది. పంట పొలాల్లో ప్రతి నీటి చుక్క వృథా చేయకుండా సద్వినియోగం చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి విపత్తు తలెత్తకుండా ఉండేందుకు రైతులకు మైక్రో ఇరిగేషన్ ద్వారా బిందు, తుంపర పరికరాలను అందిస్తోంది. ప్రతి నీటి బిందువును పొదుపుగా వాడుకోవడం మొక్కలతోపాటు ప్రకృతికి మంచిదే. ఈ నేపధ్యంలోనే కాలువలు, బోర్ల ద్వారా పారగట్టే పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతూ ఇటీవలి కాలంలో ఎక్కువగా బిందు, తుంపర సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తూ వస్తోంది. స్పింక్లర్లు, డ్రిప్‌లను వినియోగించుకునే రైతులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను అందించి ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23కి సంబంధించి అన్నమయ్య జిల్లాలో 14 వేల హెక్టార్లకు పరికరాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుని మైక్రో ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. డ్రిప్, స్ప్రింకర్లకు భారీ ఎత్తన సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 16,920 మంది రైతుల నమోదు అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు సుమారు 16,920 మంది రైతులు పరికరాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల్లో 16,920 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారికి సంబంధించి 19046 హెక్టార్ల భూమి అవసరమని దరఖాస్తుల్లో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి డ్రిప్‌లకు 12 వేల హెక్టార్లు, స్ప్రింకర్లకు 2 వేల హెక్టార్లకు పరికరాలు అందించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు 2,893 మంది రైతులకు 3145 హెక్టార్లకుగాను బిందు, తుంపెర సేద్యం పరికరాలను అందించారు. రైతులందరూ జిల్లాలోని ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు రైతు వాటాకు సంబంధించిన మొత్తాలను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా అధికారులకు పంపుతున్నారు. అయితే 14 వేల హెక్టార్ల లక్ష్యం ఉన్న నేపథ్యంలో అవసరమైన ప్రతిరైతుకు అందించేలా మైక్రో ఇరిగేషన్ అధికారులు ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో రెండోస్థానం అన్నమయ్య జిల్లాలో సూక్ష్మసేద్య పరికరాలకు సంబంధించి ప్రభుత్వం రాయితీతో అందిస్తోంది. వాటికి సంబంధించి వేగంగా రైతులకు అందించడంలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో అనంతపురం, రెండోస్థానంలో అన్నమయ్య, మూడవ స్థానంలో వైఎస్సార్ ఉన్నాయి. కంపెనీల ద్వారా పరికరాలు వేగవంతంగా అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. బోరు వద్ద డ్రిప్‌పైపు వద్ద ఈ మహిళ పేరు గుణసుందరి. ఈమెది ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం గ్రామం. ఈమెకు 0.69 హెక్టార్ల భూమి ఉంది. అందులో పసుపు పంట సాగు చేశారు. అయితే డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే అందించారు. 90,103 రూపాయలు అంచనా కాగా, రైతు వాటా పోను రూ 81,032 విలువైన డ్రిప్ పరికరాలు అందజేయడంతోపాటు పొలంలో బిగించారు. దీంతో ఆమె ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 8రైతులకు భారీ రాయితీ అన్నమయ్య జిల్లాలో ఉద్యాన పంటలు, ఇతర సాధారణ పంటలు సాగు చేసే రైతులకు బిందు, తుంపర పరికరాలను మైక్రో ఇరిగేషన్ శాఖ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం భారీ రాయితీలను కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందించేలా ప్రణాళికలు రూపొందించి అందజేస్తోంది. డ్రిప్‌కు సంబంధించి ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు 90 శాతం సబ్సిడీతో రూ. 2.18 లక్షల వరకు రాయితీ వర్తించనుంది. అలాగే 5–10 ఎకరాల పొలం ఉన్న రైతులకు 70 శాతం సబ్సిడీతో రూ. 3.46 లక్షల మేర రాయితీ అందించనున్నారు. స్ప్రింకర్లకు సంబంధించి ఐదు ఎకరాల్లోపు అయితే 55 శాతం రాయితీ, ఐదు ఎకరాలకు పైబడిన రైతులకు 45 శాతం రాయితీతో అందిస్తున్నారు. ఇప్పటివరకు నమోదు చేసుకున్న రైతులకు సంబంధించి వరుస క్రమంలో తుంపెర, బిందు సేద్యం పరికరాలను ఎంపిక చేసిన ఆయా కంపెనీల ద్వారా రైతన్నలకు అప్పజెబుతున్నారు. అర్హులందరికీ సబ్సిడీపై పరికరాలు అన్నమయ్య జిల్లాలో అర్హులైన రైతులందరికీ సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నాం. జిల్లాకు డ్రిప్‌నకు సంబంధించి 12 వేల హెక్టార్లు, స్ప్రింకర్లకు సంబంధించి 2 వేల హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం వారికి కంపెనీల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే 3145 హెక్టార్లకుగాను బిందు, తుంపెర సేద్యం పరికరాలను అందించాము. ప్రభుత్వం కూడా భారీ రాయితీతో పరికరాలను అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. – వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సూక్ష్మ నీటి సేద్య అ«ధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల సాయం
సాక్షి, చిత్తూరు (రేణిగుంట) : నివర్ తుపాన్ సమయంలో రాళ్లకాలువ వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి కుమ్మరిపల్లె దళితవాడకు చేరుకుని బాధిత కుటుంబానికి నగదు అందజేసి వారిని ఓదార్చారు. అలాగే ప్రభుత్వం తరపున మరో రూ.5లక్షల పరిహారాన్ని మృతుడి భార్య నాగభూషణకు అందించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మృతుడి పిల్లలు ధీరజ్, హమీష్‌లను తామే చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగభూషణకు ఫించను మంజూరు పత్రం అందించారు. గ్రామ వలంటీర్ ఉద్యోగాన్ని సైతం ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం అదే వాగులో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వెంకటేష్, లోకేష్‌లను కూడా పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, జువ్వల దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, మునిరెడ్డి, శేషారెడ్డి, బాబ్జీ, హరి పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) -
ప్రభుత్వ సహాయంతో స్వరాష్ట్రానికి...
కేన్సర్‌తో కువైట్‌లో బాధపడుతున్న మనోహర్ సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో కువైట్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసిని వెనక్కి రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమైంది. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం, నిమ్మపల్లికి చెందిన మనోహర్ కూలిపని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ అతను ఓ కేసులో నిందితుడయ్యాడు. అయితే, అతడికి కేన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కువైట్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కానీ, బాధితుడిని స్వరాష్ట్రానికి రప్పించాలని కుటుంబ సభ్యులు మంత్రి కె.తారకరామారావును కలిశారు. కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మనోహర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, కువైట్‌లో మనోహర్‌పై పెండింగ్‌లో ఉన్న ఓ కేసుకు సంబంధించి రూ.19 లక్షల జరిమానా చెల్లిస్తేనే స్వదేశానికి పంపిస్తామని కువైట్ ప్రభుత్వం తెలిపింది. దానికి, అక్కడి ఎన్జీవోలంతా కలసి జరిమానా చెల్లించి, మనోహర్‌కు ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాష్ట్ర అధికారులు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మనోహర్‌ను బుధవారం స్వదేశానికి తీసుకువస్తున్నారని మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బాధితుడికి చికిత్సకు నిమ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేయలాని మంత్రి కేటీఆర్ అదేశించారు. ప్రవాస భారతీయులు ఏ కష్టంలో ఉన్నా తెలంగాణ ఎన్నారై శాఖ 040–23220603 నంబరుకు ఫోన్ చేయాలని, లేదా so_nri@ telangana. gov. in కు మెయిల్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. -
నైపుణ్యమున్న కార్మికులను దుబాయ్‌కి పంపిస్తాం
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాదాపూర్:న్యాక్‌లో శిక్షణ పొందిన కార్మికులను ప్రభుత్వ సహాయంతో దుబాయ్‌కి పంపిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మాదాపూర్‌లోని న్యాక్‌లో గురువారం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్యమున్న కార్మికులను దుబాయ్‌కి పంపిస్తామని, ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కార్మికులు దుబాయ్‌లో ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగి పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. న్యాక్‌లో శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించిన యువకులు వాటిని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి ఏడాది కన్స్ట్రక్షన్ బోర్డు నుంచి న్యాక్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు వెల్లడించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సింగిల్‌విండో విధానం ద్వారా కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. భూటాన్ నుంచి వచ్చి వివిధ రంగాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, న్యాక్ డెరైక్టర్ భిక్షపతి, సిబ్బంది పాల్గొన్నారు.