breaking news
Gopal Shetty
-
రంగీలా నటి..అమాయకురాలు..!
ముంబై : బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్‌పై ముంబై నార్త్ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇక్కడ గోవిందా ఎంపీగా గెలిచినంత మాత్రాన మళ్లీ అలాగే జరుగుతుందని ఆమె భ్రమ పడ్డారని చురకలంటించారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని ఊర్మిళాను కాంగ్రెస్ పోటీకి దించిందని ఎద్దేవా చేశారు. ఊర్మిళా రాజకీయంగా ‘భోలీ భోలీ లడ్కీ’ (అమాయకురాలు) అని అభివర్ణించారు. ‘కేవలం ఊర్మిళ సినిమా తార కాబట్టే ఆమె ప్రచారంలో జనం కనిపిస్తున్నారు. కానీ, ఎవరికి ఓటు వేయాలో జనానికి తెలుసు’ అన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాని, ఈ సారి కూడా విజయం తనదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, 2009లో ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీచేసిన సంజయ్ నిరుపమ్ బీజేపీ అభ్యర్థి రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. అయితే, 2014 ఎన్నికల్లో బీజేపీ గోపాల్ శెట్టిని బరిలో నిలిపింది. ఆయన సంజయ్‌పై తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా సంజయ్‌కి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. కానీ, ఆయన అక్కడ నుంచి పోటీకి విముఖత చూపించారు. వాయువ్య ముంబై నుంచి బరిలోకి దిగుతున్నారు. 2004 ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ తరపున గోవిందా విజయం సాధించారు. -
తగ్గిస్తేనే వస్తా!
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రా నిర్ణయించిన మెట్రో చార్జీలు ఆమోదయోగ్యంగా లేవని, నిర్హేతుకమైన చార్జీల పెంపుదల విషయంలో వెనక్కు తగ్గకపోతే ప్రారంభోత్సవానికి తాను వచ్చేదిలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంకేతాలిచ్చారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని పరుగు తీయడానికి సిద్ధమైన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చవాన్ ఇచ్చిన ఈ సంకేతాలు ఇప్పుడు నగరంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. 11.40 కిలోమీటర్ల మేర రూ. 3,400 కోట్లతో నిర్మించిన ఈ మార్గంలో కనీస చార్జీ రూ. 9 గరిష్ట చార్జీ రూ. 13గా వసూలు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కనీస చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ. 40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్జీల పెంపుదల నిర్హేతుకమైనదని, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్ ఇన్ఫ్రా కట్టుబడి ఉండాలని, లేదంటే తాను ప్రారంభోత్సవానికి రాననే సంకేతాలనిచ్చారు. బీజేపీ ఎంపీలు కిరీట్ సోమయ్య, గోపాల్‌శెట్టి అండదండలు, ప్రోత్సాహంతోనే రిలయన్స్ ఇన్ఫ్రా చార్జీలను పెంచే సాహసం చేస్తోందని చవాన్ ఆరోపించారు. చార్జీల పెంపుదలపై బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చవాన్ డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకున్న తర్వాతే పెంపుదల విషయమై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలన్నారు. ఇదిలాఉండగా ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి అభయ్ మిశ్రా మాట్లాడుతూ.... ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై నగరంలో మెట్రో సేవలను జూన్ 8, మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలను లక్షలాదిమంది నగరవాసులకు అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. మెట్రో ప్రయాణంపై చేసే ప్రచారంలో భాగంగా మొదటి నెల రోజులు కేవలం రూ. 10 మాత్రమే చార్జీగా వసూలు చేస్తాం. ఈ చార్జీతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీలోని ఏ స్టేషన్ వరకైనా ప్రయాణించవచ్చు. అయితే ఇది కేవలం ప్రచారం కోసం నిర్ణయించిన చార్జీ మాత్రమే. ఆ తర్వాత మెట్రో చార్జీలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తామ’న్నారు.