breaking news
Gold Mutual Funds
-
పెట్టుబడికీ ‘ఓకే బంగారం’!
బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే లోహం ఇది. ఆభరణాలు, పెట్టుబడుల సాధనంగా డిమాండ్ అధికం. ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇక డిజిటల్ బంగారం సాధనాల్లో పెట్టుబడులు వేరే. బంగారం విలువైన లోహమే అయినప్పటికీ ధరల పరంగా ఇందులో అస్థిరతలు కూడా చాలా ఎక్కువ. ఈక్విటీ మార్కెట్లు అంత కాకపోయినా, గోల్డ్‌లోనూ ఆటుపోట్లు అధికమే. ఇక్కడ కూడా ఇన్వెస్టర్ల సహనమే రాబడులకు గీటురాయి అవుతుంది. అసలు బంగారంలో పెట్టుబడి దండగ? అని కొందరు అంటుంటారు. పోర్ట్‌ఫోలియోలో కనీసం 5–10 శాతం అయినా బంగారానికి కేటాయించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈ భిన్నమైన అభిప్రాయాలు, సూచనలతో ఇన్వెస్టర్లకు అయోమయం ఏర్పడొచ్చు. నిజానికి బంగారంలో పెట్టుబడి వద్దు అని చెప్పడానికంటే.. ఇన్వెస్ట్ చేసుకోండని సూచించడానికే కారణాలు బోలెడు ఉన్నాయి. బంగారం ధరల తీరుతెన్నులు, దీర్ఘకాల చరిత్రను పరిశీలిస్తే ఇందులో పెట్టుబడి పెట్టే విషయమై ఎలా నడుచుకోవాలన్న అవగాహన ఏర్పడుతుంది. పెట్టుబడి సాధనంగా బంగారం ఎంపిక ముందు తెలుసుకోవాల్సిన అంశాలతో కూడిన కథనమే ఇది. రాబడులు 1978 నుంచి 1985 వరకు బంగారం ధర ర్యాలీ చేసింది. మళ్లీ 1988 నుంచి 1992 వరకు పెరగడాన్ని చూడొచ్చు. తిరిగి 2002–2012 మధ్య కూడా బంగారం భారీ ర్యాలీ చేసింది. కానీ, మిగిలిన కాలాల్లో అక్కడక్కడే చలించింది. మొత్తానికి దీర్ఘకాలంలో రాబడులు ఇచ్చినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. విడిగా చూస్తే బంగారం నికర నష్టాలను ఇచ్చిన సంవత్సరాలు కూడా కనిపిస్తాయి. టేబుల్‌ను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. బంగారం ధర పెరగడమే కానీ, తగ్గదు? అన్నది నిజం కాదు. 1967 నుంచి 1974 మధ్య బంగారం ధర ఐదు రెట్లు పెరిగింది. 2004–2012 మధ్య కూడా ఐదు రెట్లు పెరిగింది. కానీ, మిగిలిన సంవత్సరాల్లో పెద్దగా పెరుగుదల లేదు. కనుక దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినప్పుడే ఈ పెరుగుదల ప్రయోజనం ఇన్వెస్టర్‌కు లభిస్తుంది. బంగారం నిర్ణీత కాలం పాటు అలా స్థిరంగా కొనసాగుతూ.. కేవలం రెండు, ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో రెట్లు పెరుగుతుందని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థల పనితీరు, కరెన్సీ మారకం తదితర అంశాల ప్రభావం బంగారంపై ఉంటుంది. దీర్ఘకాలం పాటు, ఒక సైకిల్ నుంచి మరో సైకిల్ వరకు బంగారంలో పెట్టుబడిని కొనసాగించడం ద్వారా అస్థిరతల ప్రభావం లేని, చక్కని రాబడులు సొంతం చేసుకోవచ్చు. రాబడి తీరు ఇదీ... సంవత్సరం సగటు రాబడి (శాతంలో) ఏడాది 13.6 మూడేళ్లు 12.9 ఐదేళ్లు 12.4 పదేళ్లు 12.3 పెట్టుబడి మార్గాలు.. బంగారం ఆభరణాల రూపంలో కలిగి ఉండాలా? కాయిన్ల రూపంలోనా? లేక ఈటీఎఫ్లోనా? ఇలాంటి సందేహాలు రావచ్చు. సార్వభౌమ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు), గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఈ గోల్డ్, 24 క్యారట్ల కాయిన్లు, బార్లు, ఆభరణాలు ఇన్ని రూపాల్లో బంగారాన్ని కలిగి ఉండే వెసులుబాటు ఉంది. వీటన్నింటిలోకి మెరుగైన మార్గాలు ఏవి అంటే ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు అని చెప్పుకోవాల్సిందే. ఆభరణాల రూపంలో బంగారాన్ని కలిగి ఉండొచ్చు. కానీ, పెట్టుబడి మార్గంలో ఆభరణాలను కలిగి ఉండడం కంటే, డిజిటల్ రూపంలో నిర్వహించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా సార్వభౌమ బంగారం బాండ్లు అయితే ఎనిమిదేళ్ల కాలవ్యవధితో వస్తాయి. భౌతిక రూపంలోనే బంగారాన్ని కలిగి ఉండేట్టు అయితే.. ఆభరణాలుగా కాకుండా, బ్యాంకుల నుంచి 24 క్యారట్ల కాయిన్ల రూపంలో కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే బంగారం ఆభరణాలు అయితే, తయారీ చార్జీలు, తరుగు, వృథా పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. బంగారం కాయిన్లు సైతం రుణాలు పొందేందుకు సాయపడతాయి. ఇక ఆ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌లు అన్నవి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతుంటాయి. షేర్ల మాదిరే కొనుగోలు విక్రయాలు చేసుకోవచ్చు. దీనికి ట్రేడింగ్, కమ్ డీమ్యాట్ ఖాతా ఉండాలి. మార్కెట్ ధర ఆధారంగానే గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరల్లో మార్పు ఉంటుంది. ఇక పలు ఎన్బీఎఫ్సీలు, వ్యాలెట్లు ఆఫర్ చేసే ఈ–గోల్డ్ (ఎలక్ట్రానిక్ గోల్డ్) అన్నది ఎంత మాత్రం మెరుగైన సాధనం కాదు. ఇందులో తెలియని చార్జీల రూపంలో, సరైన ధరల్లేమి కారణంగా కొంత నష్టపోవాల్సి వస్తుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా అంతే. చార్జీల రూపంలో రాబడిలో కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. ఎస్‌జీబీల్లో ఏ చార్జీలు ఉండవు. పోర్ట్‌ఫోలియో వైవిధ్యం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట పెట్టొద్దన్నది ప్రాథమిక సూత్రం. ఈక్విటీలు, డెట్, బంగారం, ప్రాపర్టీ ఇలా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. ఒక్కో కాలంలో ఒక్కో సాధనం ప్రతికూలతలను చూస్తుంటుంది. ఈక్విటీలు నేలచూపులు చూస్తున్న సమయాల్లో బంగారం ర్యాలీ చేస్తుంటుంది. అస్థిరతలను అధిగమించేందుకు ఇదొక సాధనం. పైగా ఇది అత్యంత లిక్విడిటీ ఉన్న సాధనం. కనుక పెట్టుబడుల్లో బంగారానికి చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. రిస్క్‌ను తగ్గించి దీర్ఘకాలంలో విలువను పెంచేది కనుక దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. బంగారంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడికి ఢోకా లేదు ఒక కంపెనీ షేరులో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ కంపెనీ వ్యాపారం దెబ్బతిని కుదేలైపోతే పెట్టుబడి కూడా హరించుకుపోతుంది. కానీ, బంగారంలో పెట్టుబడికి ఢోకా లేదు. 3,000 ఏళ్ల చరిత్రలో బంగారం విలువ కానీ, ధర కానీ సున్నా కాలేదు. అందుకే కష్టకాలంలో అసలైన ఆస్తులు ఏవంటే? బంగారం, భూమి అని చెబుతారు. పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉంటే, కష్టకాలం ఎదురైతే దీని సాయంతో గట్టెక్కొచ్చన్న భరోసా ఉంటుంది. అత్యవసరాల్లో ఆదుకుంటుంది.. బంగారం కష్టకాలంలో ఆదుకునే సాధనం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో, స్టాక్ మార్కెట్ పతనాల్లో సురక్షిత సాధనంగా పసిడివైపే చూస్తుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరం పడితే, బంగారం విక్రయించి గట్టెక్కొచ్చు. లేదంటే కనీసం ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందొచ్చు. రుణంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ప్రస్తుతం బంగారంపై బ్యాంకులు 8–9%రేటును వసూలు చేస్తున్నాయి. లిక్విడ్ అసెట్ బంగారం కొనుగోలు, విక్రయం చాలా సులభం. అంటే ఇది లిక్విడ్ అసెట్ అవుతుంది. భూమి/ఇల్లు లిక్విడ్ అస్సెట్ కాదు. ప్రాపర్టీ అనేది కోరుకున్న వెంటనే, అవసరంలో వేగంగా అమ్ముడుపోయే సాధనం కాదు. మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయిస్తే తప్ప ప్రాపర్టీల విక్రయానికి కొంత సమయం తీసుకుంటుంది. లావాదేవీ ముగిసి, చేతికి డబ్బు అందడానికి కనీసం మూడు నెలలు అయినా సమయం పడుతుంది. ప్రత్యేక నైపుణ్యాలు అక్కర్లేదు స్టాక్స్‌లో పెట్టుబడులకు మంచి పరిజ్ఞానం ఉండాలి. ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా కనీస పరిజ్ఞానం లేదా నిపుణుల సాయం కావాలి. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలంటే మార్కెట్ ధరల తీరు, భవిష్యత్ వృద్ధి అవకాశాల గురించి అవగాహన ఉండాలి. న్యాయ నిపుణుల సలహాలు కూడా అవసరం పడతాయి. క్రిప్టో కరెన్సీలు అయినా, బాండ్లు అయినా అవగాహనతో కొనుగోలు చేయాల్సిందే. కానీ, బంగారానికి ఇవేమీ అక్కర్లేదు. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ బంగారాన్ని ద్రవ్యోల్బణానికి హెడ్జ్‌గా పరిగణిస్తుంటారు. ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో కరెన్సీ విలువలు క్షీణిస్తుంటాయి. గత దశాబ్ద కాలంలో డాలర్ మారకంలో రూపాయి తన విలువను రెట్టింపు మేర కోల్పోయింది. కానీ, బంగారం ధర గత ఐదేళ్లలో రెట్టింపైంది. గత దశాబ్దంలో నాలుగు రెట్లు పెరిగింది. వడ్డీ రేట్లను దాటుకుని ద్రవ్యోల్బణం పరుగులు తీస్తున్న తరుణంలో బంగారంలో పెట్టుబడితో భరోసా లభిస్తుంది. పదేళ్ల కాలంలో బంగారంలో వార్షిక సగటు రాబడులను గమనిస్తే రెండంకెల్లో ఉన్నట్టు ఇక్కడి టేబుల్ చూస్తే తెలుస్తుంది. అంటే ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు రాబడి బంగారంలో సాధ్యమేనని తెలుస్తోంది. -
కనిపించని బంగారం.. కురిపించును కనక వర్షం
ఉమన్ ఫైనాన్స్ ప్రస్త్తుతం పసిడిలో పెట్టుబడికి ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఫిజికల్ గోల్డ్ : ఆభరణాలు, నాణేలు, కడ్డీలు. 2.పేపర్ గోల్డు : గోల్డ్ ఇ.టి.ఎఫ్. (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. 1. ఫిజికల్ గోల్డ్ అవసరం ఉన్నంత మేరకు శుభకార్యాలకు పసిడి ఆభరణాల చేయించడం మంచిదే. అయితే ఫిజికల్ గోల్డ్‌తో వ్యవహరించేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తరుగు, మజూరి ఖర్చులు రావు.ఏ షాపులోనైతే కొన్నారో అదే షాపులో అమ్మినప్పుడు మాత్రమే ఆభరణం ఉన్న బరువుకు సరిపడా బరువు బంగారం ఇస్తారు. వేరే షాపులో అయితే తగ్గిస్తారు. చాలావరకు షాపు యజమానులు బంగారు ఆభరణాలు అమ్మినా, మళ్లీ ఆభరణాలే ఇస్తారు. డబ్బులు ఇవ్వరు. చాలామంది లాకర్లలో నగలు దాచి పెడతారు. కానీ వాటి విలువకు సరిపడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోరు. దీనివలన ఏదైనా దొంగతనం లేదా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు బ్యాంకువారు నామమాత్రపు ఇన్సూరెన్స్‌ను మాత్రమే అందజేస్తారు. మన బంగారం మార్కెట్లో స్వచ్ఛత, సర్టిఫికేషన్ల విషయంలో పూర్తిస్థాయిలో క్రమబద్దీకరించబడలేదు. కనుక చాలామంది మోసపోతూ ఉంటారు. బ్యాంకుల నుండి నాణేలు, కడ్డీలు కొనేటప్పుడు తిరిగి వాటిని బ్యాంకులు కొనవు. తిరిగి వాటిని షాపులవారి వద్దనే అమ్మాలి. ఇక్కడ కొంత నష్టపోవలసి ఉంటుంది. 2. పేపర్ గోల్డ్.. గోల్డ్ ఇ.టి.ఎఫ్ ఒక గోల్డ్ ఇ.టి.ఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం. ఈ ఇ.టి.ఎఫ్.లలో గోల్డ్ కొనడానికి డీమాట్, ట్రేడింగ్ ఎకౌంట్ తప్పనిసరి. ఇ.టి.ఎఫ్.లు ఆన్లైన్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి కొనుగోళ్లు అమ్మకాలు సులభం. బంగారం ధర పడినప్పుడల్లా క్రమబద్ధంగా ఇ.టి.ఎఫ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫిజికల్ బంగారంలో ఎదురయ్యే ఇబ్బందులు (లాకర్ ఛార్జీలు, తరుగు, క్వాలిటీ మొదలైనవి) ఇక్కడ ఉండవు. బంగారంపేపరు రూపంలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ బంగారం కొనవలసి ఉంటే ఆన్లైన్లో అమ్మేసి బంగారం కొనవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: గోల్డ్ ఇ.టి.ఎఫ్. వలే కాకుండా వీటిలో నెలనెలా 500 రూపాయల కనీస మొత్తంతో కూడా (సిప్ పద్ధతిలో) పెట్టుబడి పెట్టవచ్చు. నెలనెలా బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఒక మంచి పద్ధతి. పెట్టుబడుల కేటాయింపులలో భాగంగా మీ మిగులు మొత్తాలలో 5 శాతం నుండి 10 శాతం వరకు బంగారంలో కేటాయింపులు జరుపవచ్చు. కేవలం పెట్టుబడి దృక్పథంతో బంగారం కొనుగోలు చేయాలనుకొనేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్ స్కీం అనువైనదిగా చెప్పవచ్చు. -
బంగారం మదుపు ఇలాగైతే సురక్షితం!
పొదుపు సలహా మేమొక చిన్న కిరాణాషాపు నడుపుకుంటున్నాం. మాకు 4, 6 తరగతులు చదువుతున్న ఇద్దరమ్మాయిలు. వాళ్లకోసం నెలకొక గ్రాము చొప్పున సంవత్సరానికో తులం బంగారం కొనాలనుకుంటున్నాను. అలా వాళ్ల పెళ్లి సమయానికి వారికి కావలసిన నగలు చేయించాలని నా ఆలోచన. బంగారం కొనుగోలుకు రకరకాల స్కీములున్నాయి కదా, వాటిలో ఏది మెరుగైనదో సలహా ఇవ్వగలరు. - కవిత, కైకలూరు మీరన్నట్లు నగదును బంగారం రూపంలో మదుపు చేసేందుకు అనేక మార్గాలున్నాయి. వాటి గురించి తెలియచేస్తాను. మీకు అనుకూలమైనదేదో మీరే ఎంచుకోవచ్చు. నగల దుకాణాలు: నాణేల రూపంలో లేదా ఆభరణాల రూపంలో మీరు నెలనెలా లేదా సంవత్సరానికోసారి నగల దుకాణాల్లో బంగారం కొనుక్కోవచ్చు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి. మీరు కొన్న నాణేలను లేదా ఆభరణాలను మార్పిడి చేసే సమయంలో తరుగు, మజూరీ రూపేణా భారీగా నష్టపోవాల్సి రావచ్చు. వాటి భద్రత, మన్నిక, నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు: బంగారం పెట్టుబడుల విషయంలో స్టాక్మార్కెట్లో ఉన్న విధానాల్లో ఇది మెరుగైనది. ఇందుకోసం మీరు డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాల్సిన కనిష్టమొత్తం ఒక గ్రాము. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ఈ పద్ధతిలో మీరు నెలనెలా ఈ ఫండ్రూపంలో దాచుకునే మొత్తంతో మీ ఖాతాలో ఎప్పటికప్పుడు బంగారం జమ అవుతుంటుంది. కాకపోతే వస్తురూపంలో కాక బాండ్ల రూపంలో కనిపిస్తుంది. మొదటిదాని కంటె తర్వాతి రెండు విధానాలూ చాలా మెరుగైనవి, స్వచ్ఛత విషయంలో, భద్రత విషయంలో, బీమా విషయంలో కూడా సురక్షితమైనవి. ఈ పద్ధతుల్లో బంగారం మదుపు చేయడానికి మీరు కొద్దిమొత్తంలో బ్రోకరేజి, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాల మజూరీ, తరుగు, లాకర్లలో దాచుకోవడానికయ్యే ఖర్చులు, శ్రమతో పోల్చితే ఇది చాలా తక్కువ. - రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ