breaking news
G.K. Vasan
-
కొత్త పార్టీకి పేరే ప్రాణం
కొత్త పార్టీకి ప్రజాకర్షణ కలిగిన పేరే ప్రాణం. ఆదరణ పొందాలంటే ప్రాచుర్యం పొందిన పేరుండాలి. అయితే, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌కు ఆ పేరుతోనే పెద్ద చిక్కు వచ్చిపడింది. తండ్రి జీకే మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) తనకు దక్కేనా అనే సంకటస్థితిలో జీకే వాసన్ పడిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:పార్టీల ఆవిర్భావం, మరో పార్టీలో విలీనం రాజకీయాల్లో సహజమే. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడాన్ని తీవ్రంగా నిరసించిన సీనియర్ కాంగ్రెస్ నేత జీకే మూపనార్ 1996లో తమిళ మానిల కాంగ్రెస్(తమాకా)ను స్థాపించి, బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. ప్రజాభిమానంతో పెద్ద సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. మూపనార్ మరణం తరువాత ఆయన కుమారుడు జీకే వాసన్ ఆ పార్టీని 2002లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆయన లిఖితపూర్వకంగా తెలియజేశారు. సీఈసీ సైతం ఆమోదించింది. అయితే జీకే మూపనార్ హయాంలోనే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత శాఖ అధ్యక్షునిగా ఉన్న తేనీ జయకుమార్ యథాప్రకారం కొనసాగారు. పార్టీ విలీనం పద్ధతి ప్రకారం జరగలేదంటూ పార్టీని నిర్వహించారు. 2006 వరకు పుదుచ్చేరి శాఖ అధ్యక్షునిగా కొనసాగిన తేనీ జయకుమార్ ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిపోవడంతో, అదే పార్టీలోని మరోనేత తులసీదాస్ అధ్యక్షుడు అయ్యూరు. అయితే పుదుచ్చేరి తమాకా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా నామమాత్రంగా నేటికీ కొనసాగుతోంది. తమిళనాడు ప్రజలకు చిరపరిచితమైన తమాకా పేరునే పెట్టాలని జీకే వాసన్తోపాటూ ఆయన అనుచరుల్లో అధిక సంఖ్యాకులు ఆశిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా అదే పేరుతో పార్టీని రిజిస్టర్ చేసి ఉన్నందున కుదరదనిఎన్నికల అధికారులు వాసన్‌కు చెప్పేశారు. అంతేకాకుండా జీకేవీకి ఈసీ ప్రత్యామ్నాయాన్ని సూచించింది. ఎంజీఆర్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారంటూ ఒక ఉదంతాన్ని ఉదహరించింది. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకేతో విబేధించిన ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించాలని భావించారు. అయితే అనకాపుత్తూరుకు చెందిన రామలింగం అదే పేరుతో పార్టీని రిజిస్టర్ చేసి ఉన్నారు. దీంతో చేసేది లేక ఎంజీఆరే రామలింగం పార్టీలో చేరారు. ఆ తరువాత తనదైన శైలిలో అన్నాడీఎంకే అధ్యక్షునిగా మారి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. తప్పనిసరిగా తమాకా పేరునే కావాలని భావించిన పక్షంలో వాసన్ సైతం పుదుచ్చేరిలోని పార్టీలో చేరి తమిళనాడుకు విస్తరించవచ్చని ఈసీ సూచించింది. తమాకా పుదుచ్చేరి అధ్యక్షుడు తులసీదాస్ చేత అక్కడి పార్టీని రద్దు చేయించడం లేదా ఎంజీఆర్లాగా పుదుచ్చేరి పార్టీలో వాసన్ చేరిపోవడం మినహా గత్యంతరం లేదు. తమాకా పేరు ప్రజలకు చిరపరిచితం కాబట్టి అదే పేరును పెట్టడం వల్ల రాష్ట్రంలో వేగంగా బలపడవచ్చనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయంగా ఉంది. ఇది నిజమే అయినా ఈ చిక్కుల నుంచి బయటపడేదెలా అనే ఆలోచనలో పడిపోయారు. 16న పార్టీ పేరుకు అవకాశం కొత్త పార్టీ ఏర్పాట్లలో మునిగితేలుతున్న జీకే వాసన్ మంగళవారం సైతం సమీకరణల్లో మునిగారు. తనను కలుస్తున్న వారితోనూ, తానుగా వెళ్లి కలిసిన వారితోనూ చర్చలు జరిపారు. ఈనెల 12 లేదా 16న తిరుచ్చిలో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ పేరును ప్రకటించాలని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. మదురై జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు తమాకా పతాకాన్ని ఎగురవేయగా, ఈ రోడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోని జీకే వాసన్ ఫొటోను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడటం లేదని, రాష్ట్ర పార్టీకి ఆ పరిస్థితి ఎంతమాత్రం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక్కరోజునే వలస కొత్త పార్టీ పూర్తిగా పుట్టకముందే జీకేవీ అనుచరుడు దూరమయ్యూరు. జీకే వాసన్ పార్టీని పెట్టబోతున్నట్లు సోమవారం ప్రకటించిన సందర్భంలో కన్యాకుమారి జిల్లా ప్రిన్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే జాన్‌జాకబ్ ఆయన వెంట నిలిచారు. మంగళవారం ఉదయాన్నే జాన్‌జాకబ్ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాను జీకే వాసన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడన్నది వాస్తవమే అని, అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో లేరు, పార్టీని వీడేంత గడ్డుపరిస్థితులు లేవని తాను భావిస్తున్నట్లు మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. -
అధిష్టానంపై ఆగ్రహం
చెన్నై, సాక్షి ప్రతినిధి: యూపీఏ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ అధిష్టానంపైనా కేంద్ర మంత్రి జీకే వాసన్ నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగలడానికి అధిష్టాన వైఖరే కారణమని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర సమస్యలను వివరించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సోమవారం ఢిల్లీలో కలుసుకున్న జీకే వాసన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సముద్రంలో చేపల వేటపై శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య ఏళ్లతరబడి నలుగుతున్న సమస్య, శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించడంలో చొరవ చూపకపోవడం, శ్రీలంక ఆధీనంలో ఉన్న తమిళ జాలర్ల పడవలను విడిపించకపోవడం వంటి అనేక సమస్యలపై యూపీఏ ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంభించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఉదాశీన వైఖరితో వ్యవహరించడం అవస్థల పాల్జేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో వేగంగా తీసుకోవలసిన నిర్ణయాలపై జరుగుతున్న జాప్యం రాష్ట్రంలో ప్రచార వ్యూహ రూపకల్పనకు అవరోధమైందని అన్నారు. కాంగ్రెస్ గెలుపునకు ఇంత వరకు దిశానిర్దేశనమే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రాలేదని అన్నారు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని, ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు తమకు గెలుపును ప్రసాదిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాబితాపై కసరత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు తప్పదని దాదాపుగా తేలిపోవడంతో పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక పనిలో పడింది. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్, ముకుల్‌వాస్నిక్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత, హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్ బృందం ఢిల్లీలో మంగళవారం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 39 స్థానాలకు 1200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1ః5 నిష్పత్తి ప్రకారం ఒక్కో నియోజకవర్గానికి అభ్యర్థుల జాబితాను ఈనెల 11వ తేదీన ఢిల్లీలో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సాయంత్రానికి జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పుదుచ్చేరిలోని ఒక స్థానానికి కూడా అభ్యర్థిని నిలిపే యోచనలో కాంగ్రెస్ ఉంది.