breaking news
GK Pillai
-
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు. -
పాత కేసు-కొత్త మలుపు
రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు, ఎత్తుగడలు వచ్చి చేరితే ఎలాంటి విషయమైనా ఎంత జటిలంగా మారుతుందో చెప్పడానికి ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు ప్రబలమైన ఉదాహరణ. 2004లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల బాలిక ఇష్రాత్ జహాన్ మరో ముగ్గురితోపాటు ఎన్కౌంటర్లో మరణించిన ఉదంతం ఇన్నేళ్ల తర్వాత కూడా మిస్టరీగా మిగిలిపోవడమేకాక దాని చుట్టూ కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. తన కుమార్తెను అన్యాయంగా చంపి, ఆమెపై ఉగ్రవాది ముద్ర వేశారని...ఇందుకు కారకులైనవారిని శిక్షించాలని ఇష్రాత్ తల్లి దాఖలు చేసిన పిటిషన్ మాత్రం దారీతెన్నూ లేకుండా మిగిలిపోయింది. ఈ కేసులో హైకోర్టు ఎదుట 2009లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రెండు రకాల అఫిడవిట్లు ఈ కొత్త వివాదాలకు మూలం. ఇష్రాత్ జహాన్ లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది అని మొదటి అఫిడవిట్ చెప్పగా...రెండో అఫిడవిట్ ఆ సంగతిని అసలు ప్రస్తావించలేదు. ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం జోక్యం కారణంగానే ఈ మార్పు చోటు చేసుకున్నదని, ఈ విషయంలో తనను సంప్రదించలేదని ఆనాటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అంటుంటే...నరేంద్ర మోదీ, అమిత్ షాలను రాజకీయంగా దెబ్బతీసేందుకే చిదంబరం ఈ పని చేశారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఇదే అదునుగా ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులపై సాగుతున్న ప్రాసిక్యూషన్ చర్యలన్నిటినీ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు తీసుకుంటున్న మలుపులు, కొత్తగా వచ్చి చేరుతున్న వివాదాలు సాధారణ పౌరులను ఆశ్చర్యపరుస్తాయి. తన కుమార్తెను బూటకపు ఎన్కౌంటర్లో చంపారని ఒక తల్లి చేసిన ఆరోపణకు సంబంధించిన కేసు ఇన్నేళ్లయినా తేలకపోగా... ఆమె ఉగ్రవాది అవునా, కాదా అనే అంశం చుట్టూ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆరోపిస్తున్నట్టు ఈ కేసులో చిదంబరం వ్యవహార శైలి అనుమానించదగిందే కావొచ్చు. ఆయన లక్ష్యం నరేంద్రమోదీ, అమిత్ షాలే అయి ఉండొచ్చు. పిళ్లై అంటున్నట్టు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అఫిడవిట్‌ను మార్చి ఉండొచ్చు. ఆ అంశంలో ఎవరి దోషమెంతో తేల్చి దర్యాప్తు సంస్థలను, నిఘా సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్న వైనాన్ని, అందుకోసం అడ్డగోలుగా వ్యవహరించిన తీరునూ బయటపెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అందువల్ల దర్యాప్తు సంస్థల, నిఘా సంస్థల పని విధానం మెరుగుపడి, అందులో రాజకీయ జోక్యం తగ్గితే అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మరోపక్క చిదంబరంపై కోర్టు ధిక్కార నేరం కింద విచారణ జరపాలన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఇష్రాత్ మరణం మాటేమిటి? ఆమె నిజమైన ఎన్కౌంటర్లో మరణించిందో లేక నకిలీ ఎన్కౌంటర్లో చనిపోయిందో తేలవలసిన అవసరం లేదా? గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం ఇష్రాత్తోపాటు మరో ముగ్గురు యువకులు అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని హతమార్చడానికి బయల్దేరారు. ముందుగానే ఈ సమాచారం అందుకున్న తాము వారిని అడ్డగించడానికి ప్రయత్నించినప్పుడు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నదని పోలీసులు చెబుతున్నారు. అయితే 2009లో అహ్మదాబాద్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన దర్యాప్తు నివేదికగానీ, 2011లో పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిన నివేదికగానీ ఈ కథనంతో విభేదించాయి. ఆ నలుగురినీ పోలీసులు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే కాల్చి చంపారని తేల్చాయి. పర్యవసానంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సహా 21మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో అయిదేళ్లు గడిచినా ఆ కేసులో విచారణ ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. ఇష్రాత్ జహాన్ ఉగ్రవాది అని చెప్పడానికి పోలీసులు ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించిన విషయాలను ఆధారంగా చూపుతున్నారు. 2005లో లష్కరే అధినేత జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ వద్ద ఇష్రాత్ పేరు ప్రస్తావనకొచ్చిందని 2010లో హెడ్లీ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈమధ్యే ముంబై కోర్టుకు ఇచ్చిన సాక్ష్యంలో మరోసారి ఆమెకు లష్కరే సంస్థతో సంబంధాలున్నాయని అన్నాడు. ఈ సంగతిని చర్చలోకి తీసుకురావడంద్వారా ఇష్రాత్‌ను కాల్చిచంపడం సబబేనన్న అభిప్రాయాన్ని కలగజేయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆమె తల్లి అంటున్నది. మగదిక్కులేని తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఇష్రాత్ చదువుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పేదని, ఆ ఆదాయం సరిపోక తమ కుటుంబానికి తెలిసిన జావేద్ అనే వ్యక్తి ద్వారా వేరే పనిలో చేరిందని ఆమె చెబుతున్నారు, అలా చేరిన నెలన్నర లోపే ఈ ఘటన చోటు చేసుకున్నదంటున్నారు. ఇష్రాత్పై అంతకు ముందెన్నడూ ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని ఆమె గుర్తుచేస్తున్నారు. అటు మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ నివేదిక, ఇటు సిట్ నివేదిక కూడా ఆ సంగతినే ధ్రువీకరించాయి. ఇప్పుడు అఫిడవిట్లపై జరుగుతున్న రగడ వింత గొలుపుతుంది. తన ప్రమేయం లేకుండానే, తనకు తెలియకుండానే అఫిడవిట్లను మార్చినప్పుడే జీకే పిళ్లై అభ్యంతరం చెప్పి ఉండాలి. ఎందుకంటే ఆయన సాధారణ గుమాస్తా కాదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఆ స్థాయి ఉన్నతాధికారి కేంద్ర హోంమంత్రి వ్యవహరించిన తీరును ప్రశ్నించి ఉంటే వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నందుకు అందరూ అభినందించేవారు. ఆ క్రమంలో పదవిని కోల్పోయినా ఆయనకంటూ గౌరవం దక్కేది. అప్పుడు మౌనంగా ఉండిపోవడంవల్ల ఇప్పుడు చెప్పే మాటలకు విలువ లేకుండా పోతుందని ఆయన గ్రహించలేకపోతున్నారు. ఇంతకూ తొలి అఫిడవిట్లోనైనా ఇష్రాత్ లష్కరే ఉగ్రవాది అని తేల్చడానికి తగిన సమాచారమేమీ పొందుపరచ లేదు. 2004 జూలై 15న కొన్ని పత్రికల్లో ఆమె లష్కరే సంబంధాల గురించి వెలువడిన వార్తలు మినహా అందులో మరేమీ లేదు. ఇంత బలహీనమైన అంశంపై ఈ స్థాయిలో రాద్ధాంతం చోటు చేసుకోవడం చిత్రమే. పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి గనుక తమదే పైచేయి అని చాటుకోవడానికి అధికార, విపక్షాలు ప్రయత్నిస్తాయి. అది సహజమే. కానీ ఆ క్రమంలో ఒక అనుమానాస్పద మరణంపై సాగుతున్న విచారణ అతీగతీ లేకుండా మిగిలిపోకూడదు. తన కుమార్తెది హత్యే అయిన పక్షంలో కారకులను దండించాలన్న ఒక తల్లి డిమాండ్‌ను ఉపేక్షించకూడదు. -
తెలంగాణ ఏర్పాటుకు ఇది సందర్భం కాదు: జికె పిళ్లై
ముంబై: తెలంగాణ ఏర్పాటుకి ఇది సందర్భం కాదని కేంద్ర హోమ్ శాఖ మాజీ సెక్రటరి గోపాల కృష్ణ పిళ్లై (జికె పిళ్లై) వ్యాఖ్యానించారు. ముంబై నుంచి వెలువడే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డిఎన్ఎకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారని అంటూనే, అయితే ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు. తెలంగాణాకి ప్రత్యేక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడమన్నది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో అత్యుత్తమమైందని పిళ్లై అభిప్రాయపడ్డారు. ఆ ప్రయోగం ఎటువంటి ఫలితాన్నిస్తుందో రెండు మూడేళ్లు చూశాక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అప్పుడు నిర్ణయం తీసుకొని ఉండవల్సిందని ఆయన అన్నారు. రాజధాని విషయంలో శ్రుతి మించిన యాగీ జరుగుతోంది గానీ, నీటి సమస్యే ప్రధానమైనదని, ప్రత్యేక రాష్త్ర ఆవిర్భావం వల్ల తలెత్తే ముఖ్యమైన సమస్యల గురించి అడిగిన ఒక ప్రశ్నకి బదులుగా అన్నారు. సారవంతమైన కోస్తా భూములకి నీరు తెలంగాణా నుంచే రావలసి ఉన్నందు వల్ల, తెలంగాణాలో ఆనకట్టలు కడితే తాము ఏమైపోతామోనన్న ఆందోళన కోస్తా ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. అయితే, ఆనకట్టలు ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు కట్టుకునే అవకాశం లేదని, దానికి అంతర్ రాష్ట్ర జల మండలి అంగీకారం కావల్సిఉంటుందని మాజీ హోమ్ సెక్రెటరి అన్నారు. తెలంగాణా ఏర్పాటు వల్ల దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న డిమాండ్లకు మరింత ఊపందుకుంటాయన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తూ, రెండవ రాష్ట్ర పునర్విభజన కమిటీ (ఎస్సార్సీ) ఏర్పాటు చేయడమే దానికి పరిష్కారమని పిళ్లై అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రాతిపదికను రెండవ ఎస్సార్సీ స్పష్టంగా రూపొందించాలన్నారు. ఆ తర్వాత మాత్రమే, కొత్త రాష్ట్రాల డిమాండ్ మీద పార్లమెంటు తరిచి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.