మార్కెట్లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీటీ ఎస్
ధర రూ. 2.4 కోట్లు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్లు తయారు చేసే జర్మనీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ జీటీ ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.4 కోట్లు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. 15 కొత్త కార్లను భారత మార్కెట్లోకి అందిస్తామని ఈ ఏడాది మొదట్లోనే చెప్పామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గార్ పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఈ కొత్త కారును తెచ్చామని, ఈ ఏడాది తామందిస్తున్న 14వ కొత్త కారు ఇదని వివరించారు.
4-లీటర్ బై-టర్బో ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఆడాప్టివ్ బ్రేక్ లైట్స్, కాంపొజిట్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ చైల్డ్ సీట్ రికగ్నిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని చెప్పారు. భారత్‌లో అమ్ముడవుతున్న ఏఎంజీ కార్లలో అత్యంత వేగవంతమైన కారు ఇదే. గరిష్ట వేగం గంటకు 310 కి.మీ. 0-100 కి.మీ. వేగాన్ని 3.8 సెకన్లలోనే అందుకోగలుగుతుంది. ఇతర వాహనాలను ఢీకొట్టకుండా చూసే కొలిజన్ ప్రివెన్షన్ అసిస్ట్ ప్లస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.