రూ.80 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులకు ఓకే
రక్షణ కొనుగోళ్ల మండలి నిర్ణయం
రూ. 50,000 కోట్లతో దేశీయంగా ఆరు జలాంతర్గాముల నిర్మాణం
ఇజ్రాయెల్ నుంచి రూ. 3,200 కోట్ల వ్యయంతో స్పైక్ మిసైళ్లు
రూ. 1,850 కోట్లతో 12 డోర్నియర్ నిఘా విమానాల కొనుగోలు
రూ. 662 కోట్లతో 362 యుద్ధ వాహనాల కొనుగోళ్లకు నిర్ణయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన జావెలీన్ క్షిపణులను కాదని.. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైక్ క్షిపణులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇజ్రాయెల్ నుంచి మొత్తం రూ. 3,200 కోట్ల వ్యయంతో యాంటీ-ట్యాంక్ గెడైడ్ మిసైళ్లను కొనుగోలు చేయాలని శనివారం రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి, త్రివిధ దళాధిపతులు, డీఆర్డీఓ చీఫ్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మొత్తం రూ. 80,000 కోట్ల విలువైన రక్షణ రంగ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా.. భారత నౌకాదళం కోసం రూ. 50,000 కోట్ల వ్యయంతో దేశీయంగానే ఆరు జలాంతర్గాములను నిర్మించాలని నిర్ణయించారు. రూ. 1,850 కోట్లతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 అభివృద్ధి పరచిన డోర్నియర్ నిఘా విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (పశ్చిమబెంగాల్) నుంచి రూ. 662 కోట్లతో 362 యుద్ధ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ఇజ్రాయెల్‌కు చెందిన రఫాయేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే సంస్థ స్పైక్ యాంటీ-ట్యాంక్ గెడైడ్ మిసైళ్లను తయారు చేస్తోంది. ఈ సంస్థ నుంచి 8,356 మిసైళ్లు, 321 లాంచర్లను ఏకమొత్తంలో కొనుగోలు చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సైనికులు చేతులతో తీసుకెళ్లి పేల్చగలిగే ఈ మిసైళ్లు.. పేల్చడానికి ముందు లక్ష్యాన్ని లాక్ చేసుకుంటాయని, ఆ తర్వాత వాటికవే లక్ష్యాన్ని ఛేదిస్తాయని పేర్కొన్నాయి. అలాగే.. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు చెందిన ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు బదలాయించటం, తద్వారా భారీ ఎత్తున ఈ మిసైళ్లను ఉత్పత్తి చేయటం అనేది కూడా ఒప్పందంలో భాగమని ఆ వర్గాలు వివరించాయి.
వాస్తవానికి.. అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కార్ప్, రేతియాన్ కంపెనీలు కూడా ఇదే తరహా క్షిపణులు ‘జావలీన్’లను తయారు చేస్తున్నాయి. ఈ మిసైళ్లతో పాటు, అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, చినాయ్ భారీ రవాణా హెలికాప్టర్లను భారత్‌కు అమెరికా అమ్మజూపుతోంది. మొత్తం రూ. 20,000 కోట్ల విలువ గల ఈ ఆయుధ విక్రయాల ఒప్పందంపై గత నాలుగేళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. జావెలీన్ మిసైళ్లు కొనుగోలు చేస్తే సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని భారత్ కోరగా అమెరికా నిరాకరించింది. ఇటీవల తన వైఖరిని మార్చుకుని ఆ మిసైళ్లను కొనుగోలు చేస్తే.. వాటిని ఉమ్మడిగా ఉత్పత్తి చేసి, అభివృద్ధి చేసేందుకు సిద్ధమని అమెరికా ప్రతిపాదించినా.. జావెలీన్ మిసైళ్లను కాదని ఇజ్రాయెల్ నుంచి స్పైక్ మిసైళ్లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించటం విశేషం.
జలాంతర్గాముల నిర్మాణానికి కమిటీ..
దేశీయంగానే జలాంతర్గాముల తయారీ కోసం రక్షణ శాఖ త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని.. ఈ కమిటీ 6 నుంచి 8 వారాల పాటు దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు నౌకాశ్రయాలను అధ్యయనం చేస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పలు ఇతరత్రా ప్రమాణాలతో పాటు ఆయా నౌకాశ్రయాలకు ఆరు జలాంతర్గాములను నిర్మించగల సామర్థ్యం, సిబ్బంది ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తుందని వివరించాయి. అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ప్రతిపాదనలకు ఆహ్వానం) జారీ చేస్తుందని తెలిపాయి. నౌకాదళానికి ప్రస్తుతం 13 జలాంతర్గాములు (పనిచేస్తున్నవి) ఉన్నాయి. 2030 నాటికి 30 జలాంతర్గాములను సమకూర్చుకోవాలన్నది 1999లో నిర్దేశించుకున్న లక్ష్యం.