breaking news
GDP figures
-
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్‌పీఐ పెట్టుబడులు, యూఎస్ టారిఫ్ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ గత(ఏప్రిల్) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.గణాంకాలు కీలకం మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. ఇతర అంశాలు గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్‌పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపునకు యూఎస్ ఫెడరల్ కోర్టు చెక్ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.పెట్టుబడులకే ఎఫ్‌పీఐల మొగ్గు మే నెలలో రూ. 19,860 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్‌లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2024 అక్టోబర్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! -
మార్కెట్‌ను ముంచేసిన అంతర్జాతీయ అస్థిరతలు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు మరోసారి మన మార్కెట్‌ను ముంచేశాయి. ఆరున్నర గంటల పాటు అమ్మకాల పరంపరం కొనసాగడంతో సూచీలు గడిచిన తొమ్మిది నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు వెల్లువెత్తడం సూచీలు భారీ క్షీణతకు దారితీసింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,939 పాయింట్ల నష్టంతో 49,100 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,149 పాయింట్ల మేర నష్టపోయి 48,890 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏకంగా 630 పాయింట్ల పతనమై 14,467 వద్దకు దిగజారింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సూచీలతో పాటు ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ సూచీలు 5% పతనమయ్యాయి. మెటల్, ఫార్మా, ఐటీ, ఆటో ఇండెక్స్‌లు 3% పతనయ్యాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో వడ్డీరేట్ల పెరుగుదల భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి భారీ పతనం ప్రతికూలాంశాలుగా మారాయి. దేశీయ మార్కెట్‌ను రానున్న రోజుల్లో క్యూ3 జీడీపీ గణాంకాలు కొంతకాలం ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలం పాటు మన మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలనే అనుసరిస్తుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని అంశాలు... ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లు, నిఫ్టీలోని 50 షేర్లలో ఏ ఒక్క షేరూ లాభంతో ముగియలేదు. ► మార్కెట్లో ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది. ► క్రూడాయిల్ ధర కాస్త దిగిరావడంతో ఓఎన్జీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా షేరు ఎనిమిది శాతం పతనంతో రూ.111 వద్ద ముగిసింది. ► హెచ్డీఎఫ్సీ ద్వయం షేరు 4 నుంచి 5 శాతం పతనయ్యాయి. నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టం సూచీలు మూడు శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు 5.43 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టాన్ని చూవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచ్చింది. పతనానికి కారణాలు... ► భయపెట్టిన బాండ్ ఈల్డ్స్ ... కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా పుంజుకుంటోంది. వ్యవస్థ ఊహించని రీతిలో వృద్ధి బాట పట్టడంతో రానున్న రోజుల్లో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తిరిగి వడ్డీరేట్లను పెంచవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఈక్విటీలతో పోలిస్తే బాండ్లలో పెట్టుబడులకు రిస్క్ సామర్థ్యం చాలా తక్కువ. పైగా వడ్డీరేట్ల పెంపుతో బాండ్ల నుంచి అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఈక్విటీల నుంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు. ► మళ్లీ పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఒకపక్క దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనూ తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు మార్కెట్ వర్గాలను భయపెట్టాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 15వేల కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పెరుగుతున్న కేసుల నియంత్రించే చర్యల్లో భాగంగా స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన లాక్డౌన్ చర్యలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఆంటంకాన్ని కలిగించవచ్చనే ఆందోళనలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. ► లాభాల స్వీకరణ.. అప్రమత్తత! అంతకుముందు సూచీలు మూడురోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 1295 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అలాగే మార్కెట్ ముగింపు తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల కానుండటంతో ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ► ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు... పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య రాజుకున్న ఘర్షణలు కూడా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం రాత్రి రెండు శాతం నష్టంతో ముగిశాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లపై పడటంతో శుక్రవారం ఆసియాలో ప్రధాన దేశాలైన జపాన్, చైనా, సింగపూర్, కొరియా, తైవాన్ దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు 2–3 % శాతం నష్టాన్ని చవిచూశాయి. ► రూపాయి భారీ పతనం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ కుప్పకూలింది. గత 19 నెలల్లోలేని విధంగా 104 పైసలు కోల్పోయింది. 73.47 వద్ద ముగిసింది. -
6.1 నుంచి 6.6 వరకూ...
⇔ తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధిపై అంచనాలు ⇔ నేడే గణాంకాల విడుదల న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ త్రైమాసిక (2017, ఏప్రిల్–జూన్) గణాంకాలు ఆగస్టు 31వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో దీనిపై విభిన్న వర్గాల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి. 6.1 శాతం నుంచి 6.6 శాతం శ్రేణిలో ఈ లెక్కలు ఉన్నాయి. జనవరి–మార్చి మధ్య జీడీపీ గణాంకాలు కేవలం 6.1 శాతంగా నమోదుకాగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 7.1 శాతం వృద్ధి నెలకొంది. ఇక నాల్గవ త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6%గా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న గణాంకాలపై వివిధ సంస్థల అంచనాలు చూస్తే... నొమురా: తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 6.6% ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అంచనావేసింది. కాగా, ఆర్థికాభివృద్ధి పరంగా డీమోనిటైజేషన్, జీఎస్టీ నుంచి నెలకొన్న ప్రతికూలతలు తొలగిపోతున్నట్లు నొమురా పేర్కొంది. ఇక్రా: జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగానే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇక జీవీఏ వృద్ధి రేటు 6.3 శాతానికి తగ్గుతుందని ఇక్రా అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 7.6 శాతం. వస్తు సేవల పన్ను అమలు, రూపాయి బలోపేతం వంటి అంశాలను ఇందుకు కారణంగా చూపింది. ఇక జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 7.4% నుంచి 3.9%కి పడిపోతుందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. తయారీ, విద్యుత్, గ్యాస్, జలవనరుల సరఫరా, నిర్మాణ రంగాల పేలవ పనితీరును ఇందుకు కారణంగా చూపింది. జీవీఏ–జీడీపీ... వ్యత్యాసం! ఉత్పత్తివైపు లేదా సరఫరాలవైపు నుంచి ఆర్థిక క్రియాశీలతను జీవీఏ గణాంకాలు సూచిస్తే, వినియోగపరంగా లేదా డిమాండ్ పరంగా ఉన్న పరిస్థితిని జీడీపీ గణాంకాలు సూచిస్తాయి. లాభాలు...: వివిధ సంస్థల అంచనాల ప్రకారం– జీఎస్టీ, డీమోనిటైజేషన్ ప్రతికూల ఫలితాలు క్రమంగా వీడిపోతాయి. దేశంలో నెలకొన్న డిమాండ్ మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం పైన నిలబెట్టే వీలుంది. తన వర్షపాతం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పురోగతికి దోహదపుడుతుంది. నష్టాలు...: ఇప్పటికీ డీమోనిటేజేషన్ ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోలేదు. దీనికితోడు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో క్లిష్టత నెలకొంది. సేవలు, కార్పొరేట్ ఆదాయాలు, పెట్టుబడులు బలహీనంగానే ఉన్నా యి. ఇక పారిశ్రామిక వృద్ధి పేలవంగానే ఉంది. జీవీఏ వృద్ధి రేటు 7.3 శాతం: ఆర్బీఐ ముంబై: ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుందని ఆర్బీఐ2016–17 వార్షిక నివేదికలో పేర్కొంది. గతేడాది(2016–17) ఇది 6.6%. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 2017–18లో తొలి 6 నెలల్లో 2–3.5% శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ద్వితీయ భాగంలో ఈ రేటు 3.5–4.5% శ్రేణిలో ఉండొచ్చని వివరించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2017–18లో కొంత రికవరీ జరిగే అవకాశం ఉందని నివేదికలో అభిప్రాయపడింది. ఆర్బీఐ రుణ రేటు తగ్గింపు ప్రయోజనం బ్యాంకింగ్ నుంచి అన్ని రంగాలకూ సమానంగా అందడంలేదన్న ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18లో ఇప్పటివరకూ 4 రాష్ట్రాలు వ్యవసాయ రుణ రద్దు ప్రకటన చేశాయని, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయని పేర్కొన్న ఆర్బీఐ, ఇది స్వల్ప కాలంలో ద్రవ్య క్రమశిక్షణపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్ మొండిబకాయిల భారం ఆందోళనకరమైనదేనని పేర్కొంది. -
జీడీపీ గణాంకాలపై దృష్టి..!
- విదేశీ అంశాలు; చమురు, రూపాయి కదలికలు కూడా - ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల విశ్లేషణ - నేడు విడుదల కానున్న క్యూ1 జీడీపీ గణాంకాలు ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్థూల గణాంకాలు, విదేశీ నిధుల ప్రవాహం, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల ధోరణి ఇప్పుడప్పుడే తొలగిపోయే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. దీంతోపాటు రుతుపవనాల పురోగతి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్ధేశించడంలో కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు... సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు, ఆగస్టునెలకు సంబంధించి వాహన కంపెనీల అమ్మకాల డేటా(1న విడుదల అవుతుంది) కూడా స్వల్పకాలంలో మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ వారం కూడా తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి స్టాక్ మార్కెట్ పతనానికి పూర్తిగా విదేశీ అంశాలే కారణమని.. స్థూలంగా చూస్తే మన మార్కెట్ ఇంకా పటిష్టంగానే ఉందని గుప్తా పేర్కొన్నారు. భారీస్థాయిలో ఒడిదుడుకులు నెలకొన్నప్పుడు మార్కెట్ కుదుటపడేందుకు(బాటమ్ అవుట్) కొంత కాలం పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ‘గత వారంలో వెనక్కివెళ్లిన భారీ విదేశీ నిధులు మళ్లీ తక్షణం మార్కెట్లోకి తిరిగివచ్చే అవకాశాల్లేవు. ఇటీవల ఎదుర్కొన్న కుదుపులు కొనసాగవచ్చు. సమీప కాలంలో ఇన్వెస్టర్లు చైనా, అమెరికా(ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి) నుంచి వచ్చే వార్తలపై నిశితంగా దృష్టిపెట్టాలి. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ఫెడ్ వడ్డీరేట్ల పెంపును డిసెంబర్ వరకూ వాయిదా వేయొచ్చన్న వాదనలు జోరుగా వినబడుతుండటమే దీనికి కారణం. ఇక ఇప్పుడున్న ఒడిదుడుకుల సమయంలో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడమే సరైన వ్యూహం’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీ అంచనాలు... జూన్ క్వార్టర్(క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవగా, క్యూ1లో ఇది 6.7 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి క్వార్టర్లో వృద్ధి 7.4-7.5 శాతంగా ఉండొచ్చని... ప్రధానంగా వ్యవసాయ రంగం వృద్ధి రేటు దిగజారే అవకాశం ఉందని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి పేర్కొన్నారు. గత వారం మార్కెట్... చైనా మందగమనం, ఆ దేశ కరెన్సీ యువాన్ డీవేల్యూ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు గత వారంలో తీవ్ర కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ గత సోమవారం ఏకంగా 1,700 పాయింట్ల మేర కుప్పకూలింది. అయితే, ఆ తర్వాత భారీగానే కోలుకున్నప్పటికీ... వారం మొత్తంమీద 974 పాయింట్లు(3.55%) నష్టపోయి 26,392 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం గత వారంలో 298 పాయింట్లు(3.59%) క్షీణించి 8,002 వద్ద స్థిరపడింది. రూ.17,555 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు న్యూఢి ల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.17,555 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీస్ గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఆగస్ట్ 28 వరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.16,936 కోట్లను వెనక్కు తీసుకున్నారు. అదే సమయంలో మరో రూ.619 కోట్లను రుణ మార్కెట్ల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో మొత్తంగా ఎఫ్‌పీఐలు రూ.17,555 కోట్లను భారత స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలిన సోమవారం ఒక్కరోజే ఎఫ్‌పీఐలు నికరంగా రూ.5,173 కోట్ల షేర్లను విక్రయించారు.